42 గజాల చీర..12 మీటర్లు జాకెట్ కుమ్మరి కుండే అమ్మవారి రూపం
- BAGADI NARAYANARAO

- Apr 28
- 3 min read
24 రోజులు పాటు భద్రమ్మ పండగ
2 శతాబ్దాలుగా భక్తుల కొంగుబంగారం
11 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా ఉత్సవాలు
5న అనుపు పండుగతో ముగింపు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కుమ్మర్ల కులదైవంగా ఒకనాడు కొలువుదీరిన భద్రమహంకాళీ అమ్మవారు కాలక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల వారినీ తన చల్లని చూపులతో కరుణిస్తూ.. ఇలిసిపురం ప్రాంతీయుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేర్కొందిన ఈ అమ్మతల్లి ఉత్సవాలను 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న శాస్త్రోక్తంగా ప్రారంబమైన ఉత్సవాలను వచ్చే నెల ఐదో తేదీ వరకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికోసం మొత్తం ఇలిసిపురం ప్రాంతాన్ని విద్యుత్ తోరణాలతో అలంకరించడంతో అంతటా పండుగ శోభ సంతరించుకుంది.
అమ్మవారి అవతరణం ఇలా..

భద్రమహంకాళి అమ్మవారి అవతరణానికి సంబంధించి ఆసక్తికరమైన ఒక కథ ప్రచారంలో ఉంది. కుమ్మరివారి కులవృత్తి మట్టితో కుండలు, ఇతర పాత్రలు తయారు చేయడమే. ఆ క్రమంలో సుమారు రెండు శతాబ్దాల క్రితం కొందరు కుమ్మర్లు కుండలు తయారు చేస్తుండగా.. ఒక కుండ అమ్మవారి తల ఆకారంలో గోచరించింది. దాంతో ఆ కుండనే భద్రమహంకాళిగా భావించి భక్తిప్రపత్తులతో పూజలు చేయడం ప్రారంభించారు. అందుకే ఇప్పటికీ అమ్మవారి విగ్రహం కుండను పోలినట్లు గుండ్రంగా ఉండటాన్ని గమనించవచ్చు. అప్పటి నుంచి కుమ్మర్లు ఉన్న ప్రతి చోటా భద్రమహంకాళిని కులదైవంగా భావించి పూజించడం అనవాయితీగా మారింది. ఆలయంలోనూ కుమ్మర్లే పూజారులుగా వ్యవహరించి పూజలు చేస్తుంటారు. ఇలిసిపురంతోపాటు నగరంలోని బలగమెట్టు, ఫాజుల్‌బాగ్‌పేటల్లోనూ భద్రమహంకాళికి ఆలయాలు నిర్మించి నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఇలిసిపురం విషయానికొస్తే.. ఇక్కడ 18 కుమ్మరి కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి పూర్వీకులు 1863 ప్రాంతంలో ఒక పూరి గుడిసెలో మట్టికుండతో రూపొందించిన భద్రమహంకాళి రూపాన్ని ప్రతిష్టించి నిత్యం దూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో పూరిగుడిసే స్థానంలో పక్కా ఆలయం నిర్మించారు. కొన్ని దశాబ్దాలపాటు అదే ఆలయం కొనసాగింది.
పూరి గుడిసె నుంచి నేటి ఆలయం వరకు

కాలక్రమంలో అమ్మవారి లీలలకు విస్తృత ప్రచారం లభించడం, అమ్మవారిని స్థానిక అన్ని ప్రాంతాల ప్రజలు ఇలవేల్పుగా భావించి పూజలు చేయడం ప్రారంభించడంతో పాత ఆలయం స్థానంలో సరికొత్త హంగులతో కొత్త ఆలయం నిర్మాణానికి పూనుకున్నారు. పెద్దలంతా నిర్మాణ కమిటీగా ఏర్పడి విరాళాలు సేకరించి కాస్త విశాలంగా గ్రానైట్ పలకలు వంటి ఆధునాతన హంగులతో కొత్త ఆలయం నిర్మించి గత ఏడాది జూలైలో అమ్మవారిని పున:ప్రతిష్టించారు. కాగా గతంలో అమ్మవారికి ఐదేళ్లకోసారి ఉత్సవాలు జరిపేవారు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల దాన్ని ఏడేళ్లకు మార్చారు. ఆవిధంగా 2015లో చివరిసారి ఉత్సవాలు జరిగాయి. కాగా తర్వాత 2022లో ఉత్సవాలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఆలయ జీర్ణోద్ధరణ వంటి కారణాల వల్ల పదకొండేళ్ల తర్వాత ప్రస్తుతం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా ఉత్సవాల్లో మట్టికుండతో తయారుచేసిన అమ్మవారి మÖర్తిని వినియోగించడం వల్ల ప్రతిమకు నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించి ఇరవయ్యేళ్ల క్రితం ఉత్సవమÖర్తిని ప్రత్యేకంగా తయారుచేశారు.
24 రోజుల ఉత్సవాలు

ఈసారి భద్రమహంకాళీ ఉత్సవాలను 24 రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ప్రారంభమైన ఉత్సవాలు వచ్చే నెల ఐదో తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇలిసిపురం పరిధిలో uగ్గు సరోజిని ఆస్పత్రి నుంచి చిన్నబజార్‌లోని దూదివారి దేవాలయం వరకు, అంబేద్కర్ జంక్షన్ నుంచి మాధవ మోటార్స్ వరకు ఉన్న 14 వీధుల ప్రజలను ఉత్సవాల్లో భాగస్వాములను చేశారు. ఉత్సవాల్లో భాగంగా మొదట గ్రామ పొలిమేరళ్లో ఉన్న దేవతలను పూజిస్తారు. మొదటగా ఈ నెల 12న భద్రమ్మకు పెరుగన్నం, ఉల్లిపాయతో చల్ల పిడతల పండగ పేరుతో చల్లదనం చేశారు. ఈ నెల 16న మరిడమ్మను ఉజ్జిడి బండిలో గ్రామమంతా ఊరేగించారు. మరిడమ్మ ఊరేగింపు చేసేటప్ప్పుడు ఉజ్జిడి బండిలో పప్ప్పు, పరమాన్నం, బెల్లంతో తయారు చేసే అట్లు సమర్పించి పూజించారు. ఇక ఈ నెల 19న దుర్గమ్మ పండుగ ప్రారంభించి ఐదు రోజులు పాటు నిర్వహించారు. వేప కర్ర, చెక్కలతో సిరిమాను స్థానంలో రథం తయారు చేసి మరిడమ్మ, దుర్గమ్మలతో పాటు పోతురాజును కలిపి ఊరేగించారు. రోజుకోరకమైన ప్రసాదం తయారు చేసి ఐదు రోజుల పాటు నైవేద్యంగా నివేదించారు. అనంతరం ఈనెల 23న అనుపు పండగ ఘనంగా నిర్వహించారు. అనంతరం చివరిది, కీలక ఘట్టమైన భద్రమహంకాళీ ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పది అడుగుల ఎత్తున కర్రలు, గడ్డితో అమ్మవారి తాత్కాలిక విగ్రహాన్ని కుమ్మర్లే తయారు చేస్తారు. దానికి ఆరు చీరలు కలిపి ఒక చీర, 12 మీటర్ల వస్త్రంతో జాకెట్ కుట్టించి అమ్మవారిని అలంకరిస్తారు. ఇలా అలంకరించిన రూపానికి, ప్రస్తుతం పూజలు అందుకుంటున్న మట్టి కుండను పోలి ఉండే తలభాగాన్ని అమర్చి సంపూర్ణ రూపమిస్తారు. ఈ ఉత్సవ రూపం(దేవర) తెచ్చే ఊరేగింపు కార్యక్రమాన్ని సోమవారం అర్థరాత్రి 12 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నిర్వహించారు. ఉత్సవమÖర్తిని ప్రత్యేక గృహంలో పెడతారు. అక్కడ దమ్మలోళ్లు దండకాలు పోసిన తర్వాత భద్రమ్మ తల రూపాన్ని ప్రత్యేకంగా తయారు చేసి అలంకరించిన దేహానికి అమరుస్తారు. తర్వాతá దేవర తెచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దేవర తెచ్చే సమయంలో ఘటాలను తీసుకువస్తారు. మే ఐదో తేదీన అనుపు పండగతో భద్రమ్మ ఉత్సవాలు ముగిస్తాయి. ఆరోజు భారీ ఊరేగింపు జరుగుతుంది. భద్రమ్మ ఇల్లు దాటిన వెంటనే స్థానికులు మొక్కులు తీర్చుకుంటారు. చివరకు ఘటాలను, గంట దీపాలను భద్రమ్మ దేవాలయం సమీపంలో ఉన్న పాదాలమ్మ తల్లి వద్ద అనుపు చేసి భద్రమ్మ తల్లి తలను గుడికి తీసుకువస్తారు. దీంతో భద్రమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.






Comments