top of page

పిల్లలూ దేవుడూ చల్లనివారే!

  • Writer: ADMIN
    ADMIN
  • May 23, 2024
  • 2 min read

ధనికుల బిడ్డలైతే చిల్డ్‌ బీరంత చల్లని కరుణామయులే!!

రహదారి ప్రమాదాల ఫలితాలూ ` నివారణ మార్గాలు అనే విషయము మీద 300 మాటల్లో ఒక వ్యాసము వ్రాయుడు.

పోష్‌ కారుతో ఇద్దరు యువకుల్ని గుద్ది చంపిన ఆ ముక్కుపచ్చలారని 17 సంవత్సరాల 8 నెలల మైనర్‌ బాలుడికి బెయిల్‌ ఇవ్వడానికి పూణే జువైనల్‌ బోర్డ్‌ విధించిన నియమం.

పాపం.. రాశాడో, లేదో ఆ ముక్కుపచ్చలారని టైర్ల ఎరుపు వెలవని కడుపులో నిషా దిగని పసివాడు! ఎంత గిలగిలలాడిపోయాడో ఆ రాత్రి? వారం రోజుల ప్రిపరేషన్‌తో ఓ సీబీఎస్సీ కుర్రాడు కూడా రాయలేడే? అలాంటిది.. ఆ భయానక రాత్రి చుట్టూ నిందించే జనాలు.. వీలు దొరికితే కుమ్మేయాలనుకునే కరుణ లేని మూర్ఖ మూకలు ఎంతలా తల్లడిల్లాడో?

రెండు కోట్ల ఖర్చుపెట్టి కొన్న ఆ కారు ఆ బిడ్డను దుర్మార్గుల చేతి నుంచి కాపాడనైనా లేదు. ఎన్నడూ పోలీస్‌స్టేషన్‌ ముఖం చూడని గౌరవప్రదమైన ఆ కుటుంబం తమ మైనర్‌ కొడుకును తలచుకుని ఎంతలా విలవిల్లాడిరదో కదా? మూడు వందల మాటలంటే మాటలా..?? పుట్టింది మొదలూ కంప్యూటర్‌ మీదే అక్షరాలు దిద్దిన ఆ యువ విద్యార్ధి వేళ్లు ఎంత నొప్పిపుట్టాయో కదా..??? ప్రాణాలదేముందీ.. విధిరాత తప్పింపగలవాడెవడు..?

ఆ రాత్రి పోవాలని రాసిపెట్టి ఉంది. పోర్ష్‌ కారు కాకపోతే అశోక్‌ లేల్యాండ్‌ ట్రక్కు! ఏదో ఒకదాని కింద పడిపోయే ప్రాణాలే కదా..? అసలు తప్పెవరిదీ?? మైనరని తెలిసి పబ్బులో మందు పోసినవారు కదా అసలు నేరస్తులు..? మైనర్‌ నడుపుతున్నాడని తెలిసీ.. ఎదురుగా రోడ్లమీదకు వచ్చిన ఆ ఇద్దరిదీ కదా అసలు నేరం? అయ్యో.. కొత్త కారు ఇంకా రిజిస్ట్రేషన్‌ అయినా అవ్వలేదే.. కనీసం ఆక్షన్లో ఒక ఫ్యాన్సీ నెంబరైనా ఎంచుకోలేదే.. ముద్దుగా ఇచ్చిన ఆ బుజ్జి బహుమతి నడిరోడ్దు మీద మూతిపగిలి అలా అనాథలా పడివుంటే కనీసం జాలైనా లేకుండా ఆ బిడ్డడిని బయటకు లాగి చెంపదెబ్బలు వేసిన రాక్షస మూకకు ఎవరిచ్చారూ అధికారం?

తన పని తాను చేసుకుంటూ ఎవరిజోలికీ, మరీ ముఖ్యంగా రిచ్‌ కిడ్ల జోలికి రాని చట్టాన్ని అలా చేతుల్లోకి తీసుకోవడం అది కదా అసలైన నేరం..? పూణే పోలీసులారా.. ఎంత సమయస్ఫూర్తీ! ఎంతటి మానవత్వం!! చిన్నారుల పట్ల మీ కరుణ ఆచంద్రతారార్కం నిల్చిపోయేది. చంటిబిడ్డల పట్ల మీ కన్సర్న్‌.. ఆర్డరేసి ఆగమేఘాల మీద తెప్పించిన పిజ్జాముక్కల తోడు ఆ బిడ్డ కడుపును ఆ రాత్రి కనని తల్లిదండ్రులై నింపారే! అదికదా అసలైన రక్షకభట విధి!! అదేకదా అసలు సిసలు ఫ్రెండ్లీ పోలీసింగ్‌! ఆ ఉదయం ఆరైనా కొట్టకముందే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని చిన్నారి డ్రైవర్‌ యోగక్షేమాలు కనుక్కున్న ఆ బాధ్యత కలిగిన నాయకుడే మహనీయుడు! ఎవడు రమ్మన్నాడు రోడ్ల మీదకు అంతలేసి నడిరాత్రి..? బైకు మీద పిల్లనెక్కించుకుని కన్నూ మిన్నూ కానకుండా ఎవడు రమ్మన్నాడు పూణే రహదారుల మీదకు..? ఆ కారు నడిపిన పిల్లాడంటే మైనర్‌! చచ్చిన మీరిద్దరూ ఇరవై దాటిన మేజర్లయిన మీదే కదా తప్పూ..?

నేటి బాలలే రేపటి పౌరులూ అన్నాడు మేకపాలు తాగిన మహాత్ముడు! రేపటి పౌరుల్ని కాపాడుకునే బాధ్యత లేదా మనందరికీ..? అసలు ఈ పాశ్చాత్య సంస్కృతే కృతకం! ఆ పబ్బులూ, గబ్బులూ.. ఇదంతా గత ప్రభుత్వాల పాపం కాదా..? స్వయంగా సిగరెట్టు తాగి విస్కీ సిప్పు చేసి.. ఇదంతా నెహ్రూ చేసిన నాశనం కాదా..? ఎంతటి గొప్ప సంస్కృతీ మనదీ..? ఎన్నెన్ని వేల ఏళ్లదీ మహానాగరికత..? మర్యాదా మన్ననా నేర్పిన దేశం! పవిత్రతకూ ప్రవచనాలకూ పెట్టింది పేరు!! ఖాట్మండూలో నైట్‌ క్లబ్బుల్లో తిరిగే ఆ యువనాయకుడి ప్రవర్తనే ఇందుకు కారణం కాదా..? తాతల బుద్దులు ఎక్కడికి పోతాయీ..? దేశం మొత్తం మద్యనిషేధం విధించాలి! అవసరమైన రిచ్‌ కిడ్లకు స్టార్‌ హోటళ్లలో మాత్రం తెల్లారగట్ట దాకా విక్రయించాలి!! పబ్బుల్ని భజన మందిరాలుగా చెయ్యాలి! ఐటీ కంపెనీలను మూసెయ్యాలి!! నైట్‌ లైఫ్‌ అనే పదాన్ని అఖండ నిఘంటువు నుంచి తొలగించాలి! రోడ్ల మీద రాత్రి పది దాటాక పాతిక లక్షలైనా చెయ్యని ముతక కార్లను నిషేధించాలి!! ద్విచక్రవాహన చోదకుల్లారా ఖబడ్దార్‌! హెల్మెట్లూ తలలకే కాదు.. మొత్తం శరీరానికీ కావాలని రేపటి పార్లమెంట్లో కొత్తం చట్టం తేవాలి!!

మధ్యతరగతి కుటుంబాలన్నీ రాత్రి తొమ్మిదింటికి తమ పిల్లల్ని బాత్రూముల్లో పెట్టి బయట బోల్టులెయ్యాలి! కోట్లుపోసి కొనుక్కున్న కార్ల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌లను ఏర్పాటు చెయ్యాలి!! అప్‌ టౌన్‌కూ.. డౌన్‌ టౌన్‌కూ మధ్యన వాగా బోర్డర్‌ ఒకటి నిర్మించాలి! గ్రహపాటున గుద్దేసి దిక్కుతోచకుండా పరిగెత్తే ఆ లోకం పోకడ తెలీని బిడ్డల్ని రెస్క్యూ చెయ్యడానికి ప్రత్యేక దళాలు రాత్రులంతా పహారా కాయాలి!!

దేశం మారాలి.. ఘటనల పట్ల మన ఆలోచనా సరళీ మారాలి!

పిల్లలూ దేవుడూ చల్లనివారే! ధనికుల బిడ్డలైతే.. చిల్డ్‌ బీరంత చల్లని కరుణామయులే!!

- రమణ కొంటికర్ల

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page