ఇక్కడ చెరువులుండాలే!
- BAGADI NARAYANARAO

- 6 days ago
- 2 min read
పెద్దోళ్ల భవనాలన్నీ చెరపట్టిన భూముల్లో కట్టినవే
ఊరి పేరుతో ఉన్నదానికీ ఆనవాళ్లు లేవు
వందల ఎకరాలు.. వేల కోట్లు చేతులు మారిపోయాయి
‘పేట’లో పార్టీలకతీతంగా ఆక్రమణదారులకు మద్దతు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రతీ ఊరికి ఆ పేరు వెనుక ఓ కథ ఉంటుంది.. అది శ్రీకాకుళమైనా, విశాఖపట్నమైనా. నరసన్నపేటకూ అటువంటి కథే ఉంది. నరసన్న చెరువు చుట్టూ ఏర్పడిన ఊరు పేట కాబట్టి, దానికి నరసన్నపేట అనే పేరొచ్చిందని ఊరు`పేరు పుస్తకంలో రచయిత వాండ్రంగి కొండలరావు పేర్కొన్నారు కూడా. ఎక్కడైనా నాగరికత నీరు చుట్టూనే ఏర్పడుతుంది. అది సింధూ గాని, ఈజిప్ట్ గాని. దాన్ని కాపాడుకోవడం భవిష్యత్ తరాల విధి. ఆ సింధూ ఉండబట్టే పెహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్‌ను భయపెట్టగలిగాం. నైలు నది ఉంది కాబట్టే.. ఈజిప్ట్ నాగరికతను సోషల్ పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అయితే ఇప్ప్పుడు నరసన్నపేటలో నరసన్న చెరువు ఎక్కడుందని మాత్రం అడగకండి. పేట మిగిలి చెరువు పోయింది. అలాగని ఈ ఒక్క చెరువే కాదు.. నరసన్నపేట నగరానికి ఆనుకొని ఉన్న చెరువులన్నీ ఇలాగే పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పేదోడు గుడిసె వేసుకుంటే బుల్డోజర్‌తో పీకేసే ప్రభుత్వాలు పెద్దోళ్లు భారీ భవంతులు కట్టినా చూస్తూ ఉండిపోయాయి. నరసన్నపేట ఒకప్ప్పుడు జాతీయ రహదారి మధ్యలో ఉండేది. అటూ ఇటూ ఉన్న చెరువులు కప్పేసి, భారీ భవంతులు నిర్మించేశారు. ఇప్ప్పుడు పక్కనుంచే ఎన్‌హెచ్`16 వెళ్లింది. దీంతో నగరం అటు విస్తరించింది. దాంతో అక్కడి చెరువులు కూడా మాయమైపోయాయి. ఇంత జరుగుతున్నా ఇక్కడొక చెరువుండాలే.. అన్న అనుమానం అధికారులకు రాలేదు. కనీసం రికార్డుల్లో ఉన్న చెరువు ఫిజికల్‌గా ఎందుకు లేదన్న సోయ కూడా లేకుండాపోయింది. ఇందులో మంచినీటి చెరువులు, మురుగు ప్రవహించే చెరువులు అన్నీ ఉన్నాయి. శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే కాదేదీ ఆక్రమణలకు అనర్హం. వివరాల్లోకి వెళితే..

నరసన్నపేటలోని గొట్టిపల్లి వద్ద సర్వే నెంబరు 187లో రాతికర్ర చెరువు దాదాపు 2.35 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీనిని ఆక్రమించి ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు.
గొట్టిపల్లి వద్దనే సర్వే నెంబరు 184, 187లలో జలగల చెరువు, రాతికర్ర చెరువుల పరిధిలో మొత్తం 15 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణలకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. జలగల చెరువులో 9.63 ఎకరాలను 25 మంది ఆక్రమించి వ్యాపార, నివాస సముదాయాల నిర్మాణం చేపట్టి సొంతం చేసుకున్నారు.
రాతికర్ర చెరువులో 2.75 ఎకరాలను 29 మంది ఆక్రమించి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సర్వే నెంబర్ 178లో ఉన్న చెరువును పూర్తిగా ఆక్రమించి చెరువు ఆనవాళ్లను తుడిచిపెట్టేశారు.
సర్వే నెంబర్ 93, 94లో ఉన్న చెరువులనూ కబ్జా చేశారు. ఈ చెరువులు పాత జాతీయ రహదారికి ఇరువైపులా ఉండడంతో వీటిని ఆక్రమించి బహుళ అంతస్థుల భవనాలు, మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించారు. వీటి నిర్మాణానికి సుడా నుంచి ఎటువంటి అనుమతులు లేవు, పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్ లేదు.
ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నరసన్న చెరువును కబ్జా చేసి ఒక ఆసుపత్రి నిర్మించారు. చెరువును కప్పి అక్రమంగా నిర్మిస్తున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడలేదు. గడ్డెన్న చెరువు పూర్తిగా ఆక్రమణకు గురై రూపమే కోల్పోయింది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన రాజుల చెరువు ప్రస్తుతం 10 ఎకరాలకు కుదించుకుపోయింది.
సర్వే నెంబర్ 195లో ఉన్న ఎన్‌హెచ్`5కు చెందిన స్థలంలో మÖడు వాణిజ్య సముదాయాలను నిర్మించి దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. సర్వే నెంబర్ 196లో ఆరుగురు వ్యాపారులు ఆక్రమించి భవనాలు నిర్మించి వ్యాపారం సాగిస్తున్నారు.

నరసన్నపేట మేజర్ పoచాయతీ పరిధిలో దాదాపు అన్ని ప్రధాన నీటి వనరులు కలిగిన చెరువులు కబ్జాకు గురయ్యాయి. వందలాది ఎకరాల చెరువు గర్భాలను మట్టితో కప్పి విలాసవంతమైన భవనాలుగా మార్చేశారు. రాజకీయ నాయకులు ఇచ్చిన భరోసాతో రెవెన్యూ అధికారుల అండతో చెరువులను అక్రమించి దర్జాగా ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పటికీ చెరువులను కబ్జారాయుళ్లు ఒక క్రమపద్ధతిలో డెబ్రిస్‌తో నింపి, చదును చేసి ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు.
నరసన్నపేట పంచాయతీ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై గరీబ్ గైడ్ సంస్థ ఎన్జీటీకి ఫిర్యాదు చేయగా, అధికారులు వీటిపై దృష్టి సారించి సర్వేలు నిర్వహించి నివేదికను పంపించి చేతులు దులుపుకున్నారు. ఆక్రమణదారులంతా రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా పలుకుబడి ఉన్నవారే కావడంతో రెవెన్యూ అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. చెరువులతో పాటు రోడ్డు పొరంబోకు స్థలాలను ఆక్రమించి వాణిజ్య సముదాయాలు నిర్మించారు. అధికారంలో ఎవరు ఉన్నా కబ్జాలు కామన్ అయిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణదారుల నుంచి స్థానిక ద్వితీయ శ్రేûణి నాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలుచేసి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అయితే ఈ ఆక్రమణలు పదేళ్ల క్రితం జరిగినవేనంటూ స్థానికులు చెబుతున్నారు. పంచాయతీలో మంచినీటి అవసరాలు తీర్చే చెరువులు దాదాపు కనుమరుగయ్యాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పంచాయతీ అధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు జోక్యం మితిమీరడం వల్లనే చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని నరసన్నపేటలో ఆందోళన వ్యక్తమవుతుంది.






Comments