
ముస్లిం సమాజానికి చెందిన ఆస్తులు, భూములను సంరక్షించే వక్ఫ్ బోర్డుల విషయంలో పార్లమెంటు వేదికగా అధికార, విపక్షాల మధ్య పెద్ద సమరం జరిగింది. చివరికి ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర సర్కార్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు పంపేందుకు అంగీకరించడంతో తాత్కాలికంగానైనా ప్రతిపక్షాలు విజయం సాధించినట్లయ్యింది. కొన్నాళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో మార్పులకు సన్నాహాలు ప్రారంభించింది. గత శుక్రవారమే కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. దాంతో వక్ఫ్ సవరణ బిల్లు`2024ను కేంద్ర పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి ప్రభు త్వంపై విరుచుకుపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమి సభ్యులకు ఎంఐఎం, వైకాపా ఎంపీ లు కూడా జత కలిసి కేంద్రం తీరును తీవ్రంగా ఆక్షేపించారు. దేశ పౌరులకు మతస్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించిందని, అతి సున్నితమైన ముస్లిం మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుం టోందని పలువురు దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక సవరణను డీఎంకే ఎంపీ కనిమొళి ప్రస్తావిస్తూ హిందూ ఆలయ కమిటీల్లో హిందూయేతరులకు అవకాశం లేనప్పుడు.. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ఏమిటని నిలదీశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ సహా పలు పార్టీల సభ్యులు సర్కారుపై విరుచుకుపడ్డారు. బిల్లును తెచ్చేముందు సంబంధిత అన్ని పక్షాలతో సమగ్ర సంప్రదింపులు జరిపి ఉండాల్సిందని, కానీ పాలక పెద్దలు ఆ ప్రయత్నం చేయకుండానే ఏకపక్షంగా వక్ఫ్ చట్టంలో ఏకంగా 40 సవరణలకు పూనుకోవడం పౌరుల ప్రాథమిక హక్కులపై దాడిగానే భావించాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సమగ్ర పరిశీలన కోసం బిల్లును స్టాండిరగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. విశేషం ఏమిటంటే ఇంత కాలం ఎన్డీయే సర్కారు పార్లమెంటులో అనేక అంశాల్లో మద్దతుగా నిలుస్తూ వచ్చిన వైకాపా కూడా వక్ఫ్ బిల్లు విషయంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలతో గొంతు కలిపింది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చర్చలో పాల్గొంటూ మతపరమైన వ్యవహారాల్లో జోక్యం తగదన్నారు. తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకి స్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న తెలుగుదేశం సభ్యుడు హరీష్ మాధుర్ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ప్రతిపక్షాల వాదనలను, అనుమానాలను కొట్టిపారే శారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికే సవరణ బిల్లు ప్రతి పాదించామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోలేకపోయాయని విమర్శిం చారు. వక్ఫ్ ఆస్తులనే కాదు.. వక్ఫ్ బోర్డులను కూడా అనేకమంది పెద్దలు కబ్జా చేశారని, వారి చెర నుంచి వాటిని విడిపించేందుకే సవరణ బిల్లు తెచ్చామని సమర్థించుకున్నా.. ప్రతిపక్షాల ఒత్తిడితో చివరికి దాన్ని జేపీసీకి రిఫర్ చేయకతప్పలేదు. ఇంత రాద్ధాంతానికి, విమర్శలకు కారణమైన వక్ఫ్ చట్టం ఏమిటి? ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన సవరణలు ఏమిటన్న చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తుల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 1954లోనే వక్ఫ్ చట్టం అమల్లోకి తెచ్చింది. 1995లో ఆ చట్టానికి మొదటిసారి కొన్ని మార్పులు చేస్తూ సవరణ చట్టం తీసుకొచ్చారు. మళ్లీ 2013లో అప్పటి యూపీఏ`2 ప్రభుత్వం మరికొన్ని మార్పులతో సవరణ చట్టం చేసింది. తొలి చట్టం, అనంతరం చేసిన సవరణల వల్ల దేశంలో వివిధ స్థాయిల్లో ఉన్న వక్ఫ్ బోర్డులకు అపరిమితమైన అధికారాలు సంక్రమించాయి. ముస్లిం దేశాల్లో కూడా ఇలాంటి అధికారాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. ఈ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అనేకమంది ముస్లిం పెద్దలు వక్ఫ్ ఆస్తు లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభిస్తే.. మరికొందరు వక్ఫ్ బోర్డులనే తమ కుటుంబ సంస్థలుగా మార్చుకుని పెత్తనం చెలాయించసాగారు. వందల కోట్ల విలువైన ఆస్తులున్నా ఆదాయమెంతో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకునేందుకే కేంద్రం చట్టంలో అనేక మార్పులను ప్రతిపాదిం చింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ ఆస్తుల వివరాలన్నీ జిల్లా ఎగ్జిక్యూటవ్ మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ల వద్ద తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం, బోర్డుల నిర్వహణకు సంబంధించి జమాఖర్చుల వివరాలు కలెక్టర్లకు నిర్ణీత కాలపరిమితిలో సమర్పించాల్సి ఉంటుంది. ఆస్తులపై వివాదాలు తలెత్తినప్పుడు కలెక్టర్లు, కోర్టులు జోక్యం చేసుకునేందుకు కూడా వీలు కలుగుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన పలు సవరణలు ముస్లిం సమాజానికి చేటు చేసేలా ఉన్నాయని ముస్లిం సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి అభ్యంతరాలను పరిశీలించి సవరణ బిల్లులో చేయాల్సిన మార్పులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అయితే జేపీసీ నియామకం, దాని విచారణ పూర్తి అయ్యే సరికి కొంతకాలం పడుతుంది. అప్పటివరకు ఈ బిల్లు పెండిరగులో ఉన్నట్లే.
Bình luận