top of page

నన్నెవ్వరూ ఆపలేరు!!

  • Guest Writer
  • 6 days ago
  • 2 min read

మెగా ఫ్యామిలీ నుంచి యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, నేడు సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు నిహారిక కొణిదెల. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే, ఆమె తీసుకునే ప్రతి నిర్ణయంపై ఇండస్ట్రీలో ఏదో ఒక విమర్శ వినిపిస్తూనే ఉంది. తాజాగా తను నిర్మించిన ‘రాకాస’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ విమర్శలపై నిహారిక చాలా ఘాటుగా స్పందించారు. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ఏం చేసినా విమర్శలే.. నా దారి నాదే!: నిహారిక కొణిదెల నిర్మాతగా మారినప్పటి నుండి ఆమె అడుగులను ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ‘రాకాస’ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ తన ఆవేదనను, ధైర్యాన్ని ఒకేసారి బయటపెట్టారు. “నేను ‘కమిటీ కుర్రాళ్ళు’ చేసినప్పుడు 15 మంది కొత్తవాళ్లను ఎందుకు పరిచయం చేస్తున్నావు? తలనొప్పులు ఎందుకు? అని అడిగారు. తీరా అది హిట్ అయ్యాక, ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘రాకాస’ తీస్తుంటే.. మళ్ళీ పాత తరహా సినిమాలే చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నేనేం చేసినా నన్ను అనేవాళ్లు ఉంటారు, కానీ నేను నమ్మిన పని చేస్తూనే ఉంటా” అని గట్టిగా చెప్పారు.

అన్నయ్యతో సినిమాపై కూడా కామెంట్స్: నిహారిక తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అన్నయ్య వరుణ్ తేజ్‌తో ‘బరి’ అనే పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. “చిన్నవాళ్లతో సినిమాలు చేయొచ్చు కదా, అప్పుడే అంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు? ఫ్యామిలీ వాళ్లతో ఎందుకు చేస్తున్నావు?” అని కొందరు ప్రశ్నిస్తున్నారట. ఇక ఇలా ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న అడ్డంకులను పక్కన పెట్టి, నిర్మాతగా తనకున్న విజన్‌తో ముందుకు సాగుతానని, ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.

ఏప్రిల్ 3న వస్తున్న ‘రాకాస’: ఇక సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఇది ఒక హారర్ కామెడీ విజువల్ వండర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో నిహారికకు ఉన్న అభిరుచిని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.ఇక విమర్శలను పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి పెట్టే నిహారిక స్టైల్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

నిహారిక కొణిదెల కేవలం మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తోనే కాకుండా, తన సొంత కష్టంతో నిర్మాతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. యూట్యూబ్, ఓటీటీ నుంచి మొదలై నేడు భారీ బడ్జెట్ సినిమాల వరకు ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. విమర్శకులు ఎన్ని మాటలన్నా, తన పని తాను చేసుకుంటూ పోతానన్న ఆమె క్లారిటీ చూస్తుంటే, భవిష్యత్తులో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...


యస్... రాజమౌళికి ‘పోటీ’ ఉంది!

ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు ఎవరు? అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఆన్సన్ చెప్పొచ్చు. ఎస్.ఎస్.రాజమౌళి అని. ఇప్పుడు దురంధర్ 1, 2లు తీసి `బాహుబలి` రికార్డుల్ని కూడా బీట్ చేసిన ఆదిత్య ధార్ సైతం ఈగోని పక్కనపెట్టి, నెంబర్ వన్ దర్శకుడు ఎవరంటే రాజమౌళి పేరే చెబుతాడు. చెప్పాలి కూడా.

అవును.. ‘దురంధర’ రాజమౌళి సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టింది. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఇండియాలో అత్యధిక కలక్షన్లు వసూలు చేసిన సినిమాని ఆదిత్యా ధార్ అనే దర్శకుడు తీశాడు. రెండోస్థానంలో రాజమౌళి ఉన్నాడు. అయినా.. ఇప్పటికీ రాజమౌళినే నెంబర్ వన్. ఎందుకంటే ఒక్క సినిమాతో మారిపోయే స్థానం కాదు రాజమౌళిది.

కానీ ఒక్కటి మాత్రం నిజం. రాజమౌళికి గట్టి పోటీ ఉంది. వసూళ్ల పరంగా రాజమౌళి ఎంత గొప్ప సినిమా అయినా తీస్తాడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దాన్ని బీట్ చేసే సినిమా వస్తూనే ఉంటుంది. రావాలి కూడా. బ్రాడ్ మెన్ కంటే గొప్పోడు లేడనుకొన్నప్పుడు సచిన్ వచ్చాడు. సచిన్ రికార్డులు పదిలం అనుకొంటున్నప్పుడు కోహ్లీ వచ్చి వాటిని బ్రేక్ చేశాడు. రేపు.. మరో క్రికెటర్. సినిమా కూడా అంతే.

రాజమౌళిది అపజయం ఎరుగని జైత్ర యాత్ర. ఆ రికార్డు ఎప్పటికీ పదిలమే. ఎప్పుడు ఎవరితో సినిమా తీసినా.. ఇండస్ట్రీ రికార్డుల్ని కొత్తగా రాస్తాడు. ఇప్పటి దురంధర్ రికార్డులు కూడా శాశ్వతం కాదు. రాజమౌళి తీసే ‘వారణాసి’కి ఈ రికార్డుల్ని తిరగరాసే సత్తా ఉంది. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, త్రివిక్రమ్, అట్లీ, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఎప్పుడైనా రెండు వేల కోట్ల సినిమాలు తీయగలరు.. తీసి చూపించగలరు. వీళ్లందరూ రాజమౌళికి పోటీనే. వీళ్లే అని కాదు. ఆడిటోరియాన్ని షేక్ చేసి, ఇండియా మొత్తం ఊపేసేలా ఓ కథ చెప్పే ఏ దర్శకుడైనా ఓ గొప్ప సినిమా తీయగలడు.

వసూళ్ల విషయం పక్కన పెడితే సినిమా స్థాయిని, సాంకేతికతని, సినిమా చూసే ప్రేక్షకుడి అనుభూతి తాలుకా తీవ్రతని పెంచే దర్శకుడు వీళ్లలో నిస్సందేహంగా రాజమౌళినే. సినిమాని ప్రమోట్ చేసుకొనే విషయంలో కూడా ఆయనకు తిరుగులేదు. సినిమా సినిమాకీ తనను తాను పెంచుకొంటూపోతున్నాడు. ఆ పరుగు ఎక్కడ ఆగుతుందో కూడా తెలీదు. ఈ విషయంలో ఆయన్ని కొట్టేవాడే లేడు.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page