‘తప్పు’తాగడమేనా..మరి ఇవి తప్పులు కావా?!
- DV RAMANA

- 4 hours ago
- 3 min read
మత్తులో తూలి కాలువలో పడి సత్యనారాయణ మృతి
తాగడమే నేరమన్నట్లు కనీసం సానుభూతి లభించని పరిస్థితి
దాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి బాధ్యత లేదా?
మందిరం ఎదురుగానే బార్, సమీపంలోనే రెండు బెల్ట్‌షాపులు
వాటిని అరికట్టని ఎక్సైజ్, పోలీసు శాఖలు
నిర్మాణ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టని వారూ దోషులు కాదా?

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
‘తాగడం తప్పే కదా.. తప్పతాగాడు.. కాలువ కూలిపోయాడు.. తప్పేం లేదు!’.. బలగమెట్టు వద్ద ఒక వ్యక్తి తప్పతాగి కాలువలో పడి మరణించిన ఉదంతంపై జనసామాన్యం వ్యక్తం చేసిన అభిప్రాయాల సారం స్థూలంగా ఇదే. అయ్యో.. మనిషి అర్థంతరంగా చనిపోయాడే.. ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్న కుటుంబం అనాథ అయ్యిందన్న సానుభూతి ఇసుమంతైనా కనిపించలేదు.
నిజమే.. మద్యపానం తప్పే .. సాంఘిక దురాచారమే.. దానివల్ల మందుబాబుల ఆరోగ్యాలు కుళ్లిపోతున్నాయి. సమాజం రోగగ్రస్తమవుతోంది. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మత్తులో జరుగుతున్న ప్రమాదాలు ఎన్నో ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇన్ని అనర్థాలకు కారణమవుతున్న మద్యాన్ని పూర్తిగా సమాజం నుంచి వెలివేయవచ్చు కదా! మద్యపానాన్ని నిషేధించవచ్చు కదా!! కానీ అలా జరగడం లేదు. పోనీ దానికి సంబంధించిన ప్రభుత్వం విధించిన ఆంక్షలు, మార్గదర్శకాలు అమలు చేస్తున్నారా అంటే.. అదీ లేదు. వీటికితోడు బలగమెట్టు వద్ద తాగిన మత్తులో సత్యనారాయణ పడిపోయిన కాలువకు పైకప్పు లేదు. అయితే రోడ్డు విస్తరణ, కాలువ నిర్మాణం జరుగుతున్నందున కాలువలపై ఇంకా పలకలు ఏర్పాటు చేయలేదన్న సమర్థనలు వినిపిస్తున్నాయి. అది నిజమే కావచ్చు. కానీ నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో డైవర్షన్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం తాగుబోతులకే కాదు.. సామాన్యులకూ చేటు చేసే ప్రమాదం ఉంది. ఇవన్నీ కలిసి బలగమెట్టు వద్ద ఒక నిండిప్రాణాన్ని బలితీసుకున్నాయన్నది వాస్తవం. అదెలాగో చూద్దాం.
తిలా పాపం.. తలా పిడికెడు
బలగమెట్టుకు చెందిన సత్యనారాయణ కాలువలో పడి దుర్మరణం చెందడానికి ఆయన తాగుడు వ్యసనానికి బానిస కావడమే స్వీయ తప్పిదం. దానికి ప్రభుత్వంతోపాటు మÖడు నాలుగు శాఖలు కూడా పరోక్షంగా కారణమయ్యాయి. అందువల్లే అవి కూడా ఈ మరణానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
`మద్యపానం సాంఘిక దురాచారమన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు దాన్ని నియంత్రించేందుకు ఎన్నో అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ మరోవైపు ఆదాయార్జన కోసం మద్యం పాలసీలంటూ రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ అమ్మకాలు పెంచుకోవడం ద్వారా మద్యపానాన్ని ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నాయి. మద్యం షాపులు, బార్‌లు పెంచుకుంటూ పోవడమే కాకుండా.. ఆదాయం పెరిగేలా మద్యం అమ్మకాలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఇది పరోక్షంగా మద్యపానాన్ని ప్రోత్సహించడమే కదా!.. మరి ఇది తప్పు కాదా?
రాష్ట్ర ఖజానాకు ఆదాయం కోసం మద్యం షాపులు, బార్‌లను అనుమతులు అనివార్యం అనుకున్నా.. వాటికి విధించిన పరిమితులు, ఆంక్షలు అమలవుతున్నాయో లేదో చూడాల్సి బాధ్యత ప్రభుత్వానిదే. కానీ అది ఎక్కడా జరగడం లేదు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం జనావాసాల్లో.. ముఖ్యంగా బడి, గుడి, ఆస్పత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు గానీ, బార్ అండ్ రెస్టారెంట్లు గానీ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. కానీ ఆ నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. ఇప్పుడు చర్చనీయాంశమైన బలగమెట్టు ప్రాంతాన్నే తీసుకుంటే మెయిన్ రోడ్డుకు ఇవతల రామమందిరం ఉంటే.. అవతల బార్ ఉంది. రెండింది మధ్య 40 మీటర్ల దూరం కూడా ఉండదు. అయినా ఆ బార్‌కు ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతించిందో అర్థం కాదు. ఇక జనావాసంలో, రామమందిరానికి ఎదురుగా బార్ ఉండటమే నిబంధనలకు విరుద్ధం కాగా.. దాని పరిధిలోనే అక్కడికి సమీపంలోనే రెండు బెల్ట్ షాపులు ఉండటం మరో నేరం. బెల్ట్‌షాపులను అరికట్టాల్సిన బాధ్యత కూడా ఎక్సైజ్ శాఖదే. మరి ఆ శాఖ అధికారులు ఏ మత్తులో సోలిపోతున్నారో వారే చెప్పాలి.
బార్, రెండు బెల్ట్‌షాపులు ఉన్న బలగమెట్టు ప్రాంతం సాయంత్రమైతే చాలా మందుబాబులతో నిండిపోతుంది. రాత్రి పది గంటల వరకు బార్‌లో మద్యం కొనుక్కుని అక్కడే తాగి చిందులేసే మందుబాబులు, బార్ మÖసేసిన తర్వాత బెల్ట్‌షాపులపైన పడుతుంటారు. అర్ధరాత్రి దాటే వరకు తెరిచి ఉంటే వాటి నుంచి మద్యం కొని అక్కడే తప్పతాగి వాహనాలకు అడ్డం పడటం, ఆ మార్గంలో సంచరించేవారిని ఇబ్బందిపెట్టడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఆ ప్రాంతంలో తరచూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నా పోలీసులు మౌనప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మరణించిన సత్యనారాయణ కూడా మొదట బార్ నుంచి.. అది మÖసేసిన తర్వాత బెల్ట్‌షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తప్పతాగి మరణించాడు. మరి వీటన్నింటికీ ఎవరు బాధ్యత వహించాలి.
బలగ ప్రాంతంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం`ఆమదాలవలస ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా ఈ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా షాపులు, ఇళ్లు కొట్టేసి.. ప్రస్తుతం కాలువలు నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నందున వాటిపై ఇంకా పలకలు ఏర్పాటు చేయలేదు. అదే సమయంలో రోడ్డుపైనే నిర్మాణ సామగ్రి, వ్యర్థాలు అడ్డదిడ్డంగా పడి ఉన్నా.. నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్‌కు వీలుగా డైవర్షన్ ఏర్పాటు చేయలేదు సరికదా.. హెచ్చరిక బోర్డులు గానీ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా సత్యనారాయణ తాగిన మత్తులో తూలి కాలువలో పడిపోయాడని అంటున్నారు. పైన పేర్కొన్న లోపాల వల్ల సత్యనారాయణలాంటి మందుబాబులే కాకుండా పాదచారులు, వాహనదారులు కూడా కాలువలు, నిర్మాణ వ్యర్థాల్లో పడి మరణించే ప్రమాదం ఉంది.
సత్యనారాయణ మృతికి ఇన్ని కారణాలు, ఇన్ని శాఖలు బాధ్యులుగా ఉండగా.. తాగుబోతు అయినందుకు ఆయన్ను మాత్రమే బాధ్యుడిగా చూపించడం ఏం న్యాయమో ఆలోచించాలి.






Comments