పథకాల్లో కోత.. ప్రభుత్వాలకు వాత!
- DV RAMANA

- 6 hours ago
- 2 min read

జనాకర్షక పథకాలు ఎన్నికల్లో ఓట్లు కుమ్మరించవచ్చేమోగానీ.. ఆ తర్వాత వాటిని క్రమం తప్పకుండా అమలు చేయడం ప్రభుత్వాలకు కత్తిమీద సామే అవుతుంది. వాటికి అవసరమైన వందలు, వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయలేక లబ్ధిదారుల జాబితాల్లో కోతలు విధించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇది ప్రజల్లో మరింత అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమై ప్రభుత్వాలను కూల్చే స్థాయికి పెరిగినా ఆశ్చర్యపోనవసరంలేదని అనేక గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పార్టీలు, ప్రభుత్వాలు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడంలేదు. దాని ఫలితాన్నే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తున్నది. మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన అనేక గ్యారెంటీ పథకాల్లో ‘మాజీ.. లడ్కీ.. బెహెన్’ కీలకమైనది. అమ్మ.. అమ్మాయి.. సోదరి.. అని దీని అర్థం. ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన మహిళామణులందరి ఖాతాల్లో ప్రతినెలా రూ.1500 చొప్పన జమ చేస్తామని ఇచ్చిన హామీ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించి అధికారం కట్టబెట్టింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హులైన 2.5 కోట్ల మంది మహిళలను గుర్తించి భృతి చెల్లించడం ప్రారంభించారు. భారీ ఖర్చుతో కూడిన ఈ అనుత్పాదక పథకం ప్రభుత్వానికి భారంగా మారింది. బడ్జెట్ కేటాయింపులకు మించి అదనపు నిధులను ఆ పథకాన్ని మళ్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం, ఖర్చులను ఆడిట్ చేసే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ-కాగ్) ఎత్తిచూపి తప్పుపట్టింది. ఈ పథకం పేరుతో ఏకంగా రూ.3,541 కోట్లు అధికంగా ఖర్చు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అదనపు భారాన్ని పరిహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేసింది. దాంతో ప్రభుత్వం కోతల కత్తికి పనిచెప్పక తప్పలేదు. లబ్ధిదారుల జాబితాలను జల్లెడ పట్టేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించి అమలు చేసింది. ఈ బహుళ వడపోత విధానం ప్రకారం.. రూ.2.50 లక్షలకు మించి వార్షికాదాయం ఉన్న వారిని అనర్హులుగా చేశారు. ఆధార్-రేషన్ కార్డు క్రాస్ వెరిఫికేషన్ ద్వారా నకిలీ లబ్ధిదారులు, రెండుమÖడు చోట్ల లబ్ధి పొందుతున్నవారిని తొలగించారు. కాగా ఇంకో కీలకమైన వడపోత.. ఇన్‌కమ్ టాక్స్ డేటాబేస్‌తో లబ్ధిదారుల వివరాలను సరిపోల్చి ట్యాక్స్ రిటర్న్‌లు ఫైల్ చేసిన వారిని తొలగించడం.. ఇలా పలు రకాల వడపోతల ద్వారా ఏకంగా 92 లక్షల మంది అనర్హులుగా ప్రకటించారు. ఇంతవరకు లబ్ధి పొందుతూ ఇప్పుడు తిరస్కరణకు గురైనవారికి సహజంగానే ఈ పరిణామం మింగుడు పడదు. హామీలు ఇచ్చి ఎన్నికల్లో తమ ఓట్లతో నెగ్గి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు అనర్హులంటూ తొలగించడం ‘ఏరు దాటాక తెప్ప తగలేయడం’ లాంటిదేనని విమర్శలు గుప్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఈ భారీ ఫిల్టరింగ్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు అస్కారమిచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి అనేకానేక గ్యారెంటీ పథకాల ఆశచూపించే ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాయన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తన సూపర్ సిక్స్ హామీల్లో అచ్చం మహారాష్ట్రలో అమలవుతున్న పథకం మాదిరిగానే ‘ఆడబిడ్డ నిధి’ పేరుతో అర్హులైన అన్నివర్గాల మహిళలకు నెలకు రూ.1500 చొప్పన భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దాంతో మహిళలందరూ కూటమి అభ్యర్థులపై ఓట్ల వర్షం కురిపించి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక సూపర్‌సిక్స్‌లో కొన్నింటిని అమలు చేస్తున్న ప్రభుత్వం వాటి విషయంలోనే బడ్జెట్ భారంతో సతమతమవుతూ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇంతవరకు అమలు చేయలేకపోయింది. నిరుద్యోగ భృతి పథకానిదీ అదే దుస్థితి. దీనిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల్లో అసంతృప్తి పెరుగుతున్నది. సామాజిక పెన్షన్ల పెంపుతోపాటు ప్రస్తుతం అమలవుతున్న పలు పథకాలకు బడ్జెట్ భారంగా మారి నిధులు సమకూర్చడం కష్టమవుతుండటంతో ప్రతినెలా వాటిలో వడపోతలు జరుగుతుండటం, పెన్షన్ లబ్ధిదారులు నెలనెలా తగ్గుతుండటం ప్రభుత్వాల స్వార్థ రాజకీయాý ఫలితమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత పథకాలు అనుచితమని సుప్రీంకోర్టు సహా మేధావులు సూచిస్తున్నా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇవేవీ పట్టించుకోవడంలేదు. ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయలో పడేస్తున్నారు. తద్వారా వారిని ఓటు యంత్రాలుగా మార్చుకుని అధికారం హస్తగతం చేసుకుంటున్నా తర్వాత చేతులెత్తేయడం, ఎగ్గొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇవి అంతిమంగా ప్రభుత్వాలపై వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే అనుభవం తప్పడంలేదు. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కూడా రాజకీయులు ఖాతరు చేయడంలేదంటే ఈ విషయంలో కఠిన మార్గదర్శకాలతో ముకుతాడు వేయాల్సిన అవసరం కనిపిస్తున్నది. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులు, బడ్జెట్ పరిమాణం, నిధుల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగని రీతిలోనే ప్రజాకర్షక పథకాలకు రూపకల్పన చేసి హామీలుగా ఇవ్వాలి. లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించి జాబితాలను ఖరారు చేస్తే.. తర్వాత అనర్హులు ఉన్నారంటూ లబ్ధిదారులను తొలిగించాల్సిన దుస్థితి, దానిపై విమర్శలు ఎదుర్కోవాల్సిన అగత్యం తప్పుతాయన్నది మహారాష్ట్ర అనుభవం చెప్పకనే చెబుతుంది. 92 లక్షల మందిని ఒకేసారి తొలగించడమంటే చిన్న విషయం కాదు. మహారాష్ట్రలో దాదాపు ప్రతి నాలుగతో ఇంటిలో ఒక మహిళ జాబితా నుంచి తొలగింపుకు గురైందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఫిల్టరింగ్ జరిగితే లక్షల కుటుంబాల్లో ఆగ్రహం, రాజకీయ భూకంపం తప్పదు. కాబట్టి పార్టీలు అన్నీ ఆలోచించి హామీలు, పథకాలు ప్రకటిస్తే మేలు.






Comments