వయసు కేవలం సంఖ్యే
- SATYAM DAILY
- 6 hours ago
- 2 min read
విరాట్ నుంచి వైభవ్ వరకు ఐపీఎల్ చెప్పిన గొప్ప పాఠం!

వయసు కేవలం సంఖ్య మాత్రమేనని విరాట్ కోహ్లీ చూపిస్తే, అదే విషయాన్ని మరో కోణంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా నిరూపించాడు. ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ 776 పరుగులు సాధించాడు. అత్యధిక సిక్సర్లు కొట్టాడు. 237 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్‌ను చూసి క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అసాధారణమైన షాట్ సెలెక్షన్, అద్భుతమైన టైమింగ్, అపారమైన ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు అతడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి.
97, 96 పరుగులు.. పరిపక్వతకు నిదర్శనం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం ఒక షాట్ దూరంలో క్రిస్ గేల్ అత్యంత వేగవంతమైన శతకం రికార్డును అందుకోలేకపోయాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై చేసిన 96 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా సాగింది. అవసరమైన చోట ఓపిక, జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడే పరిపక్వతను ప్రదర్శించాడు. ఇక్కడ ఒక విషయం మళ్లీ గుర్తు చేసుకోవాలి.. అతడి వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. 37 ఏళ్ల వయసులోనూ విరాట్ కోహ్లీ అదే ఆకలి, అదే అంకితభావంతో పరుగులు సాధిస్తున్నాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై 42 బంతుల్లో అజేయంగా 75 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గత ఏడాది ఫైనల్లో కూడా అతడే అత్యధిక స్కోరు నమోదు చేశాడు.
ఐపీఎల్ 2026 ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. 37 ఏళ్ల విరాట్ కోహ్లీ వయసు అడ్డంకి కాదని నిరూపిస్తే, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయసు పరిమితి కాదని చెప్పకనే చెప్పాడు. ఒకరు అనుభవానికి ప్రతీక. మరొకరు భవిష్యత్తుకు ప్రతీక. అందుకే ఈ సీజన్ ముగిసే సమయానికి క్రికెట్ ప్రపంచం ఒకే మాట చెబుతోంది.. ఆర్సీబీ టైటిల్ గెలిచింది.. కానీ ఐపీఎల్ 2026ను వైభవ్ సూర్యవంశీ దోచేశాడు!.
భారత బ్యాటర్ల దశాబ్దం మొదలైందా?
ఒకప్పుడు ఐపీఎల్‌లో విదేశీ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించేవారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 2026 సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన టాప్-5 ఆటగాళ్లలో నలుగురు భారతీయులే. వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యా, అభిషేక్ శర్మ, ఉర్విల్ పటేల్ ఈ జాబితాలో ఉన్నారు. ఇది భారత క్రికెట్‌కు శుభసూచకం. రాబోయే కాలంలో భారత జట్టుకు భారీ షాట్లు కొట్టగల బ్యాటర్ల కొరత ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
బౌలింగ్‌లో ఇంకా విదేశీయుల హవా
అయితే బౌలింగ్ విభాగంలో విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధిక వికెట్లు సాధించిన టాప్-10 బౌలర్లలో ఐదుగురు విదేశీయులే. కగిసో రబడా అగ్రస్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలిచాడు. అయితే భారత పేస్ బౌలింగ్ విభాగంలో ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అన్‌షుల్ కాంబోజ్, సాకిబ్ హుస్సేన్ వంటి కొత్త ప్రతిభావంతులు వెలుగులోకి రావడం సానుకూల పరిణామం.
- సత్యం స్పోర్ట్స్ డెస్క్






Comments