ఆ ఘటన వెనుక మాస్టర్ మైండ్‌ను బయటకు లాగండి
- Prasad Satyam
- Oct 6
- 2 min read
ఎమ్మెల్యే కల్పించుకోపోతే పోలీసులు స్పందించేవారు కాదు
శివబాలాజీ ఆలయం పరిసరాల్లో హైడ్రామాపై ప్రెస్‌మీట్ పెట్టిన కళింగకోమటి పెద్దలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్థానిక బ్యాంకర్స్ కాలనీ శివబాలాజీ ఆలయం ఎదురుగా ఉన్న తంగుడు ఉపేంద్ర ఇంటిలో గ్రౌండ్‌ఫ్లోర్‌ను నగరానికి చెందిన జామి విష్ణుమూర్తికి అద్దెకిస్తే, ఆయన చనిపోయిన తర్వాత భార్య ఉండాల్సిన ఇంటిలో వేరే ప్రాంతం నుంచి వచ్చిన కొందరు దూరిపోయి శుక్రవారం రాత్రి ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సృష్టించిన అరాచకం వెనుక మాస్టర్ మైండ్‌ను బయటకు లాగాలని నగర కళింగకోమటి సంఘ అధ్యక్షుడు కోరాడ హరిగోపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు స్థానిక కళింగవైశ్య కల్యాణ మండపంలో సోమవారం బాధిత తంగుడు ఉపేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఘటనను మీడియాకు వివరించారు. జామి విష్ణుమూర్తి భార్య మూడు నెలలుగా ఆ ఇంటిలో లేకపోయినా తాళాలు తీసుకొని దర్జాగా ఇంటిలోకి ప్రవేశించిన దుండగులను ప్రశ్నిస్తే, ఇల్లు తగులబెట్టేస్తామని లేదంటే గ్యాస్ సిలెండర్‌ను పేల్చేస్తామంటూ పోలీసులకే హెచ్చరించిన ఘటనలో మాస్టర్ మైండ్ ఎవరున్నారనేది పోలీసులు బయటపెట్టాలని కోరారు. శుక్రవారం రాత్రి నుంచి జరిగిన హైడ్రామాలో మొత్తం కళింగకోమటి సామాజికవర్గమంతా అక్కడే ఉన్నా వారినేమీ చేయలేకపోయారని, చివరకు రూరల్ పోలీసులు కూడా వచ్చి, వారిని బయటకు తీసుకురాలేక చేతులెత్తేశారని, శనివారం ఉదయం ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిన తర్వాత మాత్రమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అంతవరకు పోలీసులు కూడా తమ విధిని సక్రమంగా నిర్వర్తించలేదన్న భావనను కళింగకోమటి నేతలు కొందరు వ్యక్తం చేశారు. పూర్తిగా మద్యం మత్తులోనో, లేదంటే మాదకద్రవ్యాల మత్తులోనో ఉన్న ఈ ముఠా మేడమీద ఉన్న తంగుడు ఉపేంద్ర కుటుంబానికి ఏ రాత్రి సమయంలోనైనా హాని చేసే అవకాశం ఉందని రూరల్ పోలీసులకు చెప్పినా, దీన్ని సివిల్ మేటర్‌గా పరిగణించి ఇంటిపెద్ద ఉపేంద్రను స్టేషన్‌లో రెండు గంటలు కూర్చోబెట్టడం వెనుక ఏదో జరిగిందని, దాని వెనుక ఓ మాస్టర్‌మైండ్ ఉందని, దాన్ని బయటకు తేవాలని కోరారు. విలేకరుల సమావేశానికి ముందు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను 70 మంది కళింగకోమట్లు ఆయన కార్యాలయంలో కలిశారు. తంగుడు ఉపేంద్రకు, జామి రమేష్‌కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీ, కోర్టులో ఉన్న కేసుతో పాటు నగరంలో జామి రమేష్ ఎంతమందిని ముంచేసిందీ వంటి విషయాలు ఎమ్మెల్యేకు తెలిపారు. కేవలం తంగుడు ఉపేంద్ర దగ్గర తీసుకున్న సొమ్ములు తిరిగి చెల్లించాల్సివచ్చిందన్న అక్కసుతోనే ఆయన ఇంటిలో అద్దెకు ఉంటున్న రమేష్ తల్లి దగ్గర్నుంచి తాళం తీసుకొని, కిరాయి మూకలను లోపలికి పంపారని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ విషయం తన దృష్టిలో ఉందని ఎమ్మెల్యే చెప్పడంతో విలేకరుల సమావేశం ద్వారా పరోక్షంగా జామి రమేష్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ప్రైవేటు చిట్‌లు, ఫైనాన్స్‌లు నిర్వహిస్తున్నవారి వద్ద తీసుకున్న సొమ్ములు చెల్లించకపోవడం, రియల్ ఎస్టేట్‌లో భాగస్వాములతో పేచీలు, అప్పు, చేబదులు రూపంలో తీసుకొని రమేష్ పెద్ద ఎత్తున వడ్డీలకు తిప్పుతున్నా బకాయిలు తీర్చాల్సినవారికి మాత్రం మొండిచెయ్యి చూపడం వంటి ఘటనలు ప్రతీ ఏడాది పెరిగిపోతుండటంతో ఆయన బాధితులు నగరంలో పెరిగిపోయారు. అనేకమందికి తాను సొమ్ములివ్వాల్సి ఉన్నా ఏమీ చేయలేకపోయానని, కేవలం తంగుడు ఉపేంద్ర మాత్రం చేపలవీధిలో ఉంటున్న తన ఇంటి మీద అటౌచ్‌మెంట్‌కు కోర్టును ఆశ్రయించడం వల్ల కోర్టు బయట ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందన్న అక్కసుతోనే ఉపేంద్ర ఇంటిలోకి కిరాయి మూకలను రమేష్ పంపించాడంటూ ఎమ్మెల్యేకు వీరంతా చెప్పినట్టు భోగట్టా.










Comments