top of page

తొలగింపుల్లో.. తారతమ్యాలు!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jul 9
  • 1 min read
  • చిన్న షాపులపై ప్రొక్లైయిన్ల ప్రతాపం

  • పెద్ద వస్త్ర సముదాయాల వద్దకు వెళ్లని మున్సిపల్ యంత్రాంగం

  • ఫుట్‌పాత్‌లను కప్పేసి రోడ్డు మీదకే కార్ల పార్కింగ్ ర్యాంపులు

  • అన్ని ఆక్రమణలనూ తొలగిస్తాం- మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

బాపూ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ముళ్లపూడి వెంకటరమణ రాసినట్టు ఆడాళ్లు, మగాళ్లు సమానమే. కాకపోతే మగాళ్లు కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు.. నగరంలో ఫుట్‌పాత్‌లకు ఆనించి రోడ్డు మీదకు యథేచ్చగా నిర్మించిన ర్యాంపులు (గట్లను) మున్సిపల్ యంత్రాంగం తొలగించింది. కాకపోతే భారీఎత్తున వ్యాపారం చేస్తున్న కొన్ని వస్త్ర సముదాయాల దగ్గర మాత్రం ఇంకా తొలగింపుల ప్రక్రియ మొదలుపెట్టలేదు. వాస్తవానికి అతి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లు అయిన వీరి ఆవరణలోనే ఎక్కువగా ఫుట్‌పాత్‌లు కప్పేసి రోడ్డు మీదకు ర్యాంపులు దింపేశారు. వీటికి అటూఇటూ ఆక్రమణలు తొలగించినా ఇంకా ఈ సముదాయాల వద్దకు ప్రొక్లెయినర్ వెళ్లకపోవడంపై నగరంలో చర్చ మొదలైంది. ఆమధ్య ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నవారిని ట్రాఫిక్ పోలీసులు ఎత్తి బయటేశారు. అప్ప్పుడు కూడా ఈ భారీ వస్త్రవ్యాపారం చేస్తున్నవారి జోలికి పోలేదన్న ఆరోపణలు వినిపించాయి. ఈలోగానే సుప్రీంకోర్టు ఫుట్‌పాత్‌లపై బాటసారులు నడవడం వారి ప్రాథమిక హక్కు అని నాలుగు రోజుల క్రితం ఓ తీర్పు వెలువరించింది. శ్రీకాకుళంలో ఫుట్‌పాత్‌ల మీద నడిచే పాదచారులు లేకపోయినా, 2014`19 మధ్యలో ఉడా నిధులతో ఫుట్‌పాత్‌లు నిర్మించారు. దానికి ఆనుకొని ఉన్న షాపులకు అదనపు పార్కింగ్ ప్లేస్ చేకూరింది తప్ప ఫుట్‌పాత్‌ల వల్ల ప్రయోజనం కలగలేదు. ఇప్ప్పుడు అదనంగా రోడ్డు మీదకు ర్యాంపులు నిర్మించడంతో ఏకంగా కొన్ని షాపుల ముందు యజమానులు తమ భారీ కార్లు కూడా నిలుపుదల చేసుకునేవారు. అయితే వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ మున్సిపల్ యంత్రాంగం ర్యాంపులను తొలగిస్తోంది. కానీ ఈ భారీ వస్త్ర సముదాయాల వద్ద గట్లు కొడతారా? లేదా? అనేది వేచిచూడాలి.

అన్నిచోట్లా ఊడ్చేస్తాం

ఈ విషయాన్ని మున్సిపల్ హెల్త్ అధికారి సుధీర్ దృష్టికి తీసుకురాగా, నగరంలో ఫుట్‌పాత్‌లకు ఆనించి ఉన్న అన్ని ర్యాంపులను తొలగించితీరుతామన్నారు. ప్రస్తుతానికి ర్యాంపులను ఛిద్రం చేసే మిషన్ ఒకటే ఉండటం వల్ల ఒకేసారి పని పూర్తి చేయలేకపోయామని ఆయన అన్నారు. ర్యాంపులు తొలగించడం వల్ల వచ్చిన డెబ్రిస్‌ను ప్రొక్లయినర్ ద్వారా ట్రాక్టర్‌లోకి ఎత్తిపోసి తరలింపునకు కూడా సరిపడే యంత్రాంగం లేదని, మొత్తం ఒకేసారి క్లియర్ చేయడం కష్టసాధ్యమవుతుంది కాబట్టి కొన్నిచోట్ల ర్యాంపులు మిగిలిపోయిన మాట వాస్తవమని, వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page