top of page

భూ పరిహారం.. బ్యాంకుల ఫలహారం!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 1 hour ago
  • 3 min read
  • రైతులను మభ్యపెట్టి బీమా పాలసీలుగా మార్పు

  • వ్యాపార టార్గెట్లు, కమీషన్ల కోసం ఎస్బీఐ సిబ్బంది కక్కుర్తి

  • ఒక్క నౌపడా బ్రాంచిలోనే ఏకంగా రూ.3.80 కోట్ల కమీషన్లు

  • ఐఆర్‌డీఏనే విస్మయపర్చిన ఈ భారీ భాగోతం

  • ఉన్నతస్థాయి విచారణలో తేలుతున్న వాస్తవాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ధనికులతోపాటు పేదలకు బ్యాంకుల సేవలు అందాలన్న, ఆర్థిక లావాదేవీలు గ్రామీణ ప్రాంతాల్లోనూ సరక్షితంగా జరగాలన్న లక్ష్యంతో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. కానీ మారిన ఆర్థిక విధానాల్లో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన పోటీ జాతీయ బ్యాంకులను సేవా దృక్పథం నుంచి గాడి తప్పించి ఫక్తు లాభాపేక్ష సంస్థలుగా మార్చేసింది. బ్యాంకింగ్ సేవలతోపాటు బీమా రంగంలోకి కూడా ప్రవేశించిన జాతీయ బ్యాంకులు పాలసీల కోసం రైతులనే మభ్యపెట్టి వ్యాపారం పెంచుకునే దుస్థితికి దిగజారాయి. రైతులకు అందిన భూ నష్టపరిహారాన్ని వారిని మభ్యపెట్టి పాలసీల కిందకు మార్చేసి స్టేట్ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న ఎస్బీఐ లైఫ్ పాలసీలు చేయించిన ఉదంతమిది. ఈ వ్యవహారంలో ఎస్బీఐ లైప్‌కు కోట్లలో వ్యాపారం చూపించిన అధికారులు.. అదే సమయంలో లక్షల్లో కమీషన్లు జేబులో వేసుకున్నారు. వీరి కక్కుర్తి కారణంగా ప్రాజెక్టుల కోసం తమ కుటుంబాల భవిష్యత్తునే ఫణంగా పెట్టి.. ఉన్న ఊరిని, సొంత భూమిని వదులుకొని సొంత జిల్లాలోనే నిర్వాసితులుగా మారిన త్యాగమÖర్తులు దోపిడీకి గురవుతున్నారు. మూలపేట పోర్టు, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, వంశధార ప్రాజెక్టుల కోసం తమ జీవనాధారమైన భూములు ఇచ్చేసి.. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం పట్టుకొని వలసెళ్లిపోతున్న సగటు రైతులను దోచుకోవడాన్నే ఇప్ప్పుడు బ్యాంకుల ప్రధాన టార్గెట్‌గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద లీడ్ బ్యాంకుగా ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులను మభ్యపెట్టి దోచుకోవడంలో కూడా ముందుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల వెనుక కఠిన వాస్తవాలను తెలుసుకుందాం.

కమీషన్ మొత్తాలే రూ.కోట్లలో..

సంతబొమ్మాళి మండలం మÖలపేటలో పోర్టు నిర్మాణానికి అవసరమైన వందలాది ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. ఆ మేరకు నష్ట పరిహారాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ క్రమంలో నౌపడ ఎస్బీఐ బ్రాంచిలో కూడా కొందరు రైతుల ఖాతాలకు నష్టపరిహారం జమైంది. దాంతో బ్యాంకు అధికారులు ఆ సొమ్మును మళ్లీ వ్యాపారంగా మలచి కమీషన్లు దండుకోవడానికి రంగంలోకి దిగిపోయారు. ఆ సొమ్ముతో ఇన్సూరెన్స్ చేయాలని, ఇది బ్యాంకు నిబంధన అంటూ అవగాహన లేని రైతులను మధ్యపెట్టి వారితో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారు. ఇలా పాలసీలు చేయించినందుకే నౌపడా లాంటి ఒక మారుమÖల బ్యాంకు బ్రాంచి ఉద్యోగులకే ఏకంగా రూ.3.80 కోట్లు కమీషన్ అందడం దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ వ్యవహారాలను పర్యవేక్షించే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డీఏ) అధికారులనే అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లా కేంద్రాల్లోనే ఒకేసారి అంత భారీ మొత్తాల్లో కమీషన్లు రావు. కేటగిరీలను బట్టి కొన్ని పాలసీలకు 40 శాతం, కొన్నింటికి 20 శాతం కమీషన్లు ఉంటాయి. వీటి సగటు కడితే 30 శాతం ఉంటుంది. సగటు 30 శాతం లెక్క ప్రకారమే రూ.3.80 కోట్ల కమీషన్ అందుకున్నారంటే.. రైతుల నుంచి ఎంత భారీ మొత్తాల్లో ఇన్సూరెన్స్ చేయించారో అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఐఆర్‌డీఏ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు.

నిబంధనలు మీరి.. ఏమార్చి..

ఈ విచారణలో వెల్లడైన అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. మÖలపేట పోర్టు భూములకు చెందిన పరిహారం రైతుల ఖాతాల్లో జమైనప్పుడు.. ఆ మొత్తాల్లో కొంత భాగాన్ని బ్యాంకు అధికారులు రైతులను మభ్యపెట్టి ఇన్సూరెన్స్ కింద మార్చేశారు. వాస్తవానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే సొమ్ముకు ఇన్సూరెన్స్ కట్టించాలన్న నిబంధన ఎక్కడా లేదు. అయితే బ్యాంకు నుంచి రుణం తీసుకున్న ఉదంతాల్లో భవిష్యత్తులో రుణగ్రహీత చనిపోతే ఆ సొమ్ము తిరిగి రాకపోవచ్చన్న అనుమానంతో లోన్ తీసుకున్నప్పుడే అతని పేరుతో బ్యాంకు ఇన్సూరెన్స్ చేయిస్తుంది. అది కూడా తప్పనిసరిగా చేయాలన్న నిబంధనేమీ లేదు. అటువంటిది ఏకంగా బ్యాంకులో దాచుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్‌కు కూడా ఇన్సూరెన్స్ చేయించడం ఒక్క ఎస్‌బీఐకే చెల్లింది. మÖలపేట పోర్టుకు భూముల విస్తీర్ణాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రైతులకు పరిహారం అందింది. రూ.20 లక్షలు అందుకున్న రైతు నుంచి ఏడాదికి రూ.2 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా విత్‌డ్రా చేసే విధానాన్ని నౌపడ బ్రాంచి అవలంభించింది. పాలసీ చేయించడం వల్ల బ్రాంచి మేనేజర్‌కు 40 శాతం కమీషన్ వస్తుంది. దీన్ని బ్యాంకులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు సర్దుతారు. అంటే లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద చెల్లిస్తే అందులో రూ.40వేలు బ్యాంకు సిబ్బందికి కమీషన్‌గా లభిస్తుంది. వాస్తవానికి ఇన్సూరెన్స్ పాలసీ చేయాలంటే.. అందుకు సంబంధించిన ఆదాయాన్ని చూపాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపాలి. కానీ ఒక సాధారణ రైతుకు ఇవేవీ ఉండవు. అందుకని రూ.20 లక్షల పరిహారం సొమ్మును ఐదు లక్షలు చొప్పున నాలుగు భాగాలుగా విభజించి, వాటిని నిర్ధిష్ట కాలానికి డిపాజిట్ చేసి, ప్రతి ఏడాది ప్రీమియం కట్టడానికి రైతు పేరిట ఐదేసి లక్షల డిపాజిట్ ఉందనే ఆధారం చూపించి ఐఆర్‌డిఏను బ్యాంకు ఉద్యోగులు మోసం చేస్తున్నారు. సాధారణంగా ఒక బ్యాంకు బ్రాంచి మేనేజర్ ఒక ప్రాంతంలో మÖడేళ్ల వరకు పని చేస్తారు. ఆ తర్వాత బదిలీపై ఎక్కడకు వెళ్తారో తెలియదు. ఈలోగా తన టార్గెట్‌ను, ప్రమోషన్ మార్కులను రీచ్ కావడానికి మేనేజర్లు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. ప్రతి ఏడాది తమ అకౌంట్ నుంచి కొంత మొత్తం తాము విత్‌డ్రా చేయకుండానే తరిగిపోతుండటాన్ని ఆలస్యంగా తెలుసుకుంటున్న రైతులు ఏడాదో, రెండేళ్ల తర్వాతో ప్రీమియం చెల్లించకుండా చేతులెత్తేస్తున్నారు. కానీ అప్పటికే బ్రాంచి మేనేజర్ టార్గెట్ పూర్తి అవుతుంది.. ప్రమోషనూ వచ్చేస్తుంది. ఐఆర్‌డీఏ నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన రైతులకు ఇన్సూరెన్స్ వర్తించదు. అటువంటి వారికి యులిప్ పాలసీ (యునిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ) లను అంటగడుతున్నారు. ఈ పాలసీలు చేయించినందుకు సంబంధిత బ్రాంచికి 20 శాతం కమీషనే వస్తుంది. కాకపోతే యులిప్ సొమ్ము స్టాక్‌మార్కెట్‌లో పెట్టడం వల్ల దాని లాభనష్టాల ఆధారంగా సొమ్ములొస్తాయి. ఇవేవీ రైతులకు తెలియవు. ఏడాదిలో తమ సొమ్ము 40 శాతం పోయిన తర్వాత కట్టడం ఆపేస్తారు. ప్రస్తుతం నౌపడ బ్రాంచిలో ఒక్కొక్కరి పేరిట రెండు, మూడు లక్షలకు తక్కువ కాకుండా ఇన్సూరెన్స్‌లు చేయించేశారు. ఈమేరకు రైతుల సొమ్ము పోయినట్టే.

జీవితాంతం డబ్బులొస్తాయని నమ్మించి..

కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రణస్థలం మండలం కొవ్వాడలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి సేకరించింది. ఇందుకు సంబంధించి రైతులకు నష్టపరిహారాన్ని ఎస్‌బీఐలోనే జమ చేసింది. అక్కడ కూడా ఇదే జరిగింది. ఇప్ప్పుడిప్ప్పుడే అక్కడి రైతులు అసలు ఇన్సూరెన్స్ ఎందుకు చేశారని, బ్యాంకులో ఉన్న తమ సొమ్ము ఎందుకు తగ్గిపోతున్నదని ప్రశ్నిస్తున్నారు. కానీ సమాధానం చెప్పడానికి అప్పటి ఏజెంట్ గానీ, బ్రాంచి మేనేజర్ గానీ ఇప్ప్పుడు అక్కడ లేరు. కానీ ఏదో ఒకరోజు ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మీద కొవ్వాడ రైతులు తిరగబడటానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఒక్కసారి కడితే సరిపోతుందని, జీవితాంతం డబ్బులు వస్తాయని కొందరికి, మూడేళ్లు కట్టి ఆపేస్తే ఆ తర్వాత పింఛను మాదిరిగా డబ్బు అందుతుందని మరికొందరిని మభ్యపెట్టి బ్యాంకు అధికారులు ఇన్సూరెన్స్ చేయించేస్తున్నారు. ఇవేవీ ఇన్సూరెన్స్ పాలసీ బాండ్‌లో కనపడవు. కొన్ని పేజీల పుస్తకంలో వరుసగా సంతకాలు పెట్టి వెళ్లిపోవడం తప్ప చిన్నచిన్న అక్షరాలతో ఉన్న కండిషన్స్‌ను మేధావి కూడా చదవలేడు. అటువంటిది రైతులు ఆ బాండ్‌లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో తెలుసుకునే అవకాశం అస్సలు లేదు. కాబట్టే కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్‌లు చేయించేసి బ్యాంకర్లు పబ్బం గడుపుకొని రైతులను ముంచేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page