కార్పొరేషన్ ఎన్నికలు... చట్టమా? రాజకీయమా?
- Prasad Satyam
- 2 days ago
- 3 min read
శ్రీకాకుళం ఎన్నికలపై మళ్లీ సందిగ్ధత
ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నా..రాజకీయ సమీకరణాలే అడ్డంకి
అప్పుడు ధర్మాన... ఇప్పుడు శంకర్.. మనోభీష్టాల ‘పవర్ ’ గేమ్
‘పంచాయతీలను విభజిద్దాం’ అనడం గంట...
చిక్కుముడులు విప్పడం ‘ఇరవై ఏళ్ల’ ముచ్చట
సీఎంకు తెలియదు... మంత్రికి అవగాహన లేక ‘తీరని తిరకాసు’!

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాలని, జరుపుతామని అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఇప్ప్పుడూ చెబుతున్నాయి, అప్ప్పుడూ చెప్పాయి. కానీ ఎన్నికలయ్యే పరిస్థితే కనిపించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే శ్రీకాకుళానికి ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది ఇక్కడి నాయకుల మనోభీష్టం మేరకు ఆధారపడివుంది. జిల్లా కేంద్రం ఉన్న నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ ఉండటం ఇష్టంలేకే అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల కోసం ముందడుగు వేయలేదనే ఆరోపణ ఒకటి ఉంది. ఇప్ప్పుడు అదే మాదిరిగా ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఆలోచిస్తున్నారనే ప్రచారం మొదలైపోయింది. ఎన్నికల చిక్కుముడి వీడకపోవడం కూడా దీనికి బలం చేకూరుస్తుంది.
2019`24 మధ్య అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఒకవైపు పంచాయతీల విలీనాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు పంచాయతీ సర్పంచ్‌లతో కోర్టు తలుపు తట్టించింది. ఇక్కడ నాయకత్వం మనోభావాలు పట్టించుకోకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కరోనా సమయంలో ఓ చీకటి చట్టాన్ని తెచ్చి ఏడు పంచాయతీలను విలీనం చేసేసింది. అయితే ఇప్ప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. పంచాయతీల విలీనాల గొడవలో 23 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరపడం సాధ్యమా? కాదా? అన్నదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం మున్సిపల్ శాఖామంత్రితో మాట్లాడారు. కోర్టులో ఉన్న కేసులు సంబంధిత పంచాయతీలు విత్‌డ్రా చేసుకుంటే ఎన్నికలకు వెళ్లిపోవచ్చని మంత్రి నారాయణ చెప్పారట. ఒకవేళ విత్‌డ్రా కాకపోతే వాటిని వదిలేసి మిగతా భాగానికి ఎన్నికలు జరపాలని చంద్రబాబు సూచించినట్టు భోగట్టా. అయితే ఇందులో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి చట్టం అయిపోయిందని అక్కడ మున్సిపల్ మంత్రికీ తెలియదు, చంద్రబాబుకూ తెలియదు. దీంతో కోర్టులో కేసు విత్‌డ్రా అయిపోతారని, వారంతా తెలుగుదేశం సర్పంచులే కాబట్టి సజావుగా ఎన్నికలకు వెళ్లిపోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి విలీన పంచాయతీలకు సంబంధించి చట్టం అయిపోయింది. ఇప్ప్పుడు దాన్ని రద్దు చేస్తేగాని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం కుదరదు. ఎందుకంటే పంచాయతీలను మినహాయించి ఎన్నికలు జరపాలని కోర్టుకు వెళ్లినవారు కోరుతున్నారు. తాజాగా శ్రీకాకుళం మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యే ఓ కొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. పంచాయతీల పరిధిలో కాలనీలుగా ఏర్పడినవాటిని కార్పొరేషన్‌లో ఉంచి, గ్రామీణ ప్రాంతాన్ని పంచాయతీలో ఉంచాలని దాని భావన. దీనికి సంబంధిత సర్పంచ్‌లు కూడా అంగీకరించారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే వచ్చింది. ఒక పంచాయతీ నుంచి కొంత భాగాన్ని విడగొట్టాలంటే రెవెన్యూ చట్టం అంత ఈజీగా ఒప్ప్పుకోదని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాదే ఎమ్మెల్యే గొండు శంకర్‌కు చెప్పడంతో ఇప్ప్పుడు ఎన్నికలకు ఏ రూపంలో వెళ్లాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. స్వయంగా ఎమ్మెల్యే సొంత పంచాయతీ కిష్టప్పేట వ్యవహారమే మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉదహరించారట. సింగుపురం పంచాయతీలో ఉన్న కిష్టప్పేటను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయడం కోసం అప్పటి సర్పంచ్ సింతు సూరయ్య 20 ఏళ్లు పోరాడారని గుర్తు చేసినట్లు తెలిసింది. స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావుకు అనుచరుడిగా ఉన్న సింతు సూరయ్యకు ఆ రోజుల్లో రెండు దశాబ్దాలు పట్టిందంటే, ఇప్ప్పుడు ఏడు పంచాయతీల్లో కొంత భాగం కార్పొరేషన్‌కు ఇవ్వాలంటే మరెంత కాలం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపిస్తుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా అధికారుల సన్నద్ధతపై సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు శ్రీకాకుళం మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగాలి. లేదూ అంటే ఈసారి అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి కార్యకర్తలు జారిపోవడం ఖాయం. దీనివల్ల ఇమీడియట్‌గా వచ్చే నష్టం అధికార పార్టీకే. 2010 తర్వాత 2024 వరకు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడానికి అప్పటి నాయకులే కారణమని భావించిన టీడీపీ కేడర్ ఈసారి అటు వైకాపాను, ఇటు టీడీపీలో గుండ వర్గాన్ని కాదని మరీ గొండు శంకర్‌కు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇప్ప్పుడు ఎన్నికలు జరగకపోతే మరెప్ప్పుడు అని అడగరు. సైలెంట్‌గా 2029 ఎన్నికల్లో సత్తా చూపుతారు. ఇప్ప్పుడు శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాలంటే ఒకటే మార్గం. వైకాపా చేసిన చట్టం ప్రకారం విలీన పంచాయతీలతో కలిపి ఎన్నికలకు వెళ్లడం. లేదూ అంటే మున్సిపాలిటీగా ఉన్నప్ప్పుడు ఉన్న 36 వార్డులను 60 డివిజన్లుగా విభజించి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించడం. అయితే ఇందులో ఎలా వెళ్లాలనేది స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల నిర్ణయం మీద ఆధారపడి ఉంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు సంబంధించి ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యే గొండు శంకర్ మున్సిపల్ శాఖామంత్రిని గతంలో కోరిన మాట వాస్తవం. అయితే ఇందులో ఉన్న చిక్కుముడులు కొత్తగా ఎన్నికైన గొండు శంకర్‌కు తెలియవు. మంత్రి నారాయణకు మున్సిపల్ చట్టం మీద అవగాహన ఎంతుందో తెలియదు గాని, ఏ రోజూ ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఎమ్మెల్యేతో కూర్చున్న దాఖలాలు లేవు. మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో మంతనాలు జరిగితే శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగవు. ఎందుకంటే.. ఇది రెండు నియోజకవర్గాల మధ్య జరుగుతున్న తంతు. ఇటు శ్రీకాకుళం, అటు ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రితో కూర్చుంటేనే సమస్య పరిష్కారమయ్యే అవకాశముంటుంది. అలా కాకుండా కోర్టులో కేసులు విత్‌డ్రా చేసుకోవాలని కోరితే ఎన్నికలయ్యే పని కాదు.






Comments