పెద్ది.. ‘ఆట’ను మించిన ‘ఆటగాడు’
- Guest Writer
- 1 day ago
- 4 min read

సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం.. పెద్ది. తన అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఎంతమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
పెద్ది (రామ్ చరణ్) విజయనగరం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలోని ఒక ఊరికి చెందిన కుర్రాడు. ఈ ఊరికే పేరే కాదు.. ఏ రకమైన గుర్తింపూ ఉండదు. ఊరిలో అందరూ కూలీలే. కానీ వేరే ఊళ్లతో పోలిస్తే ఆ ఊరి వాళ్లకు మాత్రం సగం కూలే ఇస్తారు. వాళ్లంటే అందరికీ అంత చిన్నచూపు. ఏ రవాణా సౌకర్యం లేని ఆ ఊరిని బాగు చేయడం కోసం అప్పల సూరి (జగపతిబాబు) దశాబ్దాల తరబడి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్లో గొప్ప నైపుణ్యం సంపాదించిన పెద్ది వల్ల ఆ ఊరికి కొంచెం పేరొస్తుంది. కానీ డబ్బుల కోసమే క్రికెట్ ఆడే పెద్ది.. తనకు జరిగిన ఒక అవమానం వల్ల ఆ ఆటనే వదిలేసి కుస్తీ వైపు అడుగులేస్తాడు. అతను ఆట మారడానికి దారి తీసిన పరిస్థితులేంటి.. అప్పలసూరి పోరాటం ఎంత వరకు వచ్చింది.. కుస్తీలోకి వచ్చిన పెద్ది ఏం సాధించాడు.. తన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది.. చివరికి పెద్ది తన ఊరి రాతను మార్చగలిగాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
“ఆటే నా గుర్తింపు సారు”.. అంటూ ‘పెద్ది’ ట్రైలర్లో ఒక డైలాగ్ విని ఉంటారు. మరి ఆట ద్వారా తనకొచ్చి గుర్తింపును.. కనీసం ఒక పేరుకు కూడా నోచుకోకుండా మరుగున పడిపోయిన తన ఊరి కోసం ఒక మల్టీ టాలెంటెడ్ ప్లేయర్ ఎలా ఉపయోగించాడన్నదే ‘పెద్ది’ సినిమా కథ. ఆటగాళ్ల కంటే ఆట గొప్పది అని ఒక మాట వింటుంటాం. కానీ ‘పెద్ది’ సినిమా చూస్తున్నపుడు మాత్రం దీనికి విరుద్ధమైన అభిప్రాయం కలుగుతుంది. ఆటగాడే ఆటను మించి.. కాదు కాదు, ‘ఆటలను’ మించి కనిపిస్తాడు. ‘పెద్ది’కి ఇదే బలం, ఒక రకంగా బలహీనత కూడా. ‘పెద్ది’లో చూపించిన మూడు ఆటల్లో కుస్తీ ఇచ్చినంత కిక్కు మిగతావి ఇవ్వలేకపోయాయి. కానీ మార్చి మార్చి మూడు ఆటలు ఆడే ‘క్రాస్ ఓవర’ అథ్లెట్ మాత్రం తెగ నచ్చేస్తాడు. రామ్ చరణ్ కెరీర్లో పెర్ఫామెన్స్ పరంగా ‘ది బెస్ట’ అనదగ్గ ‘రంగస్థలం’తో సరితూగే స్థాయిలో అతను పతాక స్థాయిలో విజృంభించాడు. తన పెర్ఫామెన్స్ ఉన్నంత అత్యున్నత స్థాయిలో సినిమా లేదు కానీ.. మూడు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టడంలో మాత్రం ‘పెద్ది’ విజయవంతమైంది.
‘పెద్ది’ కథను రాతల్లో చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ దృశ్య రూపంలో కొంచెం స్థాయి తగ్గిందనిపిస్తుంది. ఒక సూపర్ స్టార్ హీరో సినిమా నుంచి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ అంశాలను కూడా ఈ కథలో జొప్పించి బ్యాలెన్స్ చేయడానికి బుచ్చిబాబు చేసిన ప్రయత్నం వల్ల ‘పెద్ది’ కొంచెం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా జాన్వి కపూర్ చేసిన అల్ట్రా గ్లామరస్ అచ్చియమ్మ పాత్ర.. దయనీయమైన పరిస్థితుల్లో సాగే హీరో ప్రయాణంలో ఏమాత్రం కుదరలేదు. అసలు మనం చూస్తున్న కథేంటి.. ఇందులో ఈ పాత్రేంటి అనిపించేలా పూర్తిగా నాన్ సింక్ లో నడుస్తుంది ఆ పాత్ర.. తన అప్పీయరెన్స్. ఒక పెద్ద హీరో పక్కన హీరోయిన్ ఉండాలి.. ఆ పాత్రను గ్లామరస్ గానే ప్రెజెంట్ చేయాలనే రొటీన్ ఆలోచనల్లోంచి పుట్టిన పాత్రలా అనిపిస్తుందిది. సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ని వివస్త్రను చేసి అవమానించడానికి ప్రయత్నిస్తుంది విలన్ గ్యాంగ్. కానీ అప్పటిదాకా కథానాయిక చేసిన అంగాంగ ప్రదర్శన వల్ల.. విలన్ గ్యాంగ్ ఇంత చేసినా ఆ పాత్ర మీద సానుభూతి కలగని పరిస్థితి. కుర్రకారును మెప్పించే ప్రయత్నంలో హీరోయిన్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం వల్ల వచ్చిన ఇబ్బందిది.
ఐతే కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివన్నీ సహజం అనుకుని ఇలాంటి సైడ్ ట్రాక్స్ సంగతి పక్కన పెట్టేస్తే.. హీరోకు ఒక లక్ష్యం ఏర్పరిచి.. దాని కోసం అతను పాటుపడే క్రమాన్ని ‘పెద్ది’లో చాలా బాగా చూపించాడు బుచ్చిబాబు. హీరోకు ఒక లక్ష్యం ఏర్పడడానికి ఉత్ప్రేరకంలా మారే అప్పలసూరి పాత్ర.. అందులో జగపతిబాబు పెర్ఫామెన్స్.. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ ‘పెద్ది’లో హైలైట్. ఇంటర్వెల్లో బలంగా ఎమోషన్ పండడానికి జగపతిబాబు పాత్ర ఎంతగానో ఉపయోగపడింది. రామ్ చరణ్ మాస్ పెర్ఫామెన్సులో పీక్స్ ను ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. ప్రథమార్ధంలో క్రికెట్ సన్నివేశాలు హీరో పాత్రకు మంచి ఎలివేషన్ ఇవ్వడంతో పాటు వినోదాన్ని పంచుతాయి. తర్వాత జగపతిబాబు పాత్ర చుట్టూ అల్లిన ఎమోషనల్ ఎపిసోడ్ విరామ సమయానికి ‘పెద్ది’ రసకందాయంలో పడేలా చేస్తుంది. ఒక పీక్ ఎమోషనల్ సీన్ తర్వాత ఆ ఇంటెన్సిటీని ద్వితీయార్ధంలో కొనసాగించడంలో బుచ్చిబాబు కొంచెం తడబడ్డాడు కానీ.. కుస్తీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చాలా ఎఫెక్టివ్ గా తీయడం ద్వారా బాగానే కిక్కిచ్చాడు. ఆట పరంగా సినిమాలో అసలైన హై ఇచ్చేది కుస్తీ పోటీలే. ఆటను.. అందులో మలుపులను లోతుగా.. రసవత్తరంగా చూపించడం ద్వారా బుచ్చిబాబు దర్శకుడిగా తన పనితనాన్ని చాటాడు.
ప్రథమార్దంలో జాన్వి పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లాగే సెకండాఫ్ లో అసందర్భంగా వచ్చిపడే ఐటెం సాంగ్ సైతం ‘పెద్ది’ని సైడ్ ట్రాక్ పట్టించేదే. కానీ తర్వాత చివరి 40 నిమిషాలు ఎంతో ఎమోషనల్ గా సాగుతూ ‘పెద్ది’ గ్రాఫ్ ను పెంచుతాయి. తన తొలి సినిమా తరహాలోనే బుచ్చిబాబు ఇందులోనూ హీరో పాత్రకు సంబంధించి ఒక ‘షాక’ ఇస్తాడు. అది కొంచెం ఫోర్స్డ్ గా అనిపించినా సరే.. పతాక సన్నివేశాల్లో ఎమోషన్ పండించడంలో.. ప్రేక్షకులను కదిలించడంలో బుచ్చిబాబు దర్శకుడు అయ్యాడు. ఒక ఊరి రాతను మార్చే కథలో ఆ ఊరి జాగ్రఫీని.. అక్కడి మనుషుల జీవన విధానాన్ని సరిగా చూపించకపోవడం ‘పెద్ది’లో మైనస్. ఆ పని చేస్తే భావోద్వేగాలు ఇంకా బాగా పండేవి. దివ్యేందు కొన్ని ముఖ్య పాత్రలను సరిగా ఉపయోగించుకోకపోవడమూ ప్రతికూలతే. కానీ సినిమాలో ఎన్ని లోపాలున్నప్పటికీ పెద్ది పాత్ర.. అందులో రామ్ చరణ్ పెర్ఫామెన్స్ సినిమాను నిలబెట్టాయి. కానీ మూడు గంటలకు పైగా నిడివిలో బోరింగ్ మూమెంట్స్ లేకపోవడం.. కథ ఎక్కడా స్ట్రక్ అయిపోకుండా ముందే సాగడం వల్ల ‘పెద్ది’ చూసినందుకు రిగ్రెట్స్ ఏమీ ఉండవు. కాకపోతే టీం ప్రొజెక్ట్ చేసినట్లుగా ఇది ‘గొప్ప’ సినిమాగా నిలుస్తుందా అన్నది మాత్రం సందేహమే.
నటీనటులు - పెర్ఫార్మెన్స్ :
పెద్ది అనే పాత్రను ఎంతో ఎత్తులో నిలబెట్టిన ఘనతను దర్శకుడి కంటే ముందు రామ్ చరణ్‌కు ఇవ్వాలి. ఒక నటుడు ఒక పాత్రను ఓన్ చేసుకుంటే.. దాని కోసం ప్రాణం పెడితే.. సినిమాలో లోటుపాట్లను కూడా మరిచిపోయేంతగా ఆ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుందనడానికి ‘పెద్ది’ ఉదాహరణ. శారీరకంగా తను పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడే స్టార్ హీరోలు అరుదుగా ఉంటారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఒకెత్తయితే.. పెర్ఫామెన్స్ మరో ఎత్తు. పెద్ది పాత్రలోని అమాయకత్వం కొన్ని చోట్ల ‘రంగస్థలం’లో చిట్టిబాబును గుర్తు చేస్తుంది కానీ.. పెద్ది స్పెషాలిటీ పెద్దిదే. ఈ పాత్రలో రామ్ చరణ్‌ను ప్రేక్షకులు చాలా ఏళ్ల పాటు గుర్తుంచుకుంటారనడంలో సందేహం లేదు. జాన్వి కపూర్ కేవలం అందాల ఆరబోతకు.. రెండు పాటలకు మాత్రమే ఉపయోగపడింది. తన పెర్ఫామెన్స్ గురించి చెప్పడానికేమీ లేదు. గౌర్నాయుడు పాత్రలో శివరాజ్ కుమార్ బాగానే నటించాడు కానీ.. ఆయన్నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. అప్పలసూరి పాత్రలో జగపతిబాబు గుర్తుపట్టలేని విధంగా కనిపించడమే కాక.. నటన పరంగా తనలో మరో కోణాన్ని ఆవిష్కరించాడు. నిడివి తక్కువ అయినా.. ఆ పాత్ర వేసిన ఇంపాక్ట్ బలమైంది. ‘మీర్జాపూర’ ఫేమ్ దివ్యేందు పాత్ర మొదట్లో ఎన్నో అంచనాలు రేకెత్తించి.. తర్వాత సైడ్ అయిపోయింది. తన నటన ఓకే. ఉపేంద్ర లిమాయే బాగా చేశాడు. రావు రమేష్.. సత్య సహా చాలామంది ఆర్టిస్టులకు వాళ్ల స్థాయికి తగ్గ పాత్రలు.. సన్నివేశాలు పడలేదు.
సాంకేతిక వర్గం - పనితీరు :
‘పెద్ది’ కోసం బుచ్చిబాబు ఏరి కోరి ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నందుకు ఆయన మంచి ఔట్ పుటే ఇచ్చాడు. ‘చికిరి’ సహా పాటలన్నీ బాగున్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. రెహమాన్ బీజీఎం అదిరిపోయింది. సినిమాలో తొలి ఫైట్ సందర్భంగా.. అలాగే ప్రి ఇంటర్వెల్ ఎపిసోడ్లో ఆరఆర్ ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్తేజం తెస్తుంది. మొత్తంగా సినిమాలో రెహమాన్ స్కోర్ చాలా బాగా సాగింది. రత్నవేలు విజువల్స్ సాంకేతికంగా సినిమాలో మరో హైలైట్. ఆర్ట్ వర్క్ బాగుంది. సీజీ కొంచెం నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. కొత్త నిర్మాత సతీష్ కిలారు రాజీ ఎక్కడా రాజీ పడకుండా టాప్ క్లాస్ సినిమా తీశాడు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ బుచ్చిబాబు.. తొలిసారి ఒక పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేస్తూ ఆ స్టార్ స్థాయికి తగ్గ కథనే ఎంచుకున్నాడు. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లను డీల్ చేయడంలో తన పనితనాన్ని చాటాడు కానీ.. తన తొలి చిత్రం తరహాలో నరేషన్లో ‘క్లాస’ చూపించలేకపోయాడు. కానీ ఒక చిన్న సినిమా అనుభవంతో ఇంత పెద్ద ప్రాజెక్టును డీల్ చేసిన విధానానికి.. రామ్ చరణ్ నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకున్న తీరుకు బుచ్చిబాబు అభినందనీయుడే.
-తుపాకి.కామ్ సౌజన్యంతో..






Comments