top of page

వాహనరంగంలో ఇథనాల్ మంటలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 10 hours ago
  • 3 min read
  • వాహన ఇంజన్లను తుప్పుపట్టిస్తున్న ఈ20 ఇంధనం

  • రేటు తగ్గినా.. వేలకు వేలు రిపేర్ల దరువు

  • తగిన ప్రత్యామ్నాయాలు లేకుండానే కేంద్రం పరుగులు

  • ఇథనాల్ పరిశ్రమలకు మేలు చేసేందుకేనన్న ఆరోపణలు

  • ఈ చర్యలు ఆహార కొరతకు దారితీసే ప్రమాదం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఉన్నదాంతోనే పడలేక చస్తుంటే.. ఇప్పుడు దాని జేజమ్మను తీసుకొచ్చి మన నెత్తిన మీద కూర్చోబెట్టినట్లుంది కేంద్ర ప్రభుత్వ తీరు. ఈ20 పెట్రోల్‌తోనే చేతిచమురు వదులుతుంటే.. దాని బాబులాంటి ఈ85 పెట్రోల్‌ను దేశంలోని పెట్రోలియం సంస్థలు మార్కెట్లోకి తీసుకొచ్చేశాయి. నాలుగు రోజుల క్రితమే చెన్నై, ఢిల్లీల్లో వీటి రిటైల్ అవుట్‌లెట్లు ప్రారంభమయ్యాయి. తన చర్యలకు మద్దతుగా ప్రభుత్వం పెట్రోల్ చౌక అయిపోయినట్లు ప్రచారం చేసుకుంటున్నది. కానీ పది ఇరవై రూపాయలకు ఆశపడితే వందలు, వేలు ఖర్చయ్యే ప్రమాదముందన్న విషయాన్ని మాత్రం చెప్పడంలేదు.. అనుభవమైతే గానీ ఆ విషయం ప్రజలకు తెలియడంలేదు. ఈ85 పెట్రోల్‌ను లీటరుకు రూ.82.12 ధరతో అమ్మకాలు ప్రారంభించారు. అంటే సాధారణ పెట్రోల్ కంటే సుమారు రూ.20 తక్కువన్న మాట. ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 ఇంధన అందుబాటులో ఉంది. ఇందులో 20 శాతం ఇథనాల్ కలిసి ఉంటుంది. ఈ85 ఇంధనాన్ని సాధారణ పెట్రోల్ కార్లకు ఉపయోగించే అవకాశం లేదు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు మాత్రమే సురక్షితంగా నడుస్తాయి. ఇథనాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్ ప్రత్యేకంగా రూపొందించబడి ఉండాలి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న చాలా పెట్రోల్ కార్లు, ఇతర వాహనాలు ఈ20 వరకు మాత్రమే మద్దతు ఇస్తాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకుండానే ఈ85 ఇంధనాన్ని తీసుకురావడం విమర్శలకు తావిస్తున్నది. పశ్చిమాసియా యుద్ధం, ఇతర అంతర్జాతీయ పరిణామాల కారణంగా ముడిచమురు దిగుమతుల ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నది. మొదట్లో పది శాతం ఇథనాల్ మిక్స్ చేసి ఈ10 ఇంధనం అమ్మకాలు చేపట్టింది. రెండు నెలల క్రితమే ఈ20 అమ్మకాలకు మారింది. దీన్ని దశలవారీగా పెంచుకుంటూ దిగుమతుల బిల్లు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగమే ఈ85 ఇంథన మార్కెటింగ్. అయితే తన భారం తగ్గించుకునే యావలో ఉన్న ప్రభుత్వం సామాన్య వాహన చోదకులపై పడే ఆర్థిక భారాన్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ కలిపిన ఇంధన వినియోగానికి అనువుగా లేని వాహనాల సంగతి పట్టించుకోకుండా కేంద్రం తన సౌలభ్యమే చూసుకుంటున్నది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగానికి అనుకూలంగా లేని వాహనాల చోదకులకు ఈ20 పెట్రోల్ చుక్కలు చూపిస్తున్నది. వాహనాలు మరమ్మతులకు గురై వేలకు వేలు చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తున్నది.

ఆపేయండి బాబో..

ఈ క్రమంలో ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ20 విక్రయాలు ఆపేసి గతంలో మాదిరిగా ప్యూర్ లేదా ఈ10 పెట్రోల్ అంటే తక్కువ ఇథనాల్ కలిపిన వేరియంట్లను తిరిగి ప్రవేశపెట్టాలని పాత వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ20 పెట్రోల్ పుణ్యాన రిపేర్లకే వేలకువేలు ఖర్చవుతున్నదని దండం పెట్టేస్తున్నారు. కొత్త వాహనాలు కొనుక్కోలేక పాతవాటితోనే సర్దుకుపోతున్న కోట్లాది వాహన యజమానులు రిపేర్లు, మైలేజ్ డ్రాప్ సమస్యలతో చుక్కలు చూస్తున్నట్లు సర్వే వెల్లడైంది. దేశంలో రోడ్డెక్కుతున్న ప్రతి పాత వాహనం నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నది. 2022.. అంతకుముందు కొన్న పెట్రోల్ వాహనాల యజమానుల గుండెల్లో ఇథనాల్ మంటలు రేగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ తప్పనిసరి చేసినప్పటినుంచి సగానికి పైగా వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా 316 జిల్లాల్లోని సుమారు 42వేల మంది పాత వాహనదారులను ఈ సర్వే నిర్వాహకులు కదిలించినప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2025 ప్రారంభం నుంచే సుమారు 52 శాతం వాహనదారులు అదనపు రిపేర్లు, పెట్రోల్ ఖర్చులకు ఏకంగా రూ.5వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చు పెట్టారట. వీరిలో తొమ్మిది శాతం మందికి ఆ నష్టం రూ.25వేలు దాటేసింది. కేవలం 11శాతం మందే ఎలాంటి అదనపు భారం పడలేదని ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే.. కావాలంటే రెండు రూపాయలు ఎక్కువైనా భరిస్తాం.. ఇథనాల్ కలపని పెట్రోలే అందుబాటులో ఉంచాలని 31 శాతం మంది మొరపెట్టుకున్నారు. మరో 24 శాతం మంది సమాన ధర ఉంటే పాత పెట్రోల్‌కే ఓటేస్తామంటున్నారు. మొత్తంగా 55 శాతం వాహనదారులు పాత పెట్రోల్ తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం 12 శాతం వాహనదారులే ఈ20 పెట్రోల్‌తో హ్యాపీగా ఉన్నారని తేలింది. కానీ ప్రభుత్వం వాహనదారులు గోడు పట్టించుకునే స్థితిలో లేదు. ఇంధనంలో ఇథనాల శాతాన్ని పెంచుకుంటూ పోతున్నది. గత నెలలోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ22 నుంచి ఈ30 ఇథనాల్ విక్రయాలకు కూడా అనుమతి ఇచ్చేసింది. పైగా సుప్రీంకోర్టు కూడా వినియోగదారుల ఇష్టాయిష్టాలు దేశ ఇంధన విధానాన్ని శాసించలేవని తేల్చి చెప్పేసింది. అంటే రానున్న కాలంలో ఇప్పుడు హ్యాపీగా ఉన్న ఈ20 వాహనదారులు కూడా అవస్థలు పడక తáప్పదనమాట. పెట్రోలులో ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్న వాహనాలు అందుకు సపోర్ట్ చేయవు. మధ్య తరగతి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ కుటుంబానికి చెందిన కంపెనీలు ఇథనాల్ ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఆ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వాహనాల విషయంలో తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇథనాల్‌తో నష్టం ఏమిటి?

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల వాహనాల ఇంజన్లపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. స్వభావరీత్యా ఇథనాల్ తేమను ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇంజన్ లోపలి భాగాలు తుప్పుపట్టే ప్రమాదం ఉంటుంది. పాత వాహనాల్లో ఉపయోగించే రబ్బరు పైపులు, గాస్కెట్లు, సీళ్లు ఇథనాల్ ప్రభావంతో త్వరగా అరిగిపోతాయి లేదా పగిలిపోతాయి. కార్బొరేటర్, ఫ్యూయల్ ఇంజెక్టర్లు త్వరగా పాడైపోతాయి. ఫలితంగా మరమ్మతు ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ముఖ్యంగా 2000 సంవత్సరానికి ముందు తయారైన వాహనాలు ఈ మిశ్రమ ఇంధన వినియోగానికి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఇథనాల్‌లో ఉండే శక్తి సాంధ్రత పెట్రోల్‌తో పోలిస్తే దాదాపు 30 శాతం తక్కువగా ఉంటుంది. అంటే ఈ20 ఇంధన వినియోగించే వాహనాలు స్వచ్ఛమైన పెట్రోల్‌తో పోలిస్తే ఆరు నుంచి పది శాతం వరకు తక్కువ మైలేజీ ఇస్తాయి. దీనివల్ల సగటు వాహన వినియోగదారులపై ఖర్చుల భారం పడుతుంది. పంప్‌సెట్లు, జనరేటర్లు, వ్యవసాయ యంత్రాలు వంటి చిన్న ఇంజన్లు సైతం ఇథనాల్ మిశ్రమాన్ని తట్టుకోలేక పాడవుతున్నాయి.

పర్యావరణానికి హాని

ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ప్రభుత్వం చెబుతున్నా ఇథనాల్ తయారీ పెరిగితే అది మరోవిధంగా పర్యావరణానికి హాని చేస్తుందంటున్నారు. ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, వరి వంటి ఆహార పంటలు ఉపయోగిస్తారు. ఇంధన అవసరాల కోసం ఈ పంటలను మళ్లిస్తే దేశంలో ఆహార సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా చక్కెర, ధాన్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఇది నేరుగా ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. చెరకు తోటలకు అధిక నీరు అవసరమవుతుంది, దీని వల్ల భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇథనాల్ కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నదులు, చెరువులను ఇప్పటికే కలుషితం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇథనాల్ మిశ్రమం దహనమయ్యేటప్పుడు కొన్ని హానికర రసాయనాలు వెలువడతాయి, ఇవి వాయు కాలుష్యాన్ని పెంచి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పెట్రోల్ బంకుల్లో ఉపయోగించే నిల్వ ట్యాంకులు, పైపులైన్లు ఇథనాల్ మిశ్రమానికి తట్టుకునేలా తయారుకాకపోతే త్వరగా పాడవుతాయి. వాటిని ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయడానికి భారీ పెట్టుబడి అవసరమవుతుంది. ఆ భారం చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది. దేశంలో మధ్యతరగతి వినియోగిస్తున్న వాహనాలపై ఇథనాల్ ప్రభావం ఒక బాంబు విధ్వంసంతో సమానమని నిపుణులు అంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page