top of page

‘ప్రేమ’లో ‘ఖైదీ’ చేస్తుంది!

  • Guest Writer
  • Mar 10
  • 2 min read

ముసలి ప్రేమికుల సినిమాలను చూసీ చూసీ విసిగి వేసారిన తెలుగు ప్రేక్షకులకు ఈ లేత లేత వయసు పిల్లల ప్రేమ సినిమా, ప్రేమఖైదీ, యమా నచ్చేసింది. పైపెచ్చు రామానాయుడు గారి సినిమా. ఆయన సినిమాల కధ, స్కీన్‌ప్లే పకడ్బందీగా ఉంటాయి.

1990లో సూపర్ హిట్టయిన ఈ ప్రేమఖైదీ సినిమాకు కథ, డైలాగులను పరుచూరి బ్రదర్స్ అందించారు. శారద జైలర్ పాత్రను చాలా పవర్ఫుల్‌గా మలిచారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు రవీంద్రనాథ్ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేశారు.

చెవిలో పువ్వు సినిమా ద్వారా వైఫల్యాన్ని చవిచూసిన ఈవీవీ సత్యనారాయణకు ఈ సినిమా ఓ గొప్ప అవకాశాన్ని కలగచేసింది. ఆయనా చాలా బాగా వినియోగించుకున్నారు. ముఖ్యంగా లేత ప్రేమికులుగా హరీషుని, మాలాశ్రీని అందంగా చూపడమే కాకుండా లవ్ సీన్లను, లవ్ పాటల్ని కుర్ర ఆడియెన్సుకు నచ్చేలా తీసారు.

ఆల్మోస్ట్ అన్ని ప్రేమకథల్లాగానే ఇందులో కూడా బాగా డబ్బు చేసిన హీరోయిన్ రెక్కాడితే కాని డొక్కాడని ఓ అమాయక ప్రాణి చేత ఐ లవ్ యూ చెప్పిస్తానని ఫ్రెండ్సుతో పందెం కడుతుంది. ఆ పందెంలో ఓడిపోయిన హీరోయిన్ హీరోని బకరా చేస్తుంది. తర్వాత ప్రేమలో పడిపోతుంది. అది తట్టుకోలేని తండ్రి విలన్ గోకిన రామారావు హీరో మీద రౌడీలను పంపటం, ఆ ఘర్షణలో అతని తండ్రి చనిపోవటం, ఆ హత్యానేరం మీద శిక్ష పడటం, వయసు చిన్నది కాబట్టి బోర్‌స్టన్ స్కూలుకు పంపబడతాడు. ఆ స్కూల్ అధికారి శారద అతని ప్రేమకథకు జాలిపడి విలనుతో వియ్యానికి వెళ్లి కయ్యం తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో స్కూల్లో ఉన్న హీరో మిత్రులు హీరోయిన్ని స్కూలుకు చేరుస్తారు. హీరోయిన్ని కాపాడుతూ ఉంటారు.

క్లైమాక్సులో రిజిస్ట్రార్ ఆఫీసులో అందరూ కలిసి పెళ్ళి జరిపేందుకు సాయం చేస్తారు. కానీ, విలన్ మనుషులు శారద మీద కాల్పులు జరపటంతో ఆమె ప్రాణాలను వదులుతూ పెళ్ళి రిజిస్ట్రేషనుకు రక్తంతో వేలి ముద్ర వేసి పెళ్లి పూర్తి చేస్తుంది.

అలా సినిమాకు గుండెకాయ వంటి పాత్రను శారద పోషించింది. అద్భుతంగా నటించింది. విలనుగా గోకిన రామారావు కూడా చాలా క్రూరంగా నటించాడు. మరో ముఖ్య పాత్ర హీరో తండ్రి పీఎల్ నారాయణ. గొప్పగా నటించాడు. మరో ప్రధాన పాత్ర హీరోయిన్ తల్లి పాత్రను కన్నడ నటి చార్మిళ బాగా చేసింది. చార్మిళ పేరు భలే ఉందికదా!

ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, రజిత, ఆలీ, బాబూమోహన్, త్యాగరాజు , గిరిబాబు , రాధాకుమారి, బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి, తదితరులు నటించారు. ఎప్పటిలాగే నిర్మాత రామానాయుడు పోలీస్ ఉన్నతాధికారిగా కాసేపు తళుక్కుమన్నాడు.

రాజన్ నాగేంద్ర అత్యంత శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు. వేటూరి పాటలను బాలసుబ్రమణ్యం, సుశీలమ్మ, చిత్ర, శైలజ, రమోలాలు శ్రావ్యంగా పాడారు. డ్యూయెట్లన్నీ ఈవీవీ అందంగా చిత్రీకరించారు. సుందర విశాఖ అందాలను చక్కగా వాడుకున్నారు.

నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదో రాగము శ్రీరస్తు అన్న శివరంజని చాలా శ్రావ్యంగా ఉంటుంది. వల్లభా దుర్లభా అంటూ హీరోని హీరోయిన్ మాలాశ్రీ టీజ్ చేసే డ్యూయెట్లో మాలాశ్రీ అదరగొట్టేస్తుంది.

అలాగే బాగుండే మరో డ్యూయెట్ ఐ లవ్ ఫర్ యు అన్నది ప్రేమ ఐ డై ఫర్ యు అన్నది ప్రేమ. మరో డ్యూయెట్ ఓ న మః మనమిద్దరం. బోర్‌స్టన్ స్కూల్లో విద్యార్ధులు పాడే పాట జోడీ కడితే బేడీలా ప్రేమా పెళ్ళి నేరాలా బాగుంటుంది.

బోర్‌స్టన్ స్కూల్లో ఓ ఆడపిల్ల అన్ని రోజులు ఉంటే కాపలాదారులు, శిక్షకులు, అధికారులు కనిపెట్టలేక పోవడం సినిమా కథ లాగానే ఉంటుంది. సినిమాయే కదా ! నో లాజిక్కులు. ఓన్లే మేజిక్కులు.

తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళంలోకి డబ్ చేయబడింది. హిందీలో రీమేక్ చేయబడింది. హిందీలో కూడా హరీషే హీరోగా నటించాడు. హీరోయిన్ కరిష్మాకపూర్ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేసింది. కన్నడంలో విజయ రాఘవేంద్ర, రాధికా కృష్ణమూర్తిలు లీడ్‌రోల్సులో నటించారు. సినిమా యూట్యూబులో ఉంది. ప్రేమ హృదయులు మరలా కూడా చూడొచ్చు. లవ్ ఈజ్ ఆల్వేజ్ బ్యూటీఫుల్!

- సుబ్రమణ్యం దోగిపర్తి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page