top of page

జిల్లా క్రికెట్‌లో సెలక్షన్ సెగలు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read
  • ఏసీఏ వర్సెస్ జెడ్‌సీఎస్

  • పెద్దల పంతం.. క్రికెటర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం

  • జెడ్‌సీఎస్ రద్దు యోచనలో ఏసీఏ

  • ముదురుతున్న వివాదం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం జిల్లా క్రికెట్‌లో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు జిల్లా క్రికెట్ సంఘం పేరిట అండర్-19 మల్టీడే జట్టు (టెస్ట్ మ్యాచ్) ఎంపికల ప్రకటన విడుదల కాగా, మరోవైపు ఆ ఎంపికలకు తమతో ఎలాంటి సంబంధం లేదని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వెంటనే స్పష్టీకరణ ఇవ్వడం జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో అసలు జిల్లా క్రికెట్‌పై అధికారిక నియంత్రణ ఎవరి చేతిలో ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ నెల 28న శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ క్రికెట్ నెట్స్‌లో అండర్-19 జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరుతో ప్రకటన వెలువడింది. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ పేరుతో మరో ప్రకటన విడుదలైంది. అందులో శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ కార్యకలాపాల నిర్వహణ కోసం ఇప్పటికే తాత్కాలిక సమన్వయ కమిటీని నియమించామని, ఆ కమిటీ కాకుండా నిర్వహించే ఎలాంటి ఎంపికలను గుర్తించబోమని స్పష్టం చేశారు.

ఏసీఏ ఎందుకు కఠిన వైఖరి అవలంభిస్తోంది

ఈ వివాదం కేవలం ఒక ఎంపిక ప్రకటనతో మొదలైనది కాదు. జిల్లా క్రికెట్ సంఘం కొత్త కమిటీ ఏర్పాటుతోనే విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పాత కమిటీ పదవీకాలం పూర్తికాకముందే కొత్త కమిటీ ప్రకటించడం, బాధ్యతలు చేపట్టడం, గతంలో జరిగిన ఎంపికలు, నిర్ణయాలపై క్రీడాకారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏసీఏ దృష్టికి వెళ్లాయి.

ఈ నేపథ్యంలో ఏసీఏ త్రీమెన్ కమిషన్‌ను నియమించి విచారణకు ఆదేశించింది. అయితే విచారణకు హాజరుకావాల్సిన జిల్లా సంఘం కమిటీ సభ్యులు కమిషన్ అధికారాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణకు సహకరించకుండా కోర్టు పోరాటాన్ని ఎంచుకోవడం వెనుక అసలు కారణాలేమిటన్న చర్చ క్రీడా వర్గాల్లో సాగుతోంది.

రికార్డులు ఎందుకు సమర్పించలేదు

విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లా క్రికెట్ సంఘానికి గుర్తింపు వచ్చినప్పటి నుంచి విడుదలైన నిధులు, వాటి వినియోగం, క్రీడాకారుల ఎంపికలు, నిర్వహించిన టోర్నమెంట్లు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని త్రీమెన్ కమిషన్ ఆదేశించింది. అయితే ఈ రికార్డులు ఇప్పటివరకు కమిషన్‌కు అందలేదని తెలుస్తోంది.

అసలు ఆర్థిక లావాదేవీల్లో ఏముంది? ఎంపికల ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి? కమిషన్ కోరిన సమాచారం సమర్పించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గుర్తించకపోవడం వెనుక కారణం ఇదేనా

హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం, కమిషన్ విచారణకు జిల్లా సంఘం సహకరించకపోవడం వంటి కారణాలతో జిల్లా సంఘం గుర్తింపును ఏసీఏ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఏసీఏ నియమించిన తాత్కాలిక సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యకలాపాలకే అధికారిక గుర్తింపు ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లా సంఘం మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్ ఏసీఏ అధ్యక్షుడు, కార్యదర్శిపై బహిరంగ విమర్శలు చేయడంతో పాటు న్యాయపోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

నష్టపోతున్నది ఎవరు?

ఈ అధికార పోరులో తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం యువ క్రికెటర్లేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జిల్లా సంఘం ఎంపికలకు రావాలని పిలుపునిస్తుంటే, మరోవైపు వాటిని ఏసీఏ గుర్తించబోదని ప్రకటిస్తోంది. దీంతో ఆటగాళ్లు ఏ ఎంపికలకు హాజరవ్వాలి? ఏ జట్టుకు అధికారిక గుర్తింపు ఉంటుంది? అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

అండర్-16 ఎంపికలపై కూడా ఆరోపణలు

ఇదిలా ఉంటే ఈ నెల 4, 5 తేదీల్లో ఏసీఏ తాత్కాలిక సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అండర్-16 జట్టు ఎంపికలపై కూడా పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జిల్లా జట్టులో స్థానికేతరులకు అవకాశం కల్పించారని ఆరోపిస్తూ ఏసీఏకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎల్ టోర్నమెంట్ నిర్వహణలో ఏసీఏ బిజీగా ఉండటంతో ఫిర్యాదుపై చర్యలు ఆలస్యమవుతున్నాయని భావిస్తున్నప్పటికీ, టోర్నమెంట్ ముగిసిన తర్వాత విచారణ జరిగి నిజాలు బయటపడతాయని పేరెంట్స్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

జిల్లా క్రికెట్ సంఘం గుర్తింపు పూర్తిగా రద్దవుతుందా? త్రీమెన్ కమిషన్ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి రానున్నాయి? ఎంపికల వివాదం వెనుక కేవలం పరిపాలనా విభేదాలేనా లేక మరింత లోతైన వ్యవహారాలున్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అప్పటి వరకు శ్రీకాకుళం క్రికెట్‌లో గందరగోళం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page