సెలక్షన్‌లో అవకతవకల సిక్సర్
- BAGADI NARAYANARAO

- 7 hours ago
- 2 min read
ఏసీఏ ఎంపికలపైనా అనుమానాలు
నకిలీ ధ్రువపత్రాలతో జట్టులోకి ఎంట్రీ
ఆడకుండానే క్రికెట్ జట్టులోకి చోటు
లోకల్ ముసుగులో నాన్‌లోకల్స్
వివాదంలో అండర్-16 ప్రోపబుల్స్ జాబితా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా క్రికెట్ సంఘం క్రీడాకారుల ఎంపికలో ప్రతీసారి పక్షపాతానికి పాల్పడుతుందని, పక్క జిల్లా నుంచి ప్లేయర్స్‌ను తెచ్చి ఆడిస్తుందని వచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పంపించిన సెలక్టర్లు సైతం అదే పనికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లా క్రికెట్ సంఘానికి నూతన కార్యవర్గం వచ్చిన తర్వాత ఏసీఏ త్రీమెన్ కమిటీని విచారణకు నియమిస్తూనే సెలక్షన్లు తాము నిర్వహిస్తామని పేర్కొంది. ఈ మేరకు వచ్చిన సెలక్టర్లు ఏం చేశారో తెలుసుకుందాం.
ఈ నెల 4,5 తేదీల్లో నిర్వహించిన అండర్-16 బాలురు, బాలికల క్రికెట్ జట్టుల ఎంపికకు జిల్లాకు పంపించిన నలుగురు సెలక్టర్లు స్థానికేతరులైన సీహెచ్ యోగిత్, బి.నరేంద్ర, కె.సాత్విక్, జి.రాకేష్‌తో పాటు స్టాండ్‌బైగా ఎంపికైన రోహన్ శ్రీనివాస్, మోహిత్ మణికంఠ, ఎస్.చరణ్‌రెడ్డి, జి.జోగేంద్రనాయుడుని ఎంపిక చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గత నెల 31, ఈ నెల ఒకటి తేదీల్లో జరగాల్సిన అండర్-16 బాలురు, బాలికల జట్టు ఎంపికలను వాయిదా వేస్తూ ఏసీఏ ఇంతకు ముందు ప్రకటన విడుదల చేసింది. ఆ ఎంపికలను జిల్లా క్రికెట్ సంఘం చేయడానికి వీళ్లేదని, ఏసీఏ స్వయంగా చేస్తుందని ప్రక£టించి ఈ నెల 4,5 తేదీల్లో జిల్లా ప్రోపబుల్స్‌తో జట్టును ఎంపిక చేశారు. కట్ చేస్తే ఏసీఏ పర్యవేక్షణలో నిర్వహించిన ఎంపికల్లో కూడా అవకతవకలు జరిగాయని జిల్లా క్రికెటర్స్ పేరెంట్ అసోసియేషన్ ఏసీఏకు బహిరంగ లేఖ రాసింది. ఎంపికలో జిల్లా క్రీడాకారులు కానివారిని ఎంపికచేసి జట్టును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన అండర్`16 బాలుర ఎంపికలో తీవ్రమైన అవకతవకలు జరిగాయనే ఆధారాలు ఇందుకు జత చేశారు. తుది జట్టులో కొందరు ఆటగాళ్లు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కాదనే వాదనను జిల్లా క్రికెట్ పేరెంట్ అసోసియేషన్ వినిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులుగా ఎంపిక కావడానికి పుట్టిన తేదీ, నివాస స్థలం, అర్హతకు సంబంధించిన నకిలీ పత్రాలను సమర్పించారని ఫిర్యాదులో పొందుపరిచారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన క్రీడాకారులను స్థానిక క్రీడాకారుడిగా చెప్ప్పుకోవడానికి నకిలీ ధ్రువపత్రాలతో ఎంపికలకు హాజరయ్యారని వీరు ఆరోపించారు. జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపికైన ఆటగాళ్ల జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ రికార్డులు, పాఠశాల రికార్డులు, ఇతర అర్హత పత్రాలను సరిచూడాల్సిన సెలక్టర్లు కేవలం లాబీయింగ్‌కు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని విమర్శలు ఉన్నాయి. జట్టులో ఎంపిక కోసం నకిలీ పత్రాలు సమర్పించినా, అవి అసలైనవేనని నిర్ధారించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.

ఎంపికలకు హాజరు కాకుండానే తుది జట్టులో కె.సాత్విక్ అనే క్రీడాకారుడి పేరు అడ్డదారిలో నమోదుచేసి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు.
ఎంపిక సమయంలో హాజరయ్యే క్రీడాకారులను ఏ, బీ టీంలుగా విడదీసి పోటీ పెట్టారు. ఏ,బీ టీంలో లేని కె.సాత్విక్‌ని జట్టు తుది జాబితాలో చేర్చడంపైనా క్రీడాకారుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్ల నుంచి విజయనగరానికి ప్రాతినిధ్యం వహించిన సీహెచ్ యోగిత్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జట్టులో సభ్యుడిగా చేర్చారు.
యోగిత్ ఇచ్చిన ఫారం-5 నకిలీదని ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాకుళం జీజీహెచ్ (రిమ్స్)లో జన్మించినట్టు ఒక జనన ధ్రువీకరణను ఎంపికల సమయంలో సబ్మిట్ చేశాడు. జీజీహెచ్ జారీ చేసినట్టు చెబుతున్న జనన ధ్రువీకరణలో యోగిత్‌ను యోజిత్‌గా చూపించారు. జనన ధ్రువీకరణ పత్రంలో తెలుగుకు బదులుగా కొన్ని చోట్ల హిందీ భాష ముద్రించి ఉంది.

ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఫారం-5 (జనన ధ్రువీకరణ)లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఫార్మాట్ సాధారణంగా సంవత్సరం, జిల్లా కోడ్, హాస్పిటల్ కోడ్, సీక్వెన్స్ నెంబర్ రూపంలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ (బి-2023:28-90347-004802)పై కూడా సందేహం వ్యక్తమవుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్‌లో బి`2023 నమోదు చేసిన సంవత్సరాన్ని సూచిస్తుంది. వాస్తవంగా యోగిత్ జనన నమోదు 27 డిసెంబర్ 2011. కాగా రిజిస్ట్రేషన్‌లో 2023గా నమోదైంది. యోగిత్ జత చేసిన జనన ధ్రువీకరణలో పుట్టిన ఆసుపత్రి కోడ్ తప్ప్పుగా నమోదుచేసి ఉంది. సర్టిఫికేట్‌లో ఆసుపత్రి కోడ్ 90347గా చూపించారు. వాస్తవానికి రిమ్స్ జనరల్ హాస్పిటల్ కోడ్ 90163. దీంతో ఈ జనన ధ్రువీకరణ నకిలీదని జిల్లా క్రికెట్ పేరెంట్ అసోసియేషన్ ఆధారాలతో ఏసీఏకు అందించింది.






Comments