top of page

పెద్ద మార్కెట్‌లో కలకలం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 days ago
  • 1 min read
  • కూలిన సన్‌షేడ్

  • ముగ్గురికి తృటిలో తప్పిన ప్రమాదం

  • మార్కెట్ భవిష్యత్‌పై మళ్లీ చర్చ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్‌లోని కిరాణా దుకాణాల బ్లాక్‌పై ఉన్న సన్‌షేడ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడున్న వ్యాపారులు, వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.

ఈ ప్రమాదంతో పెద్ద మార్కెట్ భవిష్యత్‌పై నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు మార్కెట్‌ను కూల్చివేస్తున్నప్పటికీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో వ్యాపారులకు స్పష్టత ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో మార్కెట్ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిపోయిందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లోనే మార్కెట్‌లోని ఒక సముదాయంలో షేడ్ కూలిపోవడం వ్యాపారుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. పాత భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండా, తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో రోజూ వందలాది మంది వ్యాపారులు, వినియోగదారులు రాకపోకలు సాగిస్తుండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన భవనాల స్థితిగతులపై కూడా సాంకేతిక నిపుణులతో తనిఖీలు నిర్వహించి, అవసరమైతే ప్రమాదకర భాగాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఈ పెద్ద మార్కెట్‌ను అప్పటి జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు 2009లో ప్రారంభించారు. దాదాపు పదిహేనేళ్లుగా జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న ఈ మార్కెట్ ఇప్పుడు భద్రత, నిర్వహణ, పునర్నిర్మాణ అంశాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, ఇన్నాళ్లు మార్కెట్ ఎవరికీ ఉపయోగపడలేదని, శిథిలావస్థకు చేరిందని అందుకే ఒక వైపు నుంచి తొలగింపులు చేపడుతున్నామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page