75 వసంతాల ‘పాతాళ భైరవి’
- SATYAM DAILY
- 4 days ago
- 2 min read
తెలుగు కమర్షియల్ సినిమాకు తొలి పునాది రాయి!

సినిమా రంగానికి కేవలం సాంకేతిక విప్లవాన్నే కాకుండా, తెలుగు చిత్రసీమలో నేటి ‘కమర్షియల్ ఫార్ములా’కు బీజం వేసిన అద్భుత దృశ్యకావ్యం ‘పాతాళ భైరవి’. ఈ చిత్రం విడుదలై 75 ఏళ్లు (వజ్రోత్సవం) పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, నాటి విశేషాలు, ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన కథనాలు మరియు భారతీయ చలనచిత్ర రగంపై ఈ సినిమా చూపిన ముద్రపై ప్రముఖ సినీ విశ్లేషకులు భరద్వాజ్ అందించిన ప్రత్యేక విశ్లేషణ మీకోసం...
అల్లావుద్దీన్ అద్భుత దీపం... పింగళి అద్భుత సృష్టి
‘పాతాళ భైరవి’ కథకి ప్రధాన పునాది ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ పింగళి నాగేంద్రరావు గారు ఈ జానపద కథను మన సంస్కృతికి, నాటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. పింగళి గారి ఊహాశక్తికి, దర్శకుడు కేవి రెడ్డి గారి ప్రతిభ తోడవ్వడంతో విజయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగిరెడ్డి, చక్రపాణి గార్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ‘నేపాల్ మాంత్రికుడు’ పాత్ర, ‘నరుడా ఏమి నీ కోరిక’ డైలాగ్స్, ‘గురువా’ అనే పదం... ప్రతీదీ జనం గుండెల్లో పాతుకుపోయాయి. పింగళి గారు రాసిన సంభాషణలు, సృష్టించిన భాషా మాడ్యులేషన్స్ ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో పాఠ్యపుస్తకాలుగా నిలిచిపోయాయి.
“కమర్షియల్ సినిమా ఫార్ములా అంటే ఏమిటో ఈ చిత్రంలో ఒక డైలాగ్ ద్వారా చెప్తారు: ‘మనం చేసేది జనం చూడాలా? జనం కోరేది మనం చేయాలా?’ అంటే... ‘మనమే జనం, జనమే మనం’ అని నమ్మి తీస్తే అదే విజయం సాధిస్తుంది.”
టెన్నిస్ కోర్టులో దొరికిన ‘తోటరాముడు’!
తోటరాముడి పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరరావుని లేదా డాన్సర్ రాజారెడ్డిని అనుకున్నారు. మాంత్రికుడి పాత్రకు ముక్కామల పేరు పరిశీలనలోకి వచ్చింది. కానీ విధి వేరేలా తలంచింది. వాహిని స్టూడియో కాంపౌండ్‌లో ఎన్టీఆర్ పొద్దున్నే టెన్నిస్ ఆడుతుండగా కేవి రెడ్డి గమనించారు. ఆ ఆటలో ఎన్టీఆర్ చూపించిన తెంపరితనం, ఆ వేగం, ఆ బాడీ లాంగ్వేజ్ చూసిన కేవి రెడ్డి... “ఇదిగో ఇతనే మన తోటరాముడు!” అని స్పాట్‌లోనే డిసైడ్ అయ్యారు. విజయ బ్యానర్ పేరోల్ పై నెలకు ?350 జీతం, సినిమాకి? 5,000 పారితోషికం ఒప్పందంతో ఎన్టీఆర్ ఈప్రాజెక్ట్‌లోకి వచ్చారు.
ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రయాణాన్ని మార్చేసిన పాత్ర!
తోటరాముడి పాత్రలో ఉండే తెంపరితనం, మొండితనం, ‘దేనికైనా సరే ముందుకు దూకే’ ధోరణి ఎన్టీఆర్ నిజ జీవితాన్ని, ఆయన రాజకీయ ప్రయాణాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేశాయి.
మట్టి బొమ్మలకు మహారణం: సినిమాలో “మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన సాలివాహనుడు” అనే పాట లైన్ ఉన్నట్లే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా ఎటువంటి రాజకీయానుభవం లేని సామాన్యులకు సీట్లు ఇచ్చి గెలిపించారు.
నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సరదాగా... “ఆయన ఇంకా తోటరాముడు క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు, అదే తెంపరితనంతో రాజకీయం చేస్తున్నారు” అని ముల్లపూడి వెంకటరమణతో అన్నారట!
అద్భుతమైన సాంకేతిక విలువల సమాహారం
దర్శకత్వం:
కేవి రెడ్డి సెట్స్‌లో ప్రొడ్యూసర్లకు కూడా జోక్యం లేనంతటి పట్టు సాధించిన దర్శకుడు.
సంగీతం:
ఘంటసాల: ప్రతీ పాట ఒక మణిహారం. ఈ చిత్రంతో మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా స్థిరపడ్డారు. ।
ఛాయాగ్రహణం:
మార్కస్ బార్ట్‌లే విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, ముసలి ఫైట్ సీన్స్ అప్పట్లోనే సంచలనం. ।
ప్రతిభావంతమైన నటన: ఎస్.వి.రంగారావు, నేపాల్ మాంత్రికుడిగా అద్భుతమైన విలనిజం, మాడ్యులేషన్ పండించారు. ।
టాలీవుడ్ నుంచి పాన్-ఇండియా రేంజ్!
‘పాతాళ భైరవి’ కేవలం తెలుగు రంగానికే పరిమితం కాలేదు. ఇది తమిళంలో ఘనవిజయం సాధించడమే కాకుండా, హిందీలోకి కూడా డబ్/రీమేక్ అయి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్:
ఈ సినిమా విజయంతో జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ తిరుగులేని శక్తిగా మారారు. దీనితో ఏఎనఆర్ తన వ్యూహాన్ని మార్చుకుని, సామాజిక చిత్రాలు (సాంఘికాలు), విప్రనారాయణ, దేవదాసు వంటి లవర్ బాయ్/భక్తి రస పాత్రల వైపు మొగ్గు చూపారు.
నేటికీ చెరగని ముద్ర
చిరంజీవి, కృష్ణ వంటి తర్వాతి తరం అగ్ర నటులందరికీ ‘పాతాళ భైరవి’ ఒక బెంచ్ మార్క్ మూవీగా నిలిచింది. నేటికీ ఒక పర్ఫెక్ట్ మాస్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫాంటసీ సమ్మేళనానికి పాతాళ భైరవి చిత్రమే అత్యుత్తమ ఉదాహరణ. 75 ఏళ్లు పూర్తయినా తెలుగు సినిమా హిస్టరీలో ఈ చిత్రం ఒక వజ్రంలా మెరుస్తూనే ఉంటుంది.






Comments