top of page

సిక్కోలు డ్రెయిన్లకు ‘ఛాలెంజ్ ’

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 11 hours ago
  • 2 min read
  • రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం

  • మిర్తిబట్టికి అనుసంధానం.. నాగావళిలో విలీనం

  • డీపీఆర్ సిద్ధం చేస్తున్న యంత్రాంగం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌తో శ్రీకాకుళంలో కాల్వలు లేని ప్రాంతాల్లో పూర్తిగా వాటిని నిర్మించడం, మిర్తిబట్టిలో ఆక్రమణలు తొలగించి కాలువలకు కనెక్టివిటీ ఇవ్వడం, మిర్తిబట్టి నుంచి వాంబే కాలనీ వద్ద మురుగునీటిని ప్యూరిఫై చేసి నాగావళిలోకి మిగిలిన నీటిని వదిలే ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లక్ష్యాలపై మాట్లాడేందుకు శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు వెళ్లారు. శుక్రవారం విధుల్లోకి వచ్చిన ఆయన దీనిపై ‘సత్యం’తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.14,400 కోట్లు మÖడు విడతల్లో 36 మున్సిపాలిటీ, నగర కార్పొరేషన్లకు అందించడానికి సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అందించడానికి తమను పిలిచారని కూర్మారావు తెలిపారు. ఈ సందర్భంగా పెరుగుతున్న పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా 24 గంటలూ రక్షిత తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ మెరుగు, ఘనవ్యర్థాల నిర్వహణ, వరద నీటి కాల్వలు, రహదారులు, వీధి దీపాలు వంటి సదుపాయాలు మెరుగుపర్చడం కోసం అర్బన్ ఛాలెండ్ ఫండ్‌ను ఇస్తున్నట్టు కూర్మారావు తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం డీపీఆర్ ఇచ్చామని, ఇందుకు సంబంధించి రూ.50 కోట్లు మాత్రమే మొదటి విడతలో అవసరం ఉంటుందని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు కూర్మారావు తెలిపారు. మొత్తం నిధుల మంజూరులో 25 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇవ్వనుంది. మిగిలిన 75 శాతం ఆర్ధిక సంవత్సరం నుంచి రుణం, మున్సిపాలిటీ నగరపాలక సంస్థల నుంచే సమీకరించాలి. అందుకే రూ.50 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చినట్లు కూర్మారావు తెలిపారు. హడ్కోలో 25 శాతం రుణం లభిస్తుందని, ప్రభుత్వం సహకరిస్తే మున్సిపల్ బాండ్ల ద్వారా మరో 25 శాతం నిధులు సమకూర్చుకోవచ్చని కూర్మారావు తెలిపారు. కార్పొరేషన్ వార్షిక ఆదాయం రూ.46 కోట్లు ఉందని, ఇందులో రూ.37 కోట్లు జీతాలు, ఖర్చులకు పోను మిగిలిన బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకొని రూ.50 కోట్లు మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి విస్తరించిన నగరంలో చాలా ప్రాంతాలకు మురుగు కాల్వ సదుపాయం లేదని, మిర్తిబట్టి ఆక్రమణలు తొలగించడానికి కూడా ఈ నిధులు సరిపోవని, కానీ హడ్కోకు తీర్చాల్సిన రుణం, మున్సిపాలిటీ భరించాల్సిన అసలు దృష్టిలో పెట్టుకొని రూ.50 కోట్లకు ప్రతిపాదన మాత్రమే ఇచ్చామన్నారు. ప్రాజెక్టుకు నిధులు చాలకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో గాని, వయబుల్ పెండింగ్ ఫండ్ నుంచి గాని మరికొన్ని నిధులు సేకరించి విలీన పంచాయతీల్లో కూడా పూర్తిస్థాయి కాల్వలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గతంలో ఇటువంటి స్కీమ్‌కే శ్రీకాకుళంలో రోడ్లు, కాలువలు, వీధి దీపాలు అన్నింటినీ కలిపి రూ.326 కోట్లకు డీపీఆర్ ఇచ్చారని, దానికి వయబిలిటీ లేకపోవడం వల్ల, నిధులు సమకూర్చుకునే వెసులుబాటు లేకపోవడంతో ఇది రద్దయిపోయిందని, అలా కాకుండా ఉండేందుకే తక్కువ మొత్తంలో పనులు ప్రారంభిస్తున్నట్టు కూర్మారావు ‘సత్యం’కు తెలిపారు. గతంలో పట్టాలెక్కని ఓ ప్రాజెక్టుకు రుణం తెచ్చి ఇప్పటికీ మున్సిపాలిటీ వడ్డీ కడుతోందని, అలాంటివి లేకుండా చూడాలని ఎమ్మెల్యే గొండు శంకర్, కేంద్ర, రాష్ట్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ముందుగానే స్పష్టం చేయడం వల్ల మొదటి విడతలో రూ.50 కోట్ల పనులకు డీపీఆర్ తయారు చేస్తున్నామన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు మీద పని చేసిన గుంటూరుకు చెందిన కన్సల్టెంట్‌ను సంప్రదించామని, ఇప్ప్పుడు ఎమ్మెల్యే శంకర్ మిర్తిబట్టి ఆక్రమణలు తొలగించి విలీన పంచాయతీలకు వరద ముప్ప్పు నుంచి తప్పించాలని సంకల్పించడంతో కాలువల అనుసంధానంపై కొత్త స్కెచ్ తయారుచేస్తున్నట్టు కూర్మారావు తెలిపారు. తోటపాలెం, కుశాలపురం పంచాయతీలకు సంబంధించి ఎమ్మెల్యేతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page