ఏడు పంచాయతీలు.. 60 డివిజన్లు.. కార్పొరేషన్‌కు ఇక ఎన్నికలే
- Prasad Satyam
- 3 hours ago
- 2 min read
విలీన పంచాయతీల సర్పంచ్‌లకు ఎర.. కోర్టు కేసులకు తెర
పాత చట్టం మేరకే ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వం నిర్ణయం
త్వరలోనే విలీన సర్పంచ్‌లను ఒప్పించేందుకు జిల్లాకు రానున్న కమిటీ
15 ఏళ్ల తర్వాత వీడనున్న ఉత్కంఠ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు విలీన పంచాయతీలతోనే వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడిపోయింది. ఇందుకు సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించడానికి ఐదుగురితో కూడిన ఒక కమిటీ కార్పొరేషన్‌లో పర్యటించనుంది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఏడు పంచాయతీలను విలీనం చేసిన తర్వాత ఆ గ్రామంలో అప్పటికి ఫోర్స్‌లో ఉన్న సర్పంచ్‌లు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసు కోర్టులో నలుగుతుండగానే కరోనా సమయంలో వైకాపా ప్రభుత్వం పంచాయతీల విలీనాన్ని చట్టంగా మార్చేసింది. దీంతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చట్టం మీద జోక్యం చేసుకోడానికి అటు నిరాకరిస్తూ కేసును డిస్మిస్ చేయలేదు, ఇటు కొనసాగిస్తూ వాదనలూ వినలేదు. దీంతో రెండేళ్లుగా ఈ కేసు బెంచ్ మీదకే రాలేదు. కానీ మరో 45 రోజుల్లో కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయిండంతో ఈ నెల 11న బెంచ్ మీదకు ఈ కేసు వచ్చింది. అయితే విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లినవారి తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని కోరడంతో సెప్టెంబరు 1కి ఈ కేసును వాయిదా వేశారు. ఏది ఏమైనా ఏడు పంచాయతీల విలీనంతోనే ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇందుకు సంబంధించి చట్టమే ఉండటం వల్ల మరింకే అడ్డంకులు ఉండవని భావిస్తుంది. మరోవైపు అక్టోబరు పూర్తయ్యే నాటికి స్థానిక ఎన్నికలు జరిగిపోవాలని ప్రభుత్వం భావిస్తుండటంతో కోర్టుకు వెళ్లిన అప్పటి సర్పంచ్‌లు కూడా దాదాపు కేసును విత్‌డ్రా చేసుకోడానికి సుముఖంగా ఉన్నట్టు భోగట్టా. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గత కొన్నాళ్లుగా కార్పొరేషన్ ఎన్నికల కోసం రకరకాల ప్రతిపాదనలు తెర మీదకు తీసుకువచ్చారు. ఇవేవీ టెక్నికల్‌గా కుదరవని తేలిపోయిన తర్వాత కేసులు వేసిన సర్పంచ్‌లను కన్విన్స్ చేసుకొచ్చారు. ప్రభుత్వం కూడా ఇటువంటి కేసులు వేసిన మిగిలిన మున్సిపాలిటీల వద్దకు కమిటీని పంపించి కన్విన్స్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నగర కార్పొరేషన్‌తో పాటు ఆమదాలవలస మున్సిపాలిటీ ఎన్నికల వ్యవహారం కూడా కోర్టులో ఉంది. ఈ రెండింటి పరిధిలో కమిటీ సంప్రదింపులు జరపనుంది. శ్రీకాకుళంలో విలీనమైన ఏడు పంచాయతీల్లో రెండు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించినవి. తోటపాలెం, కుశాలపురం పంచాయతీలను కార్పొరేషన్ పరిధి నుంచి విడిపించాలంటూ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎనఈఆర్ ఎడతెగని ప్రయత్నం చేశారు. కానీ అది కుదరదని తేలిపోవడంతో ఆయన కూడా పట్టు వదిలేశారు. దీంతో ఏడు పంచాయతీల విలీనంతో ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లే. అంతకు మించి కార్పొరేషన్‌కు ఎన్నికలంటూ జరిగితే ఏ పద్ధతిలో జరుగుతాయన్నదానిపైనే ఇన్నాళ్లూ ఉత్కంఠ కొనసాగింది. అయితే ఇప్ప్పుడు దానికి దాదాపు తెర పడినట్లే. కాకపోతే 45 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందా? లేదా? అన్నదానిపైనే ఇప్ప్పుడు చర్చ నడుస్తోంది.
కార్పొరేషన్‌కు కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం కనీసం 60 డివిజన్లు ఉండాలి. గతంలో ఉన్న నిబంధనల మేరకు విలీన పంచాయతీలతో కలిపి 50 డివిజన్లుగా విభజించారు. ఇప్ప్పుడు వాటిని 60గా విభజించి ఎన్నికలకు వెళ్లాలి. పాత మున్సిపాలిటీ లెక్కల ప్రకారం 36 వార్డులను 60 డివిజన్లు చేయడం అసాధ్యం. కాబట్టి విలీన పంచాయతీలతోనే ఎన్నికలకు వెళ్తారని స్పష్టమవుతోంది. 2011లో 50 డివిజన్లుగా విభజించినప్ప్పుడు బీసీ మహిళకు మేయర్ సీటు రిజర్వ్ అయింది. ఇప్ప్పుడు 60 డివిజన్లు కాబట్టి మరోసారి ఈ రోస్టర్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. కాకపోతే పాత 50 డివిజన్లే ఇప్ప్పుడు 60 అయ్యాయి కాబట్టి రిజర్వేషన్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికీ 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మేయర్‌గా ఎన్నుకునే పద్ధతిలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళంలో కూడా అదే సమయంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.






Comments