మనపక్కనే అమెరికా బల్లెం!
- DV RAMANA

- 4 days ago
- 3 min read

పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రేగుతుంటే, వాటి చిటపటలు హిందూ మహాసముద్రంలో కనిపిం చడమేమిటి? యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని హిందూ మహాసముద్ర జలాల్లో పయనిస్తూ తన దేశంవైపు సాగుతున్న ఇరాన్ యుద్ధనౌకను ఎటువంటి నిబంధనలు, అంతర్జాతీయ యుద్ధ ప్రమాణాలు పాటించకుండా.. అంతకుమించి ఎటువంటి హెచ్చరికలు లేకుండానే తన మానాన తను పోతున్న ఇరాన్ యుద్ధనౌకపై అమెరికన్ సబ్‌మెరైన్ దాడి చేసి నౌకతోసహా వందమందిని జలసమాధి చేయ డాన్ని ఏ యుద్ధనీతి, నిబంధనలు కూడా అంగీకరించవు. కానీ నోరున్నోడిదే రాజ్యం అన్నట్లు అమెరికా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫలితమే ఈ దాడిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తు న్నారు. ఈ దాడిపై రకరకాల చర్చలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. అసలు ఇరాన్ యుద్ధనౌక యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లాలి.. ఎందుకు అమెరికా జలాంతర్గామి దృష్టిలో పడాలి.. దాని తలరాత అలా ఉంది కనుకే అమెరికా చేతిలో చిక్కి జలసమాధి అయ్యిందని వితండ వాదం చూస్తున్నవారూ ఉన్నారు. ట్రంప్ దొరగారి నిరంకుశ ధోరణిని, పెత్తందారీ విధానాలను చూసి పరవశించిపోయే సోషల్ మీడియా భక్తులు ఇప్పుడు ఇలాగూ ఆలోచిస్తున్నారు.. వాదిస్తున్నారు. యుద్ధం చేసుకోవడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ యుద్ధం పేరుతో విచక్షణారహితం గా చేస్తున్న అకత్యాలను కూడా సమర్థించేలా కట్టుకథల బాంబులు వేస్తున్నారు. బాంబు దాడిలో నూటా అరవై అయిదు మంది బాలికలను చంపిన చోట.. పాఠశాల ప్రాంగణంలో నేలమాళిగ ఉందని, అందులో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం అందిందట! అందుకే ఆ పిల్లల మరణం సహేతుక మట!! ఇజ్రాయెలీలు, అమెరికన్లను మించి మనవాళ్లే ఈ అకత్యాలకు వంతపాడుతుండటం శోచనీ యం. సరే.. ఆ సంగతి పక్కనపెడితే.. అమెరికా జలాంతర్గామి దెబ్బకు జలసమాధి అయిన ఇరాని యన్ యుద్ధనౌక భారతదేశం ఆహ్వానం మీదే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ విన్యాసాల్లో పాల్గొనడానికి గత నెలలో విశాఖపట్నానికి వచ్చింది. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి తిరుగు ప్రయాణ మైంది. ఇంతలోనే యుద్ధం మొదలుకావడంతో శ్రీలంకలో ఆశ్రయం కోరింది. ఆశ్రయం లభించడం లో ఎందుకో ఆలస్యం జరిగింది. అంతలోనే శ్రీలంక ప్రాదేశిక జలాలు, అంతర్జాతీయ జలాలకు మధ్య లో ఆ వార్‌షిప్ అమెరికన్ జలాంతర్గామి దాడిలో పేలిపోయి, మునిగిపోయింది. ఆ పని తామే చేశా మని అమెరికా గర్వంగా ప్రకటించుకుంది. మునిగిపోయిన తమ నౌక భారతదేశానికి అతిథిగా వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అమెరికా దాడికి తెగబడిందని ఇరాన్ ప్రభుత్వం ప్రపంచానికి తెలియ జెప్పింది. తద్వారా తమనే కాకుండా భారతదేశాన్ని కూడా అమెరికా ఇబ్బంది పెట్టిందని ఇరాన్ పరో క్షంగా ప్రపంచానికి చాటింది. అయితే ఆ పనిని భారత ప్రభుత్వం చేయలేకపోయిందని, తమ అతిథిగా వచ్చి తిరిగి వెళ్తున్న నౌకపై దాడి చేయడాన్ని ఖండిస్తూ అమెరికాకు నిరసన తెలపకపోవడం దౌత్య పరంగా తప్పిదమని కొందరు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక సమీపంలోనే ఈ దాడి జరిగిందంటే.. దాదాపు అమెరికా సైనిక చర్యలు మన దేశానికి దగ్గరగా వచ్చేసినట్లేనని పలువురు విశ్లేషిస్తున్నారు. భారత సరిహద్దుల సమీపంలో హిందూ మహాసముద్రంలో యుద్ధచర్యలు సమంజసం అమెరికా ఎందుకు భావించలేదు. అటువంటి మర్యాదను భారత్ ఎందుకు ఆశించలేదు అన్న ప్రశ్నలు తలెత్తు తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం భారత్ స్వయంకతమేనని చెప్పాలి. హిందూ మహాసముద్రంపై ఒకప్పుడు తనకున్న పట్టును భారత ప్రభుత్వం కాలక్రమంలో వదిలేసిన ఫలితమే ప్రస్తుత పరిణామా లు. కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. తనకు కనుచూపు మేరలో, క్షిపణి ఎగిరే దూరంలో ఏ దేశ సైనిక స్థావరమూ ఉండకూడదని ఇండియా ఒకప్పుడు భావించింది.. దాని కోసం పోరాడింది. మారిషస్, ఆఫ్రికా ఖండ తూర్పు ప్రాంతానికి మధ్య ఉన్న డిగోగార్షియా దీవి బ్రిటిష్ ఆధీనంలో ఉండగా ఆ దీవిలో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసినప్పుడు అలీనోద్యమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డిగోగార్షియా నుంచి అమెరికా వైదొలగాలని, హిందూ మహాసము ద్రాన్ని శాంతి మండలంగా ప్రకటించాలని అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అంతర్జాతీయ వేదిక ýపైనా, ప్రకటనల్లోనూ డిమాండ్ చేసేవారు. యావత్ హిందూ మహాసముద్రాన్ని నిస్సైనికం (సైనికు లు లేని ప్రాంతం) చేయాలన్న డిమాండ్‌కు మన దేశంలో కూడా విస్తత మద్దతు లభించింది. అయితే 1990ల తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. భారత్ అమెరికా, ఇజ్రాయిల్‌లకు దగ్గరవుతూ వచ్చింది. పైగా భారతదేశమే అమెరికా యుద్ధ విమానాలకు తన స్థావరాల్లో ఇంధనం నింపిన కాలం అది. మరో వైపు చైనా బలపడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సైనిక స్థావరాలు పెట్టి, విన్యాసాలు చేస్తుండడంతో భారత ఆలోచనల్లో మార్పు వచ్చింది. డిగోగార్షియాలో అమెరికా స్థావరం ఉంటేనే ఆ ప్రాంతంలో సైనిక సమతూకం ఏర్పడి తాను భద్రంగా ఉంటానని భావించిన భారత్ డిగోగార్షియా ఊసు ఎత్తడం మానేసింది. ఫలితంగా రెండు గల్ఫ్ యుద్ధాల్లోనే కాకుండా ఆఫ్ఘ్‌నిస్తాన్ యుద్ధాల సమ యంలోనూ డిగోగార్షియా అమెరికాకు సైనిక స్థావరంగా పని చేసింది. ఒకనాడు హిందూ మహా సముద్రాన్ని నిస్సైనికం చేయాలని కోరుకున్న అలీనోద్యమం ఆ తర్వాత బలహీనపడుతూ వచ్చింది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అమెరికా, రష్యా కూటముల్లో చేరకుండా స్వతంత్రంగా వ్యవహరించిన నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ (అలీనోద్యమం) ఉనికి కొత్త శతాబ్దంలో నామమాత్రంగా మారిపోయింది. ఒకనాడు అలీనోద్యమంలో సభ్యురాలిగా ఉన్న ఇరాన్ అణ్వస్త్ర వ్యతిరేక ఒప్పందంపై సంతకం చేయ లేదన్న కక్షతో అమెరికా యుద్ధానికి దిగింది. అందులో భాగమే మనకు గెస్ట్‌గా వచ్చిన ఆ దేశ నౌకను ముంచేసింది. అంటే మనల్ని కూడా అమెరికా ఖాతరు చేయలేదన్నమాట! ఇదేనా మన సార్వభౌమత్వం!!






Comments