top of page

విలీన పంచాయతీల వ్యథ

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 13 hours ago
  • 2 min read
  • అటు కార్పొరేషన్ కాక.. ఇటు పంచాయతీ మిగలకుండా

  • 15 ఏళ్లుగా అందని ఎన్నికల భాగ్యం

  • నిధుల లేమితో కునారిల్లుతున్న గ్రామాలు

  • పన్నుల మోత తప్ప తీరని కనీస మౌలిక వసతులు

  • ఉపాధిహామీ పనులకు దూరమైన వేలాది మంది కూలీలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదంటే ఇదే. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎలాగూ 15 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారు. కనీసం విలీనం చేసిన పంచాయతీలకైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కునారిల్లిపోతున్న గ్రామీణుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయతీలది ఒక విచిత్రమైన పరిస్థితి. నగరానికి ఆనుకొని పంచాయతీల పరిధిలో భారీ భవనాలు కనిపిస్తున్నా, నాణేనికి మరోవైపు గ్రామీణ ప్రాంతం కూడా ఉంది. పాత్రునివలస, చాపురం, కిల్లిపాలెం, తోటపాలెం, కుశాలపురం వంటివి ఇందుకు ఉదాహరణ. నగరానికి దగ్గర్లో ఈ పంచాయతీ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నా పాత పంచాయతీలో గ్రామాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్ప్పుడు అటు కార్పొరేషన్‌కు చెందక, ఇటు పంచాయతీ నిధులూ రాక కనీస వసతులు లేకుండా కునారిల్లిపోతున్నాయి. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికలే వీటికి చివరివి. అప్పట్నుంచి కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన ఈ ఏడు పంచాయతీలు అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికి మధ్య నలిగిపోయాయి. 2013లో స్పెషలాఫీసర్ల పాలన జరిగిన తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే, ఇందులో విలీనమైన పంచాయతీలకు ఎన్నికలు జరపకూడదని అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఖాజీపేట, పాత్రునివలస, కుశాలపురం, తోటపాలెం పంచాయతీలు హైకోర్టుకు వెళ్లాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద స్టే విధించి ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2013లో ఈ నాలుగు పంచాయతీలకు మాత్రం ఎన్నికలయ్యాయి. అదే సమయంలో పెద్దపాడు, కిల్లిపాలెం, చాపురం పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. 2013 నుంచి 2018 మధ్య కాలపరిమితి ముగియడంతో 2018 ఆగస్టులో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. ఈ సమయంలో గతంలో ఎన్నికల కోసం కోర్టుకు వెళ్లిన మాదిరిగానే ఈసారి తామÖ వెళ్లి ఎన్నికలు జరిపించుకోవాలని మిగిలిన మÖడు పంచాయతీలు భావించాయి. కాకపోతే కరోనా సమయంలో ఒక్కరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడు పంచాయతీల విలీనాన్ని చట్టంగా మార్చేసింది. చట్టం మీద కోర్టు కల్పించుకోడానికి ఇష్టపడలేదు కాబట్టి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏడింటిని తప్పించారు. అప్పట్నుంచి నిధుల లేమితో ఈ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. చివరకు విలీనమైనా మాకు ఓకే మహాప్రభో, కోర్టులో కేసులు విత్‌డ్రా చేసుకుంటాం, గత ప్రభుత్వం చేసిన చట్టం మేరకైనా ఎన్నికలు జరిపిస్తే సంతోషమంటూ ఈ ఏడు పంచాయతీల ప్రతినిధులు నెత్తి కొట్టుకుంటున్నా ఇప్ప్పుడు ఎన్నికలకు లైన్ క్లియరవడంలేదు. అక్టోబర్ నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్ప్పుడు శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికల రాగమెత్తుకోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. అమరావతి పనుల్లో బిజీగా ఉన్న మంత్రి నారాయణకు ఈ కథ అర్థంకాదు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు దీని స్క్రీన్‌ప్లే తెలియదు. దీంతో పంచాయతీలు కూడా నష్టపోతున్నాయి. ఒక పంచాయతీ పరిధిలో కుళాయి రిపేరు చేయాలని ఫిర్యాదు చేస్తే వారం రోజులకు మున్సిపల్ సిబ్బంది వస్తున్నారు. కారణం పాత 36 వార్డు పరిధిల్లో పని చేయడానికే సరిపడా స్టాఫ్ ఇక్కడ లేరు. ఇక వీధి దీపాల కోసం మాట్లాడక్కర్లేదు. పంచాయతీ పరిధి నుంచి వీటిని తప్పించడం వల్ల జాతీయ ఉపాధిహామీ పథకంలో పనిదినాలను గ్రామీణులు కోల్పోయారు. ఒక్క పాత్రునివలసలో వీరి సంఖ్య 1500 వరకు ఉంటే, పెద్దపాడు పంచాయతీలో 2500 నుంచి 3వేల వరకు ఉపాధిహామీ కూలీలు ఉంటారు. ఇప్ప్పుడు అటు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగినా పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతుంది, లేదూ పంచాయతీలుగా ఉంచేసినా ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. కేవలం రూ.500 ఉన్న ఇంటిపన్ను రూ.5వేలుగా పెంచడం మినహా విలీన పంచాయతీల్లో గ్రామాలకు ఒరిగిందేమీ లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page