top of page

పెళ్లి గురించి అడిగితే.. ఈ పరాచికాలేంటి పాపలూ!

  • Guest Writer
  • 3 hours ago
  • 2 min read

ఈరోజు హల్దీ.. రేపు సంగీత్.. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్లండి..! ఈ రేంజులో పరాచికం ఆడింది ఎవరో తెలుసా? ఇంకెవరు.. అందాల మృణాల్ ఠాకూర్. ఈ వేలెంటైన్స్ డే(14 ఫిబ్రవరి) రోజున ధనుష్ తో మృణాల్ పెళ్లి అంటూ సాగుతున్న ప్రచారానికి ఈ భామ నైసుగా స్పందించింది. కాస్త సరదాగా, మరికాస్త వ్యంగ్యంగా చురకలు వేసింది ఈ బ్యూటీ. నాలుక ఖాళీగా ఉందని ఏదో ఒకటి అనేస్తే, ఇలాంటి రివర్స్ పంచ్‌లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రశ్నించిన వారికి అర్థమైనట్టే!

కొందరి వెటకారాలు మామూలుగా ఉండవు! అని కూడా క్యాచ్ చేసారా పాయింటు? మృణాల్ తరహాలోనే ఇంకా ఇతర భామలపైనా ఇలాంటి ప్రచారం జరిగిందా? ప్రేమ పెళ్లి అంటూ మీడియా లేదా నెటిజనులు ప్రశ్నిస్తుంటే .. ఎవరైనా కథానాయిక ఇలానే సరదాగా స్పందించారా? కొందరు హీరోయిన్లు కొన్నిసార్లు ఇలాంటి ప్రచారానికి అసహనం, చికాకు ప్రదర్శించిన సందర్భాలున్నాయా? అలాంటి హీరోయిన్లు సౌత్ సినిమాలో ఎవరెవురు ఉన్నారు? బాలీవుడ్ కథానాయికలు ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్నారా? త్వరలోనే పెళ్లి అంటూ ప్రశ్నల్ని ఎదుర్కొన్నారా? వీటన్నిటికీ సమాధానమే ఈ కథనం..

మృణాల్ ఠాకూర్ మాదిరిగానే తమ పెళ్లి పుకార్లపై సౌత్ టు నార్త్ హీరోయిన్లు చాలా మంది రకరకాలుగా స్పందించారు. కొందరు వెటకారంతో బుద్ధి చెబితే, మరికొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సౌత్ హీరోయిన్లలో త్రిష పెళ్లి గురించి దశాబ్ద కాలంగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ బిజినెస్‌మెన్‌తో పెళ్లి అని వార్తలు వచ్చినప్పుడు త్రిష ఇన్‌స్టాలో అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ``నా జీవితాన్ని నాకంటే బాగా ప్లాన్ చేస్తున్నందుకు థాంక్స్... అలాగే మా హనీమూన్ ఎక్కడో కూడా మీరే ప్లాన్ చేసి చెప్తారని వెయిట్ చేస్తున్నా.. అంటూ సెటైర్ వేశారు.

విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి అని ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకసారి నిశ్చితార్థం గురించి మీడియా ప్రశ్నిస్తే.. సరే, కంగ్రాట్స్ చెప్పారు కదా.. తీసేసుకుంటాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, వాటికి కూడా కలిపి ఇప్పుడే విష్ చేసేయండి..అంటూ చాలా సింపుల్‌గా అసలు విషయం దాటవేశారు. ప్రభాస్-అనుష్క పెళ్లి అనేది ఒక ఎవర్ గ్రీన్ గాసిప్. దీనిపై స్వీటీ ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ.. ప్రభాస్ నా 3 ఏఎం ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఇన్నేళ్లు దాగి ఉండేది కాదు. పెళ్లి ఎప్పుడు అనేది దైవ నిర్ణయం.. సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది.. అని ఎంతో హుందాగా సమాధానం ఇచ్చారు.

తెలుగమ్మాయి అంజలిపైనా చాలా పుకార్లు వచ్చాయి. తనపై వచ్చిన పుకార్లు కొంచెం వెరైటీ. అంజలి పెళ్లి చేసుకుని ఒక ఇంట్లో సెటిల్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలియకుండానే నాకు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదోసారి చేస్తున్నారు. నేను ఇంట్లో ఉండటం ఏంటి? షూటింగ్‌లతో ఎప్పుడూ బయటే ఉంటున్నానుగా!.. అని చమత్కరించారు. తాప్సీ పన్నూ తన పెళ్లి పుకార్లపై ఎప్పుడూ కాస్త ఘాటుగానే స్పందిస్తుంది. తన పర్సనల్ లైఫ్ గురించి క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడని నైజం తాప్సీది. నా పెళ్లి గురించి మీకు ఎందుకు అంత ఆత్రుత? నేను పెళ్లి చేసుకుంటే ఆ ఫోటోలు నేనే సోషల్ మీడియాలో పెడతాను.. అంతవరకు ఆగండి! అని రిపోర్టర్ల నోరు నొక్కేసిన సందర్భాలు ఉన్నాయి. శిఖర్ పహారియాతో తన పెళ్లి వార్తలపై జాన్వీ కపూర్ ఒకసారి స్పందిస్తూ..``మీకేమైనా పిచ్చా? అని చాలా డైరెక్ట్‌గా అడిగేశారు. మీడియా తన వ్యక్తిగత విషయాల్లో మరీ లోతుగా వెళ్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో శ్రద్ధా కపూర్ పెళ్లి అని వార్తలు వచ్చినప్పుడు.. ఆమె తండ్రి శక్తి కపూర్ జోక్యం చేసుకుని, “శ్రద్ధా పెళ్లి వార్తలు నాకంటే మీకే (మీడియాకే) ముందు తెలుస్తాయి అనుకుంటా” అని వెటకారంగా స్పందించారు.

చివరికి అలా పంచ్ విసిరిన మృణాల్:

నిజానికి ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ధనుష్‌తో పెళ్లి జరగబోతోందన్న వార్తలపై మృణాల్ నవ్వుతూ స్పందించారు. “అవును.. ఈరోజే నా హల్దీ వేడుక, రేపు సంగీత్ ఉంది. అందరూ వచ్చి భోజనం చేసి వెళ్లండి” అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఒకవేళ తన ఇంటి ముందు జనం క్యూ కడితే అది “బిగ్గెస్ట్ ఏప్రిల్ ఫూల్ జోక” అవుతుందని కూడా ఆమె చమత్కరించారు. మృణాల్ ఠాకూర్ `హల్దీ.. సంగీత్` అని పంచ్ లు విసిరడం ఒకెత్తు అనుకుంటే త్రిష `హనీమూన్ ప్లాన్` అడగడం మరో ఎత్తు. నాకంటే ముందే మీకు తెలుసు అంటూ స్పందించే ఇతర కథానాయికలు మరొక ఎత్తు! సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై నెటిజన్లు, మీడియా చూపే అతి ఉత్సాహాన్ని ఇలాంటి కామెడీ ఆన్సర్లతో కవర్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. ఒకవేళ ఎవరితో అయినా లింకప్ చేసి మీ స్నేహితులు ప్రశ్నిస్తే, మీరు కూడా ఇలాగే సమాధానం ఇస్తారా?

- తుపాకి.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page