top of page

దుందుడుకు రాజకీయానికి చెంపదెబ్బ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 30, 2025
  • 2 min read

దుందుడుకుతనం, పెత్తందారీ ధోరణులు ఎన్నాళ్లో సాగవు. ఫ్యాక్షనిజానికి పెట్టింటి పేరైన రాయలసీమలో ఇప్పుడు ఆ దుస్సంస్కృతి తగ్గినా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ జేసీ బ్రదర్స్‌ రాజ్యం నడుస్తోంది. వీరిలో పెద్దవాడైన దివాకర్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా.. అతని సోదరుడు ప్రభాకర్‌రెడ్డి అన్నను మించిన పెత్తందారుగా మారిపోయాడు. ఎంతవారైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు కష్టమో నష్టమో ఆ పార్టీ సిద్ధాంతాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిదే. కానీ ‘తాడిపత్రి మా సొంత జాగీరు.. ఇక్కడ పార్టీ కాదు.. మేమే సర్వంసహాధికారులం.. మేం చెప్పినట్లే అంతా జరగాలి’ అన్న ధోరణితో పార్టీనే ధిక్కరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి దాని ఫలితం కొద్దిరోజులకే ఆయనకు అనుభవంలోకి వచ్చింది. అసలే పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నది చంద్రబాబు.. ఎవరిని ఎలా.. ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలిసనంతగా ఇంకెవరికీ తెలియకపోవచ్చు. జేసీ విషయంలో అది మరోమారు స్పష్టమైంది. అదను చూసి చంద్రబాబు ఆయన తోక కత్తిరించారు. అవమానభారంతో తలదించుకునేలా చేశారు. ఇదంతా ప్రభాకర్‌రెడ్డి స్వయంకృతమే. పార్టీనే ధిక్కరించి వ్యవహరించిన ఫలితమే. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురులేని పరిస్థితి చాలా కాలం నుంచే ఉంది. అయితే 2019`24 మధ్య వైకాపా ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దారెడ్డి దూకుడు ముందు జేసీ వర్గం కాస్త తగ్గి ఉండాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకొని కుమారుడు అస్మిత్‌ రెడ్డిని నిలబెట్టగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. కానీ కుమారుడి కంటే జేసీ దూకుడు ప్రదర్శిస్తూ తానే సూపర్‌ ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. రెండు విషయాల్లో పార్టీ అధినేత సూచనలనే ఖాతరు చేయకుండా అధికార యంత్రాంగాన్ని తూలనాడటం, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా చేయడం ఒకవిధంగా పార్టీని, అది నడుపుతున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ఈ విషయంలో చంద్రబాబు సూచనలను దివాకర్‌రెడ్డి ఏమాత్రం ఖాతరు చేయలేదు. 2019 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి వైకాపాకు చెందిన పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచీ పెద్దారెడ్డి, జేసీ వర్గాల మధ్య ఆధిపత్య యుద్ధం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిపోయి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే కావడం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అంతవరకు కాస్త వెనుకంజలో ఉన్న తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ దివాకర్‌రెడ్డి రెచ్చిపోయి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకే రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయంలో గతంలో ఉన్న పోలీసు అధికారులు సైతం చేతులెత్తేయడంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి సంయమనం పాటించమని స్వయంగా చంద్రబాబు సూచించినా జేసీ పట్టించుకోనట్లే వ్యవహరించారు. దీంతో వివాదం ముదిరి మరోసారి హైకోర్టు వరకు వెళ్లింది. ఇది చంద్రబాబుకు ఆగ్రహానికి కారణమైంది. తాడిపత్రి సమీపంలో ఉన్న కడప జిల్లా పరిధిలోని విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి విడుదలయ్యే బూడిద(ఫ్లైయాష్‌) విషయంలో ఆ జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే (మాజీ టీడీపీ నేత) ఆదినారాయణ రెడ్డితో దివాకర్‌రెడ్డి వివాదం పెట్టుకున్నారు. ఫ్లైయాష్‌ను తరలించేందుకు రెండు వర్గాలు పోటీ పడటం, ఆక్రమంలో పరస్పర ఆరోపణలతో నిప్పులు చెరగడం.. రవాణా వాహనాలను అడ్డుకోవడం మూడునెలల కిందట రాష్ట్రస్థాయిలో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇద్దరు నేతలనూ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు. అయితే ఆదినారాయణరెడ్డి వెళ్లి అధినేతను కలిసినా ప్రభాకర్‌రెడ్డి మాత్రం వెళ్లలేదు. ఇది కూడా బాబుకు ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ రెండు కూడా పార్టీని, అధినేతను ధిక్కరించేవిగానే ఉన్నాయని భావించిన పార్టీ నాయకత్వం జేసీని పక్కన పెట్టేసింది. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఓ పోలీసు అధికారిని ట్రాన్స్‌ఫర్‌ చేయమని జేసీ కోరుతున్నా పట్టించుకోకపోగా ప్రభుత్వం సదరు అధికారి శిక్షణకు వెళ్లాల్సి ఉన్నా.. దాన్ని వాయిదా వేయించి మరీ ఆయన్ను తాడిపత్రిలోనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. తాడిపత్రి ఏఎస్పీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్‌ అధికారి రోహిత్‌ కుమార్‌ చౌదరి నవంబర్‌ 10 నుంచి జనవరి నెలాఖరు వరకు శిక్షణకు వెళ్లాల్సి ఉంది. మరోవైపు రోహిత్‌కుమార్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆయన్ను తక్షణమే బదిలీ చేయాలని చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి చేశారు. కానీ ప్రభుత్వ పెద్దలు ప్రభాకర్‌రెడ్డిని అసలు పట్టించుకోలేదు. పైగా శిక్షణకు వెళ్లకుండా వెసులుబాటు కల్పించి మరీ మరో ఏడాదిపాటు తాడిపత్రి ఏఎస్పీగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్‌ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదే రీతిలో స్పందించడం తెలిసిందే. దీనిపై ఎస్పీని కలిసి మాట్లాడేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా దివాకర్‌రెడ్డి తిరస్కారానికి గురయ్యారు. గంటకుపైగా వేచి ఉన్నా ఎస్పీ జగదీష్‌ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఆ అవమాన భారంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకోవడం, బెదిరించడం కూడా వివాదాస్పదమైంది. అధికార పార్టీలో ఉన్నా.. జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం, తన సూచనలకు విరుద్ధంగా ఏఎస్పీని ఇక్కడే కొనసాగించడం జేసీ దూకుడు రాజకీయానికి చెంపపెట్టు లాంటిదే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page