top of page

మంచు కొండల్లో మహాద్భుతం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read
  • 11578 అడుగుల ఎత్తులో భారీ టన్నెల్ నిర్మాణం

  • ఐదేళ్ల కఠిన శ్రమతో రూపుదిద్దుకున్న జోజిలా సొరంగం

  • కశ్మీర్ల - లద్దాఖ్ అనుసంధానం ఎట్టకేలకు సాకారం

  • ప్రజా, సైనిక అవసరాలకు కీలక ఆధారం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఆకాశాన్ని తాకుతున్నట్లు సమున్నతంగా నిలిచిన మంచు శిఖరాలు. అభేద్యంగా, దుర్గమంగా ఉండే హిమాలయ పర్వతశ్రేణులు దేశం ఆవల ఉన్న శత్రువులకు కొరుకుడు పడకపోవడమే కాదు.. సరిహద్దుల ఈవల పర్వత సానువుల్లో నివసించే భారతీయుల జీవనాన్ని కూడా కష్టతరం చేస్తుంటాయి. మంచు ఖండాల మధ్యే ఉన్న కశ్మీర్, లద్దాఖ్ మధ్య సంబంధాలే లేకుండా చేస్తున్న అతి ఎత్తయిన హిమవత్పర్వతాలను చీలుస్తూ వాటి కింద నుంచి రాజమార్గాలు నిర్మించి లద్దాఖ్ వంటి దుర్గమ ప్రాంతాలను భారతీయ జనజీవన స్రవంతికి చేరువ చేస్తున్న మన ఇంజినీరింగ్ నిపుణ్యం మరో అద్భుతం చేసింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను కలిపే జోజిలా టన్నెల్‌ను సాకారం చేసింది. దాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మÖడు రోజుల క్రితమే ప్రారంభించారు. దేశ రక్షణ, రవాణా రంగాల్లో ఇదో అపూర్వ విజయం. సముద్ర మట్టానికి ఏకంగా 11,578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగమార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన అతి పొడవైన టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అత్యంత పొడవైన టూ వే టన్నెల్‌లో రికార్డు సృష్టించింది. ప్రధాన సొరంగమార్గం పొడవు 13.153 కిలోమీటర్లు కాగా అప్రోచ్ రోడ్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ పొడవు 30.894 కిలోమీటర్లుగా ఉంది. గతంలో జోజిలా కనుమ(పాస్) శీతాకాలంలో పూర్తిగా మÖసుకుపోయేది. ఆ సీజనులో సంభవించే భారీ మంచు తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వల్ల రవాణా ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు. ఫలితంగా లద్డాఖ్ ప్రాంతం ఏటా సుమారు ఆరు నెలల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయేది. జోజిలా టన్నెల్ నిర్మాణం వల్ల ఆ బాధ తప్పిపోయింది. శ్రీనగర్ - లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా నిరంతరాయంగా, సురక్షితంగా రాకపోకలు సాగించవచ్చు.

ఇంజినీరింగ్ అద్భుతం

టన్నెల్ నిర్మించిన జోజిలా కనుమ ప్రాంతాలు ఏడాదిలో వంద రోజుల పాటు మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతýతో మంచుతో కప్పబడి ఉంటాయి. మంచు తుపాన్లు వంటి అత్యంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఈ కఠిన పరిస్థితుల్లో సరిహద్దు భద్రతాదళాలు, భారత సైన్యం తమకు అవసరమైన భారీ ట్యాంకులు, ఆయుధ, ఆహార సామగ్రి తరలింపు అతికష్టంగా ఉండేది. అటువంటి తరుణంలో ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు 2020లో జోజిలా టన్నెల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2025 మార్చి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి అయ్యాయి. 1200 మందికి పైగా కార్మికులు ఆధునిక పరికరాలతో రాత్రింబగళ్లు శ్రమించారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఐదు భారీ హిమపాతాలు సంభవించినా వెరవలేదు. మూడేళ్ల కిందట భారీ హిమపాతంలో చిక్కుకున్న 172 మంది నిర్మాణ కార్మికులను భారత సైన్యం ప్రాణాలకు తెగించి రక్షించింది.

సైన్యానికి లైఫ్‌లైన్

ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడం వల్ల లద్దాఖ్ ప్రాంతంలో పర్యాటక, ఆర్థిక రంగాలు పురోగతి సాధిస్తాయి. వీటితో పాటు అమర్‌నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ఈ మార్గంలో ప్రత్యేక పార్కింగ్ ప్లేస్‌లు, అత్యవసర వైద్య సదుపాయాలు, అధునాతన మౌలిక వసతులు కూడా కల్పించారు. మన రక్షణ రంగానికి జోజిలా టన్నెల్ రక్షణ కవచం లాంటిది. చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దులు పంచుకునే లద్దాఖ్ ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఈ టన్నెల్ కల్పిస్తుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ద్రాస్, కార్గిల్, లేహ్ వంటి వ్యూహాత్మక, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు ఇది రక్షణ కవచంలా ఉంటూ శీతాకాలంలో కూడా భారీ యుద్ధ సామాగ్రిని, లాజిస్టిక్స్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరిహద్దులకు తరలించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రమాదకరమైన మంచుకొండల్లో ప్రయాణించడానికి పట్టే సమయం కూడా తగ్గిపోనుంది. సోన్‌మార్గ్ సమీపంలోని బాల్తాల్ వెస్ట్ పోర్టల్ నుంచి ద్రాస్-కార్గిల్ ప్రాంతంలోని మీనమార్గ్ ఈస్ట్ పోర్టల్ వరకు జోజిలా టన్నెల్ విస్తరించి ఉంది. దేశ భద్రతతో పాటు టూరిజం విస్తరణకు తద్వారా స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాల వృద్ధికి ఇది తలుపులు తెరుస్తుంది. లద్దాఖ్‌లో ఉన్న సైనికులకు ఏడాదికి సరిపడా రేషన్, ఇంధనం, మందులను ముందే స్టాక్ చేయాల్సి వచ్చేది. వీటి రవాణాకు ఎయిర్‌ఫోర్స్ విమానాలపై ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు నేషనల్ హైవే వన్‌పై ఈ టన్నెల్ ద్వారా చాలా సులువుగా తరలించవచ్చు. ప్రస్తుతం జోజిలా పాస్ దాటేందుకు మÖడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్‌లు ఉంటే రోజంతా పట్టేది. టన్నెల్ మార్గం ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయంలో 20 నిమిషాలకు తగ్గిపోతుంది. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత దేశ సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కార్గిల్, లేహ్, సియాచిన్ లాంటి సున్నితమైన ప్రాంతాలకు సైన్యాన్ని, లాజిస్టిక్ట్స్‌ను, యుద్ధసామగ్రిని నిరంతరం పంపడానికి ఈ టన్నెల్ కీలకమార్గం కానుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page