రామిగెడ్డకు ‘గుర్రపుడెక్క’ గ్రహణం
- Prasad Satyam
- 6 hours ago
- 1 min read
నీరున్నా నిలిచిన ప్రవాహం
పూడికతీత మరిచిన యంత్రాంగం
పంటలు ఎండిపోతున్నాయని రైతుల గళం
ఎల్ నినో సాకుతో ఎంచక్కా బిల్లులా?
ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సిక్కోలు శివారు కాలనీవాసుల అదృష్టమో, రైతుల దురదృష్టమో తెలియదు గాని ఈ ఏడాది వర్షాకాలం పూర్తయినా చినుకు రాలకపోవడంతో ఇరిగేషన్ శాఖ ఎంచక్కా పనులు జరిగినట్టు బిల్లులు పెట్టుకోవడానికి మార్గం సుగమమైనట్టుంది. సాగునీటి కాలువల ద్వారా నీరందాల్సిన పొలాలు ఎండిపోతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం పనులు జరగకుండా బిల్లులు పెట్టుకోవచ్చని, అడిగితే ఎల్ నినో వల్ల కాలువల్లో కూడా నీరు లేదని చెప్పేందుకు ఓ అవకాశం దొరికింది. వందల ఎకరాలకు సాగునీరు అందించే రామిగెడ్డ కాలువలో నీరుంది. కానీ అది పారడానికి అవసరమైన మార్గం మాత్రం కనిపించడంలేదు. స్థానిక డీసీసీబీ కాలనీ నుంచి వెళ్లే రామిగెడ్డ ప్రధాన కాలువ పూర్తిగా గుర్రపుడెక్కలతో నిండిపోయింది. దీనివల్ల నీరు పారడం కష్టమవుతుంది. ఈ గెడ్డ కాలువ ఎప్ప్పుడూ గుర్రపుడెక్కకు స్థిరనివాసమే. అయితే వర్షాలు పడినప్ప్పుడు నీరు పొంగిపొర్లడంతో డీసీసీబీ కాలనీ మునిగిపోతుంది. ఆ సమయంలో స్థానికులు మొరపెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యే పర్యటించి, కలెక్టర్‌కు చూపించి గుర్రపుడెక్కలు తొలగిస్తున్నారు. అలాగే నీరును మోటార్లు పెట్టి తోడుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడం వల్ల డీసీసీబీ కాలనీకి ముంపుబాధ తప్పింది. కాకపోతే రామిగెడ్డ నుంచి పొలాలకు వెళ్లాల్సిన నీరు గుర్రపుడెక్క వల్ల కదలడంలేదు. ముంపు లేదు కాబట్టి స్థానికులు ఫిర్యాదు చేయడంలేదు. రైతులకు నీరు ఎందుకు రావడంలేదో అర్థం కావడంలేదు. వాస్తవానికి ఈ కాలువలో ఉన్న గుర్రపుడెక్కను తొలగించాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులదే కానీ ప్రతీ ఏడాది వర్షాల వల్ల మున్సిపాలిటీ ఆ పని చేపడుతుంది. ఇంతవరకు రైతులకు నీరందకపోయినా గుర్రపుడెక్కను తొలగించాలన్న ఆలోచన ఇరిగేషన్ అధికారులకు రాకపోయినందుకైనా జనవరి 26న వీరికి అవార్డులు ఇవ్వాలి.






Comments