ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువ!
- DV RAMANA

- 7 hours ago
- 3 min read

దేశంలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) కూటమి వరుసగా మÖడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఒక సంకీర్ణ కూటమి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టడమే ఒక రికార్డు. అంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (యÖపీఏ) 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచి డాక్టర్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఘనతను నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీట్ చేసింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా మోదీ మరో రికార్డు కూడా సృష్టించారని బీజేపీతో పాటు ఎన్డీయే కూటమి వర్గాలు ఊరూరా ప్రచారం చేస్తున్నాయి. రెండేళ్ల విజయోత్సవాలతో పాటు ఈ అంశానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. మన తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కూడా అధిగమించి నరేంద్ర మోదీ అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నేతగా రికార్డు సృష్టించారన్నది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన, ప్రచార సారాంశం. ఈ నెల పదో తేదీ నాటికి ఏకధాటిగా 4,399 రోజుల అత్యధిక కాలంపాటు ప్రధాన మంత్రిగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగుతుండటం అనిత్యర సాధ్యమైన రికార్డుగా పేర్కొంటున్నారు. నెహ్రూ తరహాలోనే వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా దేశ అత్యున్నత పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉందని, 1952 నుంచి 1964 మే 27న మరణించే వరకు ఆయన 4,398 రోజుల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారని బీజేపీ శ్రేణులు లెక్కలు చెబుతున్నాయి. తమ నాయకుడు మోదీ ఏకంగా నెహ్రూనే మించిపోయారని ప్రచారం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు ఈ వాదనలతో విభేదిస్తున్నాయి. వారి లెక్కల ప్రకారం.. ప్రధాన మంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలాన్ని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. చరిత్ర ప్రకారం అది వాస్తవమే. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే నెహ్రూ మొత్తం 6131 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. అందువల్ల ప్రస్తుత ప్రధాని మోదీ పదవీ కాలం విషయంలో నెహ్రూను అధిగమించినట్లు కాదంటున్నారు. దీని ప్రకారమైతే మరో 1730 రోజులు ఆ పదవిలో ఉంటే తప్ప నెహ్రూ రికార్డును మోదీ బీట్ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. అయితే బీజేపీ వర్గాలు ఈ వాదనను తిరస్కరిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఏర్పడిన భారత ప్రభుత్వంలో నెహ్రూ ప్రధాని పదవి చేపట్టినప్పటికీ ఆయన ఎన్నిక ద్వారా ఆ పదవి అందుకోలేదని.. అందువల్ల తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 నుంచే ఆయన పదవీకాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బ్రిటిష్ రాజ్య చివరి రోజుల్లో 1946 సెప్టెంబర్ రెండో తేదీ నుంచి 1947 ఆగస్టు 14 వరకు మాత్రం నెహ్రూ బ్రిటిష్ నామినేటెడ్ భారత ప్రధానిగా ఉన్నారు. అదే సమయంలో 1946లో జరిగిన భారత ప్రావిన్షియల్(రాజ్యాంగ సభ) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పాటు ఆ పార్టీ తరఫున ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికైన నెహ్రూ మెజారిటీ సభ్యుల మద్దతుతోనే ప్రధాని పదవి చేపట్టినందున.. అప్పుడు కూడా ఆయన్ను ఎన్నికైన ప్రధానిగా పరిగణించాల్సి ఉంటుందని కాంగ్రెస్‌తో సహా పలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో 293 స్థానాలకు రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. వాటిలో 208 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది. మరో 93 స్వదేశీ సంస్థానాధీశులకు కేటాయించారు. ఈ బలం ఆధారంగానే స్వాతంత్య్రానంతరం నెహ్రూను ప్రధానిని చేశారు తప్ప నామినేషన్ తరహాల్లో నియమించలేదు. పైగా నెహ్రూ స్వాతంత్య్రోద్యమ అత్యున్నత నేతల్లో ఒకరుగా ఉన్నందున ఆయన ఎన్నిక మామూలు ఎన్నిక కంటే ఎక్కువే. దీని ప్రకారం చూస్తే.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. ప్రస్తుత టెర్మ్‌లో నాలుగేళ్ల తొమ్మిది నెలల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా మోదీ వశం అవుతుంది. ప్రస్తుతానికి జవహర్‌లాల్ నెహ్రూ అత్యధికంగా 6131 రోజులపాటు ప్రధాన పదవి చేసిన నేతగా మొదటి స్థానంలో ఉంటే.. ఆయన తర్వాత 4399 రోజులతో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ రెండో స్థానంలో ఉంటారు. ఇందిరాగాంధీ 4077 రోజులతో 3 స్థానంలో, 3652 రోజులతో నాలుగో స్థానంలో మన్మోహన్ సింగ్, 3 విడతల్లో 2272 రోజులతో అటల్ బిహారీ వాజ్‌పేయి, 1827 రోజులతో పి.వి.నరసింహారావు, 1826 రోజులతో రాజీవ్ గాంధీ, 857 రోజులతో మొరార్జీ దేశాయ్, 576 రోజులతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రుల జాబితాలో నిలిచారు. వీరితో పాటు గుల్జారీలాల్ నందా రెండు దఫాల్లో 26 రోజులు, చౌదరీ చరణ్‌సింగ్ 170 రోజులు, విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ 343 రోజులు, చంద్రశేఖర్ 223 రోజులు, హెచ్.డి.దేవెగౌడ 324 రోజులు, ఐ.కె.గుజ్రాల్ 332 రోజలు అత్యున్నత ప్రధాని పీఠంపై కూర్చున్నారు. ఇప్పటివరకు దేశానికి 14 మంది ప్రధానమంత్రులుగా వ్యవహరించగా రెండు పర్యాయాలు పూర్తి పదవీకాలం ఆ పదవిలో ఉండటమే కాకుండా మÖడో పర్యాయం మళ్లీ అధిష్టించిన రికార్డు మాత్రం నరేంద్ర మోదీదే. మోదీ భారత చరిత్రను తిరగరాశారని విప్లవాత్మక మార్పులు చేస్తున్నారని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతున్నందున నెహ్రూ కంటే ఎక్కువన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. అయితే బ్రిటిష్‌పాలనలో అణిగిపోయిన దేశానికి జవసత్వాలు నింపిన నెహ్రూను తక్కువ చేయడం సరికాదేమో!






Comments