ఫలించిన మూడేళ్ల పోరాటం
- BAGADI NARAYANARAO

- 1 day ago
- 1 min read
స్వీట్స్ కార్ఖానా మూసివేత
‘సత్యం’ కథనంతో కదిలిన అధికారులు

(సత్యంన్యూస్, పొందూరు)
పొందూరు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. కార్ఖానాను మూసివేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నాలుగు నెలల పాటు అధికారులు అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ‘హైకోర్టు ఆర్డర్ కంటే... మామూళ్లకే బలమెక్కువా?’ అనే శీర్షికతో ‘సత్యం’ ప్రచురించిన ప్రత్యేక కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పంచాయతీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం కార్ఖానా నిర్వాహకుడు తండ్యాల ప్రసాదరావుకు ఆయా శాఖల అధికారులు నోటీసులు అందజేసి, స్వీట్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు, కలెక్టర్‌కు పీజీఆరఎస్ (గ్రీవెన్స్) ద్వారా అందిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కార్ఖానాను తిరిగి ప్రారంభిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకుడిని హెచ్చరించారు.
హైకోర్టు వెళ్లాకే స్పందించిన అధికారులు
ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారుడు అల్లంశెట్టి రవి మాట్లాడుతూ, కార్ఖానాను తొలగించాలని మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, హైకోర్టు పంచాయతీ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా తొలుత స్పందించలేదని తెలిపారు. తాను ఈ కేసులో ఇన్‌ప్లీడ్ పిటిషనర్‌గా హైకోర్టులో చేరిన తర్వాతే అధికారులు కౌంటర్ దాఖలు చేశారని పేర్కొన్నారు. అనంతరం హైకోర్టు కార్ఖానాను మూసివేయాలని తీర్పు ఇచ్చినా అమలులో అధికారులు జాప్యం చేశారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదంటూ కలెక్టర్‌కు పీజీఆరఎస్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, అయితే ‘సత్యం’లో ప్రచురితమైన ప్రత్యేక కథనం తర్వాత మాత్రమే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు.






Comments