top of page

కాకినాడ బ్యాచ్ పేకాట దందా!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 days ago
  • 2 min read

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ హల్చల్ చేస్తున్న పేకాట శిబిరాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ సర్కిల్ పరిధిలో పేకాట శిబిరాలు మళ్లీ జోరందుకున్నాయి. స్థానిక పోలీసుల అండదండలతో కాకినాడకు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దందాను బహిరంగంగా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బత్తిలి, దోనుబాయి ప్రాంతాల్లో రోజుకు లక్షల్లో చేతులు మారుతున్న ఈ జూద క్రీడ తీవ్ర కలకలం రేపుతోంది.

నెట్‌వర్క్ నడుస్తోందిలా..

బత్తిలి కేంద్రంగా:

కాకినాడకు చెందిన ‘బుజ్జి’ అనే వ్యక్తి బత్తిలిలో ‘హడ్డుబంగి’ అనే ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. స్థానిక నిర్వాహకుడు ప్రతాప్ సహాయంతో ఇక్కడ పేకాట శిబిరాన్ని నడుపుతున్నాడు.

దోనుబాయి కేంద్రంగా:

సీతంపేట మండలం దోనుబాయిలో స్థానికుడు రాజేష్‌తో కలిసి కాకినాడకే చెందిన శ్రీను, రాజులు మరో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

ఒకే గొడుగు కింద నుంచి రెండు గ్రూపులుగా:

మొదట్లో శ్రీను, రాజు, బుజ్జిలు కలిసి ఒకే శిబిరాన్ని నడిపేవారు. అయితే, వీరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు గ్రూపులుగా విడిపోయి బత్తిలి, దొనుబాయిలలో వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

హోంగార్డ్ ‘మల్లి’ కనుసన్నల్లోనే.. ఆ పైఅధికారికి ‘గట్టి’ మామూళ్లు!

ఈ రెండు శిబిరాల నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా స్థానిక సర్కిల్ పోలీసు అధికారికి భారీగానే మామూళ్లు ముట్టుజెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సమన్వయకర్తగా హోంగార్డ్:

బత్తిలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ‘మల్లి’ అనే హోంగార్డుకు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.

కమీషన్ల పంపిణీ:

బత్తిలిలో ప్రతాప్, దోనుబాయిలో రాజేష్‌లకు కాకినాడ నిర్వాహకులు రోజువారీ కమీషన్లు ఇస్తుండగా.. వీరిద్దరూ ఆ మొత్తం నుంచి హోంగార్డ్ మల్లికి రోజూ ‘కట్ట’ అందిస్తున్నట్లు సమాచారం.

పోలీసుల ‘టైమింగ్స్’:

పేకాట శిబిరాలను మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఒక పోలీసు అధికారి సమయం నిర్దేశించినట్లు జోరుగా చర్చ సాగుతోంది.

రౌడీషీటర్ల పహారా.. కార్లలో జూదరుల తరలింపు

విందు వినోదాలు:

పేకాట రాయుళ్లకు ఏ లోటూ రాకుండా స్థానిక హోటళ్ల నుంచి ప్రత్యేకంగా ఫుడ్ పార్సిళ్లు తెప్పించి విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

పికప్ సర్వీస్: జిల్లా కేంద్రం నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకే సుమారు 15 కార్లలో జూదరులను ఈ శిబిరాలకు తరలిస్తున్నారు.

రౌడీషీటర్ల హస్తం:

జూదరులను సురక్షితంగా తీసుకురావడానికి శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక రౌడీషీటర్‌కు ఒక్కో వాహనానికి రూ.2వేలు కమీషన్ చెల్లిస్తున్నారు. ఇతనికి తోడుగా మరొక ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రవాణా నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు.

రూ.3 కోట్ల ఫ్రాడ్ కేస్ నిందితుడే ముఠా నాయకుడు!

ఈ మొత్తం పేకాట దందాకు మూలకారకుడైన దోనుబాయి నిర్వాహకుడు రాజేష్ గతంలో రూ.3 కోట్ల క్రెడిట్ కార్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు. ఆరేళ్ల క్రితం ఈ కేసులో ఇరుక్కుని కొంతకాలం శ్రీకాకుళంలో తలదాచుకున్న రాజేష్, ఇప్పుడు పేకాట నిర్వాహకుడిగా అవతారమెత్తాడు. కొందరు ప్రజాప్రతినిధులతో దిగిన ఫోటోలను చూపిస్తూ, వారి పేర్లు చెప్పుకుని ఈ అక్రమ దందాను నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధికారులు స్పందిస్తారా?

పోలీసుల కనుసన్నల్లో, రౌడీషీటర్ల సహకారంతో కాకినాడ ముఠా ఉమ్మడి శ్రీకాకుళంలో లక్షలు కొల్లగొడుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులే మామూళ్లకు కక్కుర్తి పడి జూద శిబిరాలకు బాటలు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page