బుల్లి ఎర్రన్నతో అచ్చెన్న ఆటవిడుపు!
- SATYAM DAILY
- 4 days ago
- 1 min read
ఢిల్లీ పర్యటనలో కాసేపు కులాసాగా

(సత్యంన్యూస్, న్యూఢిల్లీ)
పిల్లలు దేవుడి ప్రతిరూపాలు.. బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు, వచ్చీరాని మాటలతో వారు చేసే చిలిపి చేష్టలు ఎంతటివారినైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కూల్ చేసేసి.. కులాసాగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. అదే తమ రక్తసంబంధీకుల ప్రతిరూపాలైతే ఆ అనుబంధం, ఆత్మీయత మరింత గాఢంగా పెనువేసుకుంటుంది. అమాత్య ీVAదాలో నిరంతర రాచకార్యాలతో ఒత్తిడితో గడిపే కింజరాపు అచ్చెన్నాయుడు తన ఢిల్లీ పర్యటనలో అటువంటి అనుభూతిని, ఆప్యాయతను, మానసికోల్లాసాన్ని ఆస్వాదించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అక్కడే ఉంటున్న తన అన్న కుమారుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి నివాసంలోనే బస చేశారు. అధికారిక కార్యక్రమాల అనంతరం అక్కడే ఆయనకు ఆటవిడుపు లభించింది. తన బుల్లి అన్నయ్యతో అచ్చికబుచ్చికలాడుతూ ఒత్తిళ్లను మర్చిపోయి హాయిగా గడిపారు. ఇంతకూ ఆ బుల్లి అన్నయ్య మరెవరో కాదు.. కింజరాపు కుటుంబ వారసుడు, మంత్రి రామ్మోహన్ నాయుడి చిన్నారి పుత్రుడైన శివాన్ ఎర్రన్నాయుడు. తాత, దివంగత ఎర్రన్నాయుడు పేరునే ఈ చిన్నారికి పెట్టుకుని, ఆయన ప్రతిరూపంగానే కింజరాపు కుటుంబం భావిస్తున్నది. అన్న మార్గదర్శనంలో ఎదిగిన అచ్చెన్నాయుడు కూడా చిన్నారి శివాన్‌తో ముచ్చట్లాడుతూ అన్నతో తన బాల్యస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆ సమయంలో అక్కడున్న మీడియా కెమెరాలకు చిక్కింది. కాగా తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌తోపాటు కలిశారు. అలాగే సహచర రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో సహా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను పార్లమెంటు భవనంలో కలిశారు. ముడి పొగాకు జీఎస్టీని 40 నుంచి 28 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.






Comments