రిమ్స్‌కు రిఫర్ చేయొద్దు
- BAGADI NARAYANARAO

- 3 hours ago
- 1 min read
అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు
సమ్మెతో నిలిచిపోయిన రిఫరల్స్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ విషయంలో ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమై, అత్యవసర సేవలను బహిష్కరిస్తూ సమ్మెను తీవ్రతరం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే జూడాలు సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన రిమ్స్ అధికారులు, జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నుంచి రోగులను రిమ్స్‌కు రిఫర్ చేయవద్దని వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలతో గత రెండు రోజుల నుంచి ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల నుంచి రిమ్స్‌కు వచ్చే రిఫరల్ కేసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు టెక్కలి, నరసన్నపేట తదితర సీహెచ్‌సీల నుంచి వైద్యులను రిమ్స్‌కు డిప్యుటేషన్‌పై రప్పించి విధుల్లోకి తీసుకుంటున్నారు.
తప్పని అవస్థలు
రిఫరల్ కేసులను అడ్డుకున్నప్పటికీ, రిమ్స్‌లో రోగుల కష్టాలు తీరడం లేదు. సీనియర్ డాక్టర్లు ఇన్‌పేషెంట్ వార్డులు చూసిన తర్వాతే ఓపీకి వస్తుండటంతో రోగులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఆర్థో విభాగంలో మూడు యూనిట్లకు గాను రెండింటిలోనే వైద్యులు అందుబాటులో ఉన్నారు. హెచ్‌వోడీలు, ఇతర సీనియర్ వైద్యులు కొద్ది సమయం మాత్రమే ఓపీ చూసి వెళ్లిపోతున్నారని, సకాలంలో చాంబర్లకు రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూడాలు ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు మాత్రమే ఓపీ చూసే కొందరు వైద్యులు, ఈ అత్యవసర సమయంలోనూ స్పందించడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల ఖర్చులు భరించలేక రిమ్స్‌ను ఆశ్రయించే పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ రిఫరల్స్ నిలిపివేత, వైద్యుల అందుబాటు లేకపోవడం వల్ల అరకొర వైద్యమే అందుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, ఆసుపత్రిలో రోగుల పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి.






Comments