top of page

అక్షరాలు వస్తున్నాయి.. అర్థాలు రావడం లేదు!!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 1 day ago
  • 2 min read
  • ప్రాథమికం ఓకే.. సెకండరీపైనే సవాల్!

  • 40శాతం డ్రాపౌట్లతో తలకిందులవుతున్న విద్యా లక్ష్యాలు

  • వేల పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు

  • పదేళ్లు స్టడీ చేసి ఆందోళన వ్యక్తం చేసిన నీతి అయోగ్

(సత్యంన్యూస్, అమరావతి)

భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థపై నీతి ఆయోగ్ చేపట్టిన దశాబ్ద కాల విశ్లేషణ ప్రకారం, ప్రాథమిక స్థాయిలో అందరికీ విద్య అందుబాటులోకి వచ్చినప్పటికీ, సెకండరీ స్థాయిలో విద్యార్థులను పాఠశాలల్లో కొనసాగించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అలాగే, ఆశించిన అభ్యసన ఫలితాల సాధనలో కూడా నిరంతర సంక్షోభం కనిపిస్తోంది.

‘భారతదేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ ` టెంపోరల్ అనాలిసిస్ అండ్ పాలసీ రోడ్‌మ్యాప్ ఫర్ క్వాలిటీ ఎన్‌హాన్స్‌మెంట’ శీర్షికతో విడుదలైన ఈ నివేదిక, విద్యా వ్యవస్థలోని ‘పిరమిడ’ సమస్యను ఎత్తిచూపింది. ప్రస్తుతం దేశంలో 14.71 లక్షల పాఠశాలలు, 24.69 కోట్ల మంది విద్యార్థులతో ఈ వ్యవస్థ ఒక మొనదేలిన పిరమిడ్ ఆకారంలో ఉంది.

అధిక డ్రాపౌట్లు

దేశంలో 7.3 లక్షల ప్రాథమిక పాఠశాలలు ఉండగా, హయ్యర్ సెకండరీ స్థాయికి వచ్చేసరికి ఆ సంఖ్య కేవలం 1.64 లక్షలకు పడిపోతోంది. బడిలో చేరిన ప్రతి 10 మంది పిల్లలలో నలుగురు హయ్యర్ సెకండరీ విద్య పూర్తికాకముందే చదువు ఆపేస్తున్నారు

జీరో ఎన్‌రోల్‌మెంట్

మరో ఆందోళనకర అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా సుమారు 7,993 పాఠశాలల్లో అసలు అడ్మిషన్లే లేవు. ఇందులో పశ్చిమ బెంగాల్ (3,812) మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ (2,245) రెండో స్థానంలో ఉంది. పరిపాలనా రికార్డుల్లో ఇవి నడుస్తున్నట్లు ఉన్నా, క్షేత్రస్థాయిలో విద్యార్థులు లేరు. అయినప్పటికీ, రికార్డులు అప్‌డేట్ కాకపోవడం వల్ల ఈ పాఠశాలలకు నిధులు, వనరులు అందుతూనే ఉన్నాయి.

పరిష్కారం సిలిండ్రికల్ స్కూలింగ్

విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేయడాన్ని అరికట్టడానికి సిలిండ్రికల్ (స్తూపాకార) స్కూలింగ్ పద్ధతిని నివేదిక సిఫార్సు చేసింది. అంటే, 1 నుండి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యనందించే కాంపోజిట్ స్కూల్స్ ఏర్పాటు చేయడం. అలాగే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 14 ఏళ్ల వయస్సుతో ముగిసిపోవడంతో, ఆపై తరగతుల పిల్లల పుస్తకాలు, రవాణా ఖర్చులు భరించడం కుటుంబాలకు భారంగా మారుతోందని నివేదిక అభిప్రాయపడింది.

సదుపాయాల లేమి

2024-25 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.19 లక్షల పాఠశాలల్లో కనీసం విద్యుత్ సౌకర్యం లేదని ఈ నివేదిక వెల్లడించింది. నీరు, పరిశుభ్రత సౌకర్యాల విషయంలోనూ అస్థిరత కనిపిస్తోంది. తాగునీటి సదుపాయం ఉన్న పాఠశాలల వాటా 2014లో 96.5% ఉండగా, 2025 నాటికి అది 99% కి పెరిగింది. అయినప్పటికీ, ఇంకా 14,505 పాఠశాలల్లో నీటి వనరులు లేవు, అలాగే దాదాపు 59,829 పాఠశాలల్లో చేతులు కడుక్కోవడానికి (హ్యాండ్ వాష్) సదుపాయాలు లేవు. ఇది విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రమాదంలో పడేస్తోంది.

అభ్యసన సామర్థ్యాల క్షీణత

విద్యార్థుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, 8వ తరగతి విద్యార్థుల్లో చదివే నైపుణ్యం తగ్గింది. 2014లో 74.7% మంది 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి స్థాయి పాఠాన్ని చదవగలిగేవారు. 2024 నాటికి ఆ సంఖ్య 71.1% కి పడిపోయింది. గణితంలో కేవలం 45.8% మంది 8వ తరగతి విద్యార్థులు మాత్రమే ఒక ప్రాథమిక భాగహార లెక్కను పూర్తి చేయగలుగుతున్నారు. విద్యార్థులు బట్టీ పట్టే పద్ధతుల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ, నిజజీవిత అన్వయాలలో ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు 6వ తరగతి విద్యార్థులలో 30% కంటే తక్కువ మంది మాత్రమే భాగాహారాల మీద పట్టు ప్రదర్శిస్తున్నారు,” అని నివేదిక వివరించింది.

పాఠశాల సముదాయాలు ఏర్పాటు కావాలి.

ఒక సెకండరీ లేదా సీనియర్ సెకండరీ పాఠశాల పరిధిలో (సాధారణంగా 5 నుండి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో) ఉన్న తక్కువ తరగతుల పాఠశాలలు, సమీపంలోని అంగన్‌వాడీలన్నింటినీ ఒక సమూహంగా చేర్చాలని నివేదిక పేర్కొంది.

నిధుల కేటాయింపు

భారతదేశం ప్రస్తుతం విద్య కోసం కేటాయిస్తున్న నిధులు జిడిపిలో 4.6% మాత్రమేనని, ఇది 1964లో మొదటిసారిగా సిఫార్సు చేసిన 6% లక్ష్యం కంటే తక్కువగా ఉందని నివేదిక గుర్తు చేసింది. విద్యా సంస్కరణలు విజయవంతం కావాలంటే నిధుల కేటాయింపును పెంచడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page