top of page

అసమానతల అభివృద్ధి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read

మన ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది.. అగ్రదేశాలతో పోటీపడుతూ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అమెరికా, చైనాల వంటి దేశాల సరసన చేరిందని మనం చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ పాలకులు చెబుతున్న ఈ ఆర్థిక వృద్ధి పౌరుల స్థాయికి చేరడంలేదని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక కుండ బద్దలు కొట్టింది. ఈ నెల ఒకటో తేదీన విడుదల చేసిన కంట్రీ ఇన్‌కమ్ క్లాసిఫికేషన్స్`2026 నివేదిక ప్రకారం.. భారతదేశంలో పౌరుల తలసరి ఆదాయం 2760 డాలర్లు మాత్రమే. అంటే దేశం ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలోనే కొనసాగుతున్నదన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల కంటే ఈ విషయంలో చాలా దిగువన ఉన్నట్లు ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతున్నది. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. దేశమంతటా తలసరి ఆదాయం ఏకరీతిలో లేదు. రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది. కేవలం ఐదు రాష్ట్రాల తలసరి ఆదాయం మాత్రమే ఎగువ మధ్య(అప్పర్ మిడిల్) ఆదాయ స్థాయిని దాటినట్లు వెల్లడించింది. ఈ రేసులో కొన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతుండగా, మరికొన్ని మెల్లగా అడుగులు వేస్తుంటే.. ఇంకొన్ని పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం 4,636 డాలర్లు, అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రాంతాలు, దేశాలు అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ కేటగిరీలోకి వస్తాయి. ఈ ప్రమాణాన్ని అధిగమించిన రాష్ట్రాలు ఐదు మాత్రమే. ఈ జాబితాల్లో 6217 డాలర్లతో ఢిల్లీ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో ఉంటే.. కర్ణాటక (5,579 డాలర్లు), తెలంగాణ (5,407 డాలర్లు), తమిళనాడు (5,329 డాలర్లు), గుజరాత్ (4,734 డాలర్లు) వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాస్త తక్కువ తలసరి ఆదాయంతో ఈ రాష్ట్రాలకు అతిచేరువలో మహారాష్ట్ర (4,628 డాలర్లు), హర్యానా (4,627 డాలర్లు), కేరళ (4,610 డాలర్లు) ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన ఆదాయ ప్రమాణాలకు చాలా దగ్గరలో ఉన్నందున ఈ మÖడు రాష్ట్రాలు త్వరలోనే ఎగువ మధ్య తరగతి జాబితాలో చేరే అవకాశముంది. ఇక కనిష్ట స్థాయిలను పరిశీలిస్తే బీహార్ చిట్టచివరన ఉంది. ఈ రాష్ట్ర తలసరి ఆదాయం 984 డాలర్లు మాత్రమే. దానికంటే కాస్త పైన ఉత్తరప్రదేశ్ (1,403 డాలర్లు), జార్ఖండ్ (1,470 డాలర్లు) నిలిచాయి. కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరువవుతుండగా మరికొన్ని ఇంకా చాలా తక్కువ ఆదాయ స్థాయిలోనే ఉన్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. బీహార్ పరిస్థితి మరీ దారుణం. ఆ రాష్ట్ర తలసరి ఆదాయం భారత సగటు కంటే చాలా తక్కువగా ఉండటమే కాకుండా నేపాల్‌తో పాటు కొన్ని ఆఫ్రికా దేశాల కంటే కూడా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అయితే గతం కంటే ఇది చాలా మెరుగని తేలింది. గత మÖడు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయ మార్పులు చేటుచేసుకున్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. 1994లో భారత్‌లోని ఏ పెద్ద రాష్ట్రం కూడా మధ్య ఆదాయ కేటగిరీలో లేదు. కానీ ఇప్పడు అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయ స్థాయిలో సమానంగా, మరికొన్ని దేశాల కంటే అధిక వృద్ధి సాధించగలిగాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తలసరి ఆదాయం ఇండోనేషియా (5,120 డాలర్లు), వియత్నాం (4,970 డాలర్లు) దేశాల కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు ఢిల్లీ రాష్ట్ర తలసరి ఆదాయం దక్షిణాఫ్రికా (6,270 డాలర్లు), ఫిజీ (6,230 డాలర్లు), మంగోలియా (6,210 డాలర్లు) దేశాలతో దాదాపు సమానంగా ఉంది. ఇది గత 30 ఏళ్లలో భారత రాష్ట్రాల ఆర్థిక పురోగతి ఎంత వేగంగా జరిగిందో సూచిస్తోంది. అయితే దేశంలో రాష్ట్రాల మధ్య అసమానతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి జరిగినప్పటికీ దానితో పోటీ పడుతూ రాష్ట్రాల మధ్య అసమానతలు కూడా పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఈ అసమానతలు గతంలో ఉన్న 0.230 నుంచి 0.261 పాయింట్లు పెరగడం గమనార్హం. అత్యంత సంపన్న, అత్యంత పేద రాష్ట్రాల మధ్య ఆదాయ వ్యత్యాసం 2.38 రెట్లు నుంచి 3.73 రెట్లకు పెరిగింది. గత మÖడు దశాబ్దాల్లో మధ్య ఆదాయ రాష్ట్రాల తలసరి ఆదాయం 36.7 రెట్లు పెరిగింది. అదే సమయంలో అత్యంత పేద రాష్ట్రాల్లో మాత్రం 26.6 రెట్ల పెరుగుదల మాత్రమే నమోదైంది. అంటే.. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా అది అన్ని రాష్ట్రాలకు సమానంగా అందడంలేదని అర్థమవుతుంది. ఈ అసమానతలు ఏ స్థాయిలో పెరిగాయంటే.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను చిన్న రాష్ట్రమైన ఒడిశా అధిగమించింది. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర తలసరి ఆదాయం ఉత్తరప్రదేశ్ కంటే 75 శాతం ఎక్కువ కావడం విశేషం. మరోవైపు అసోం రాష్ట్రం జార్ఖండ్‌ను దాటేసింది. అస్సాం ఆదాయం ఇప్పుడు జార్ఖండ్ కంటే 48 శాతం ఎక్కువ. 1994-95 నాటికి తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ ఇప్పుడు రాజస్థాన్ స్థాయికి తగ్గిపోయింది. అంతేకాకుండా దేశంలోని ఏడు రాష్ట్రాల కంటే తక్కువ ఆదాయంతో వెనుకబడింది. దేశ ఆర్థిక నాయకత్వం ఇకపై సంప్రదాయ పారిశ్రామిక లేదా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలకే పరిమితం కాకుండా కొత్త పోకడలు, అభివృద్ధి వివాదాల్లో వైవిధ్యం ద్వారా చిన్న, కొత్త రాష్ట్రాలు వేగంగా ఎదుగుతున్నాయని నివేదికలోని గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. భారత్ సగటు తలసరి ఆదాయం ఇంకా దిగువ మధ్య ఆదాయ స్థాయిలో ఉండటమే బాధాకరమైతే.. రాష్ట్రాల మధ్య భారీ అసమానతలు ఉండటం మరింత విచారకరం. చాలా రాష్ట్రాలు ఇంకా ప్రాథమిక ఆదాయ స్థాయిని అధిగమించి ముందుకు రావడానికే పోరాడుతున్నాయి. అంటే భారత్ అభివృద్ధి ప్రయాణం అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సాగలేదని, కొన్ని రాష్ట్రాలు వేగంగా ముందుకు దూసుకెళ్తుండగా మరికొన్ని వెనుకబడిపోయాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలు ఏకరీతిలో అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రాలు కూడా ఈ విషయంలో సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page