హసీనా హత్యను అడ్డుకున్న ఫోన్‌కాల్!
- DV RAMANA

- Nov 24
- 2 min read
విద్యార్థుల దాడి నుంచి తప్పించుకున్న బంగ్లా మాజీప్రధాని
భారత్ నుంచి అజ్ఞాత అధికారి ఫోన్‌కాల్‌తో అప్రమత్తం
ఆమె నివాసాన్ని వీడిన 20 నిమిషాల్లోనే దాడులు
‘ఇన్షా బంగ్లాదేశ్’ పుస్తకంలో అప్పటి పరిణామాల ప్రస్తావన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
విద్యార్థుల ఆందోళనలను అణచివేసే క్రమంలో మానవ హక్కుల హననానికి పాల్పడి ఏకంగా 1400 మంది మరణానికి కారణమయ్యారన్న తీత్ర నేరారోపణలతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్(ఐసీటీ) ఈ నెల 17న మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేసేందుకు ఆమెకు అవకాశం ఉంది. కాగా ఇదే సమయంలో ఆమెకు సంబంధించి మరో అంశం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది బంగ్లాదేశ్‌లో మిన్నంటిన అల్లర్లలోనే హసీనా ఉద్యమకారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయే ముప్పు ఏర్పడిరది. అయితే చివరి నిమిషాల్లో భారత్ నుంచి వెళ్లిన ఓ ఫోన్‌కాల్ ఆమెను రక్షించిందని, ఆ కాల్ వల్లే కేవలం 20 నిమిషాల తేడాలోనే విద్యార్థి ఉద్యమకారుల దాడుల నుంచి తప్పించుకుని భారత్‌కు వచ్చేశారని తెలిసింది. ఇంతకూ ఆనాడు జరిగిన ఈ పరిణామాలను విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఇన్షా బంగ్లాదేశ్: యాన్ అన్ ఫినిష్డ్ రివల్యూషన్’ అనే పుస్తకంలో సమగ్రంగా ప్రస్తావించారు. గత ఏడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువజనులు చేపట్టిన ఉద్యమం యూనివర్సిటీల నుంచి జాతీయస్థాయికి విస్తరించింది. నిరసనలు, హర్తాళ్లతో రాజధాని ఢాకా సహా ముఖ్య పట్టణాలన్నీ అట్టుడికిపోయాయి. ఆ ఉద్యమం క్రమంగా అల్లర్లుగా మారి హింస, విధ్వంసం పెచ్చరిల్లడంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు, సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా ఢాకా సహా అనేక ప్రాంతాల్లో పోలీసు కాల్పులు, ఇతరత్రా హింసాకాండలో సుమారు 1400 మంది మరణించారని అంచనా. మరికొన్ని వేలమంది గాయపడ్డారు. ఉద్యమకారులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి రాజధాని ఢాకాను ముట్టడిరచారు. నాయకులు, మంత్రుల నివాస భవనాలను, పార్లమెంటు వంటి ప్రభుత్వ భవనాలపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన గణభవన్‌పైనా దాడి చేశారు. అయితే ఆ దాడి జరగడానికి సరిగ్గా 20 నిమిషాల ముందే ప్రధాని షేక్ హసీనా తన రాజీనామాను దేశాధ్యక్షుడికి పంపించి, కట్టుబట్టలతో దేశం వీడి భారత్‌కు వచ్చేశారు. వాస్తవానికి పారిపోవడానికి హసీనా మొదట అంగీకరించలేదు. ఏం జరిగినా తాను దేశం వీడే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు. సైనికాధికారులు చెప్పినా వినలేదు. దాంతో ఆమెను ఒప్పించడానికి సోదరి రెహానా, అమెరికాలో ఉంటున్న కుమారుడు వాజీద్‌లను బంగ్లా త్రివిధ దళాధిపతులు రంగంలోకి దింపారు. మరోవైపు ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళనకారులు ప్రధాని అధికార నివాసం దిశగా దూసుకొస్తున్నారు. అప్పటికే బంగ్లా అధికారుల విజ్ఞప్తి మేరకు హసీనా ప్రయాణించే విమానం తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు భారత్ అనుమతి ఇచ్చింది.
హెచ్చరించిన భారతీయ అధికారి
సరిగ్గా అప్పుడే.. 2024 ఆగస్టు 5న మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ నుంచి హసీనాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హసీనాతో బాగా పరిచయం ఉన్న ఉన్నతాధికారి నుంచి ఆ కాల్ వచ్చిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘అదొక షార్ట్ కాల్.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని హసీనాకు అవతలి వ్యక్తి చెప్పారు. తక్షణమే గణభవన్‌ను వీడకపోతే ఉద్యమకారులు చంపేస్తారని అప్రమత్తం చేసిన ఆయన.. భవిషత్యు పోరాటం కోసమైనా ప్రాణాలతో ఉండాలి కదా అని నచ్చజెప్పారు. దాంతో పరిస్థితి తీవ్రత అర్థమై హసీనా అవాక్కయ్యారు. కానీ ఆమె తన నిర్ణయం మార్చుకోవడానికి మరో అరగంట పట్టింది. ఫోన్ మెసేజ్‌ను పూర్తిగా విశ్వసించిన ఆమె.. బంగ్లాదేశ్‌ను వీడేముందు తన ప్రసంగాన్ని రికార్డు చేయడానికి అవకాశం ఇవ్వాలని తన సైనికాధికారులను కోరారు. అయితే ఏ క్షణమైనా ఆందోళనకారులు గణభవన్‌లోకి చొచ్చుకొచ్చే అవకాశం ఉండటంతో ఆమె విజ్ఞప్తికి సైనికాధికారులు ఒప్పుకోలేదు. మరోవైపు హసీనాను ఆమె సోదరి రెహానా బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. కేవలం రెండు సూట్‌కేసుల్లో బట్టలు మాత్రమే తీసుకుని మధ్యాహ్నం 2.23 గంటలకు సైనిక హెలికాప్టర్‌లో బయలుదేరి అరగంటలోపే భారత్‌కు చేరుకున్నారు. ఢల్లీి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఢల్లీిలోని గుర్తుతెలియని ప్రదేశంలో హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ పుస్తక రచయితలు దీప్ హల్దార్, జైదీప్ మజుందార్, షాహిదూల్ హసన్ ఖోకన్‌లు పేర్కొన్నారు. ఆ రోజు గనుక భారత్ నుంచి ఆ కాల్ రాకపోయినా, అరగంట ఆలస్యమైనా, హసీనా దేశం విడిచేందుకు అంగీకరించకపోయినా తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ మాదిరిగానే హత్యకు గురయ్యేవారని వారు అభిప్రాయపడ్డారు. బంగ్లా జాతిపితగా గుర్తింపు పొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ దంపతులతోపాటు వారి ముగ్గురు కుమారులను 1975 ఆగస్టు నెలలో వారి నివాస భవనంలోనే సైనికాధికారులు కాల్చిచంపారు. అప్పటికి విదేశాల్లో ఉండటం వల్ల హసీనా, ఆమె సోదరి రెహానా ప్రాణాలతో బయటపడ్డారు. 30 ఏళ్ల తర్వాత అదే ఆగస్టు నెలలో హసీనా, ఆమెతోపాటు ఉన్న సోదరి రెహానా ఫోన్‌కాల్ హెచ్చరిక కారణంగా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. అయితే ఆ కాల్ చేసిన అధికారి ఎవరన్న వివరాలను పుస్తక రచయితలు బయటపెట్టలేదు.










Comments