top of page

వైరముత్తు మంచి రచయితే కానీ.. మంచి మనిషి కాదు’

  • Guest Writer
  • 21 hours ago
  • 3 min read

‘వైరముత్తు మంచి రచయితే కానీ..మంచి మనిషి కాదు’..ఈ మాట అన్నది ఎవరో అనామకుడు కాదు. సాక్షాత్తూ ఇళయారాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్. గాయని చిన్మయి ఆరోపణల నేపథ్యంలో తెలుగువారికి వైరముత్తు గురించి తెలిసింది కానీ, చాలామందికి ఆయన ప్రస్థానం గురించి పెద్దగా తెలియదు. సినీ గేయరచయితగా వైరముత్తు ప్రస్థానం మొదలవడానికి ముఖ్యకారణం భారతీరాజా, ఇళయరాజా. వారిద్దరి వల్లే 1980లో వైరముత్తు తమిళ సినీరంగంలో పాటల రచయితగా ప్రవేశించారు. తొలి చిత్రం ‘నిళల్‌గల’తోనే ఇళయారాజా-వైరముత్తు కాంబినేషన్ శ్రోతలకు నచ్చింది.

అయితే, 1986 వరకే వారిద్దరి కాంబినేషన్ సాగింది. ఆ ఆరేళ్ల కాలంలో ఇద్దరి కాంబినేషన్‌లో అద్భుతమైన సినిమా పాటలు వచ్చాయి. అందులో అతి ముఖ్యమైన సినిమా ‘ముదల్ మరియాదై’. అదే సినిమా తెలుగులో ‘ఆత్మబంధువు’గా డబ్ అయ్యింది. ఈ సినిమాకీ భారతీరాజానే దర్శకుడు కావడం విశేషం. రెండు భాషల్లోనూ ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్టుగా నిలిచింది. వైరముత్తుకు ఏకంగా జాతీయ ఉత్తమ గీతరచయితగా పురస్కారం కూడా వచ్చింది. ఆపై ‘పున్నగైమన్నన’ అనే మరో సినిమా. ఆ తర్వాత ఇళయారాజా-వైరముత్తు కలిసి ఇప్పటిదాకా పనిచేయలేదు. ఇన్నేళ్లలో వారు నేరుగా ఒకరినొకరు చూసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. కారణం ఏంటి?

ఒక సినిమాలో వైరముత్తు రాసిన పాటలో ఒక లైన్‌ని ఇళయారాజా మార్చి పాడించారని, ఆ పద్ధతి నచ్చని వైరముత్తు ఆయనతో గొడవ పడ్డారని ఓ మాట ఉంది. ఆ విషయంలో ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారని అంటుంటారు. భాష విషయంలో ఇళయారాజా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని ఓ అభిప్రాయం ఉంది. తనిచ్చిన ట్యూన్‌కు అక్షరమక్షరం సరిపోయేలా పాట ఉంటేనే ఓకే చేస్తారని, లేకపోతే ఒప్పుకోరని గతంలో తెలుగు రచయిత వెన్నెలకంటి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాట విషయంలో జరిగిన గొడవే వైరముత్తు-ఇళయరాజా విడిపోవడానికి కారణమైందనేది జనబాహుళ్యంలో ఎక్కువగా వినిపించే మాట. అయితే వైరముత్తు వ్యక్తిగత వ్యవహారాలు నచ్చకే ఇళయరాజా ఆయన్ని దూరం పెట్టారని లోలోపల కొందరు అంటుంటారు.

ఆ తర్వాత కూడా ఓ స్టేజీపై వైరముత్తు మాట్లాడుతూ ‘పాటకు సాహిత్యమే ముఖ్యం. సాహిత్యం లేకపోతే పాట బోసిపోతుంది. సాహిత్యం తర్వాతే సంగీతం’ అని కామెంట్ చేశారు. కవిగా ఆయన పనిని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే ఆయన ఇళయరాజా మీదే కామెంట్ చేశారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ క్రమంలో గంగై అమరన్ మీడియా సమావేశం పెట్టి వైరముత్తు మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైరముత్తు అనే వ్యక్తిని ఇళయారాజా భారతీరాజాకు పరిచయం చేయకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాలని అన్నారు. ఈ మాటకు వైరముత్తు ఏ సమాధానం ఇవ్వకుండా ‘గడిచిపోయిన కాలాన్ని తవ్వడం అనవసరం’ అని చెప్పి మౌనంగా తప్పుకున్నారు.

ఆ తర్వాత కూడా గంగై అమరన్ వైరముత్తును బహిరంగంగా విమర్శించారు. మీటూ ఆరోపణల వ్యవహారంలో కూడా వైరముత్తు తప్పు చేసే ఉంటాడు అనే అర్థం వచ్చే రీతిలో గంగై అమరన్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు. ఒకానొక ఇంటర్వ్యూలో చిన్మయితో కలిసి ఓ ప్రోగ్రామ్ చేసి స్టేజీ పైనే ‘వైరమొత్తు చాలా గొప్పవాడు. మనం భరించలేనంత గొప్పవాడు’ అని వ్యంగంగా అన్నారు. ఇన్ని జరుగుతున్నా వైరముత్తు నుంచి ఏ రోజూ దీనిపై ఖండన గానీ, ప్రతివిమర్శ కానీ రాలేదు.

గంగై అమరన్ చెప్పినట్టే వైరముత్తు చాలా గొప్ప కవి. ఒక రకంగా తమిళ సినీగీతాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన వ్యక్తి. ఏడుసార్లు జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారం అందుకున్న ఏకైక భారతీయ రచయిత ఆయనే. కవిగా మాట్లాడితే ఆయనది గట్టి చేయి. సుమారు 20 పుస్తకాల దాకా ప్రచురించారు. అనేక భాషల్లోకి ఆయన రచనలు అనువాదమయ్యాయి. ఇంకా విశేషం చెప్పాలంటే, ఆయన విద్యార్థిగా ఉన్న దశలోనే ఆయన రాసిన కవిత్వం మరో విద్యాసంస్థలో పాఠంగా ఉండేది. అటువంటి అరుదైన ఘనత ఆయనకే దక్కింది. ఇన్నేళ్లలో ఆయన అనేకమంది సంగీత దర్శకులతో పని చేశారు. రాజకీయ అండదండలు బలంగా ఉన్నాయి. తమిళ భాష, సంస్కృతి గురించి అనేక సభల్లో ఆయన మాట్లాడారు. అయితే చిన్మయి ఆయన మీద ఆరోపణలు చేసిన తర్వాత ఆయన వ్యవహారం సర్వత్రా చర్చకు వచ్చింది.

సినిమాల్లోకి కొత్తగా వచ్చిన నటీమణులు, గాయనీమణులను ఆయన లైంగికంగా వేధిస్తారనే మాట పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఇటు ఇళయారాజా తమ్ముడితోపాటు అటు ఎ.ఆర్.రెహమాన్ సోదరి రైహానా, గాయని సుచిత్ర కూడా ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం ఆ ఆరోపణలకు బలం ఇచ్చింది. అదే సమయంలో మరికొందరు కూడా బయటకు వచ్చి తామూ వైరముత్తు వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే చాలామందికి తెలుసని, అయినా ఎవరూ నోరువిప్పరని ప్రచారం జరిగింది. వైరముత్తు ఇద్దరు కొడుకులు కూడా సినీ రచయితలే కావడం విశేషం. వారిలో ఒకరు మదన్ కార్కీ కాగా, మరొకరు కపిలన్. తెలుగులో హిట్టయిన అనేక సినిమాలకు మదన్ కార్కీ తమిళంలో డబ్బింగ్ రచయితగా పనిచేశారు. మీటూ ఆరోపణల సమయంలో వారిద్దరూ తండ్రికి మద్దతుగా నిలిచి ఆ ఆరోపణలను తిప్పికొట్టారు.

తమిళనాడులోనే ఓ సభలో భక్తురాలు ఆండాల్ గురించి వైరముత్తు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విష్ణు భక్తురాలైన ఆండాల్ ఒక దేవదాసి అని వైరముత్తు అనడం పట్ల హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇన్ని జరిగినా ఎవరూ వైరముత్తు మీద గట్టి యుద్ధాన్ని ప్రకటించలేదు. ఏ రాజకీయ నేతా ఆయన మీద కామెంట్ చేయలేదు. ఏ నటుడూ ఇందులో జోక్యం చేసుకోలేదు. అయితే గాయని చిన్మయికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నేళ్లపాటు తమిళ రంగంలో ఆమె పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. అనేక బెదిరింపులు కూడా వచ్చాయి. వైరముత్తు వెనకాల ఉన్న శక్తి ఏమిటో, ఎందుకు ఆయన మీద ఎవరూ మీద గట్టి విమర్శ చేయలేదో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైరముత్తు మాత్రం అందరికీ కావాల్సిన మనిషిలాగే వ్యవహరించడం ఇందుకు కారణమని కొందరు భావిస్తారు.

ఇప్పుడు వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించారు. ప్రముఖ నటులు కమల్‌హాసన్, రజినీకాంత్‌తోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అఖిలన్, జయకాంతన్ తర్వాత తమిళంలో ఈ పురస్కారం అందుకోబోతున్న మూడో రచయితగా వైరముత్తు వార్తల్లో నిలిచారు. తమిళ సాహిత్యంలో మరెవరికి ఈ పురస్కారం వచ్చినా ఇంత చర్చ జరిగి ఉండేది కాదు కానీ, వైరముత్తుకు పురస్కారం రావడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇటీవల లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొన్న జానీ మాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జ్ఞానపీఠ పురస్కారం భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అందిస్తుంది. ఈ పురస్కారం కేంద్రం ఇవ్వకపోయినా, రాష్ట్రపతి అందించే ఈ అవార్డు విషయంలో ఇలా వ్యవహరించడం ఏమిటని కొందరు విమర్శిస్తున్నరు. వైరముత్తు మీద ఆరోపణలు రుజువు కానప్పుడు అవార్డు ఇస్తే తప్పేమిటని మరికొందరి వాదన.

వైరముత్తుకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కేరళ ప్రభుత్వం ఇచ్చే ఒ.ఎన్.వి.కురూప్ పురస్కారం వైరముత్తుకు ప్రకటించినప్పుడు నటి పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. మీటూ ఆరోపణలు వచ్చిన వ్యక్తికి ఈ పురస్కారం ఇవ్వడం ఆ అవార్డుకు అవమానం అని బహిరంగంగానే చెప్పారు.

జ్ఞానపీఠ పురస్కారం అనేది దేశ అత్యున్నత సాహితీ పురస్కారం. అటువంటి పురస్కారానికి రచయిత వాసితోపాటు ఆయన వ్యక్తిగత ప్రవర్తన కూడా ముఖ్యం అవ్వాలి. రాతల్లో చైతన్యం చూపి, వ్యక్తిగత జీవితంలో దారుణంగా ప్రవర్తించేవారికి పురస్కారాలు ఇవ్వడం అంటే, అది ఆ పురస్కారానికున్న విలువను, గతంలో ఆ అవార్డు అందుకున్నవారి విలువనూ తగ్గించినట్టే. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం అందరం ఖండించాల్సిన విషయం. పురస్కారానికి వైరముత్తుపై ఆరోపణలే అడ్డా అనుకుంటే, ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలాక ఆయనకు ఆ పురస్కారం ఇవ్వొచ్చు.

- విశీ(వి.సాయివంశీ)

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page