top of page

అమ్మమాట.. సంస్కరణ బాట!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 4 min read
  • ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ సరికొత్త చరిత్ర

  • ప్రధానోపాధ్యాయుడు భరద్వాజ్ ఆధ్వర్యంలో కొత్త సొబగులు

  • సొంత లాసా ఫౌండేషన్ నుంచి నిధులు

  • ఏడాదిలోనే రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు

  • కార్పొరేట్ స్థాయిలో సర్కారు స్కూల్లో ఏసీ తరగతి గది

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

‘ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా.. అటో ఇటో ఎటోవైపు’.. అన్నట్లు వ్యవస్థలు కుళ్లిపోయినప్పుడు వాటిని గాడిలో పెట్టి చక్కదిద్దేందుకు ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు వస్తారన్నది ఒక సినీకవి రాసిన ఈ పాట పరమార్థం. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూలు విషయంలో ఇప్పుడు అదే జరుగుతున్నది. శతాబ్దికిపైగా ఉత్కృష్టమైన చరిత్ర కలిగినా.. మిలిగిపోయే దుస్థితిలో పడిన ఈ పాఠశాలను ఉద్ధరించేందుకు ఒక్కడొచ్చాడు.. వచ్చిన వెంటనే రంగంలోకి దిగారు. వేలాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు జీవితాన్నిచ్చిన ఆ విద్యల ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా తన స్థాయిలోనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. శిథిల స్థితిలో ఉన్న భవనాలకు కొత్త సొబగులు అద్దడంతోపాటు.. నిర్వహణ లోపాలతో మలిగిపోతున్న పాఠశాల ప్రతిష్టను మళ్లీ దేదీప్యమానం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే కొన్నేళ్లుగా తిరోగమిస్తున్న ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల వెనుదిరిగి పురోగమన పథం పట్టింది. పాఠశాల ఆవరణ, భవనాలు కొత్తకళ సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల చేరికలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఈ మహత్తర ప్రయత్నం చేస్తున్నది ఆ పాఠశాల పూర్వ విద్యార్థే కావడం.. ఆయనే ప్రస్తుతం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దూసి సూర్యవిజయ భరద్వాజ్ కావడం విశేషం. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇదంతా చేస్తుండటం మరింత ప్రశంసనీయం.

గతమెంతో ఘనం

వాస్తవానికి ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూలు అంటే శ్రీకాకుళం నగరానికి ఒక ల్యాండ్‌మార్క్, ఒక గర్వకారణం. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పాఠశాలకు శతాబ్దికిపైగా ఉజ్వలమైన చరిత్ర ఉంది. మున్సిపల్ యాజమాన్యంలో నడిచే ఈ పాఠశాలను మొదట మల్టీపర్పస్ అంటే బహుళ ప్రయోజన విద్య అందించే పాఠశాలగా ఏర్పాటు చేశారు. అందుకు తగినట్లే సాధారణ సబ్జెక్టులతోపాటు టైపింగ్, వాణిజ్య గణితం, ఉర్దూ వంటి పాఠ్యాంశాలు కూడా చెప్పేవారు. ఆ తర్వాత కాలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావును స్మరించుకునేలా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌గా నామకరణం చేశారు. రెగ్యులర్ తరగతులు.. అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన చేసేవారు. ఎందరో దిగ్ధంతులైన ఉపాధ్యాయులు ఈ పాఠశాలల్లో చేయగా, వారి మార్గదర్శనంలో మరెంతో మంది విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నతస్థానాలను అలంకరించి ఈ పాఠశాలకు, శ్రీకాకుళం నగరానికి వన్నె తెచ్చారు. జిల్లాకు సంబంధించి మొదటిసారి రాష్ట్రపతి అవార్డు అందుకున్న వరుఝల నరసింహం, ఈశ్వర సత్యనారాయణ శర్మ, దవే లక్షీదత్తు వంటి మహామహులు ఈ పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్ధులు గరిపారు. కాగా ఇక్కడ చదువుకుని వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నతస్థానాలు అధిరోహించిన వారిలో ఈమని అనంత సత్యనారాయణ శర్మ (ఈఏఎస్ శర్మ) ఐఏఎస్ స్థాయికి ఎదగ్గా లజపతిరాయ్ డాక్టర్ BRఅంబేద్కర్ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా చేశారు. బొంతా ప్రసాద్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచఈఎల్ ఛైర్మన్‌గా పనిచేశారు. మెట్ట రాధాకృష్ట పోలీసు శాఖలో ఐజీ స్థాయికి ఎదగారు. ఇంత ఉత్కృష్టమైన చరిత్ర కలిగిన ఎన్టీఆర్ స్కూలు ప్రభుత్వాల నిర్లిప్తతతోనో.. ఉపాధ్యాయుల నిరాసక్తతోనో.. మరే కారణాలతోనో.. క్రమంగా తిరోగమనంలో పడిపోయింది. నాటి వెలుగుల చరిత్ర మసిబారిపోయింది. ఒకప్పుడు సుమారు రెండువేల మంది విద్యార్థులు, ఒక్కో తరగతిలో పదుల సంఖ్యలో సెక్షన్లతో కళకళలాడిన పాఠశాలల్లో దాదాపు ఏడాదిన్నర క్రితం నాటికి హీనంగా 200 మంది విద్యార్థుల స్థాయికి పతనమైంది.

జీవితం ఇచ్చిన స్కూలు కోసం..

ఈ మహా పతనంతో ఘనమైన ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ఇక చరిత్ర గతిలో కలిసిపోతుందని అభిమానులందరూ బాధపడుతున్న సమయంలో.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన దూసి సూర్యవిజయ భరద్వాజ్ పాఠశాల పతనాన్ని అడ్డుకనేందుకు ఒక ధ్వజంలా నిలబడ్డారు. వచ్చినప్పటినుంచీ పాఠశాల అభివృద్ధితోపాటు ప్రతిష్టను పునరుద్ధరించే చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన ఈ పాఠశాలకు హెడ్మాస్టరుగా రావడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అమ్మ మాట మేరకు.. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఈ పాఠశాలకు బదిలీ చేయించుకుని వచ్చారు. వాస్తవానికి మొదట ఆయనకు ఇక్కడకు రావడంపై ఆసక్తిలేదు. దీనికిముందు అరసవల్లి హైస్కూలు ప్రధానోపాధ్యాయుడుగా ఆయన పనిచేస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో ఎన్టీఆర్ ఉన్నత పాఠశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఇష్టంలేక, వెళ్లనని డీఈవోకు కూడా చెప్పేశారు. ఆ తర్వాత తన తల్లి సీతాలక్ష్మితో మాట్లాడుతున్న క్రమంలో ఈ విషయం ఆమెకు చెప్పారు. దాంతో ఆమె బాధపడ్డారు. ఎందుకంటే గతంలో ఆమె ఎన్టీఆర్ హైస్కూల్లోనే 1975 నుంచి సుమారు 30 ఏళ్లు టీచర్‌గా సేవలందించారు. కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ స్కూల్ ఉద్యోగమే తమను నిలబెట్టిందన్న కృతజ్ఞతాభావం ఆమెలో ఉంది. అటువంటి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వెళ్లే అవకాశం లభించినా కుమారుడు వెళ్లకపోవడం ఆమెను నిరాశపర్చింది. తమను నిలబెట్టిన పాఠశాల ఇప్పుడు దీనావస్థలో ఉండటం కూడా ఆమెను బాధపెట్టింది. అందుకే వీలుంటే.. నిర్ణయం మార్చుకుని ఎన్టీఆర్ హైస్కూలుకు బదిలీ చేయించుకుని ఆ విద్యాలయానికి చేతనైన సేవ చేయాలని కుమారుడు భరద్వాజ్‌కు సూచించారు. భరద్వాజ్ కూడా ఆ పాఠశాల విద్యార్థే. 1989 నుంచి నాలుగేళ్లు అంటే ఏడు నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అమ్మ మాట ప్రకారం తన నిర్ణయాన్ని మార్చుకుని కౌన్సెలింగ్ ద్వారా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూలుకు బదిలీపై వచ్చారు. అప్పటినుంచీ పాఠశాల దశ మార్చేందుకు నడుంకట్టారు. ఒకవైపు పాఠశాల అభివృద్ధి, మరోవైపు బోధన విధానాల మెరుగు, ఉత్తమ ఫలితాల సాధన దిశగా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వంపై ఆధారపడకుండా..

పాఠశాల నిర్వహణ, అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమÖలకు సరిపోక చాలాకాలం నుంచి భవనాలు దెబ్బతినడం ప్రారంభించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆధారపడితే ఏమీ చేయలేమని గ్రహించిన భరద్వాజ్ నిధుల సమీకరణ మార్గాలను అన్వేషించారు. చివరికి సేవా కార్యక్రమాల కోసం తానే స్థాపించిన లవ్ ఆల్.. సెర్వ్ ఆల్ ఫౌండేషన్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఫౌండేషన్ నుంచి నిధులు కేటాయింపజేశారు. ఏడాది కాలంలోనే ఏకంగా రూ.20 లక్షల లాసా నిధులు వెచ్చించి పాఠశాలకు కొత్త సొబగులు అద్దారు. ఇంతవరకు కార్పొరేట్ విద్యాసంస్థల కే సాధ్యమైన ఏసీ తరగతి గదిని తొలిసారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సమకూర్చారు. ఇందుకోసం రూ.4 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం దీన్ని ప్రత్యేక తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. మరో నాలుగైదు రూములను ఏసీ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భరద్వాజ్ వెల్లడించారు. స్టాఫ్‌కు వాష్‌రూము సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించి కొత్తగా నిర్మించారు. అలాగే విద్యార్థుల వాష్‌రూములకు మరమ్మతులు చేయించారు. పూర్వవిద్యార్థుల విరాళాలతో ఏర్పాటు చేసిన విద్యార్థుల భోజనశాల ఆవరణను లాసా నిధులతోనే అభివృద్ధి చేసి టైల్స్ వేయించారు. కొన్నిచోట్ల ఫ్లోరింగ్స్ వేయించారు. తాగునీటి ట్యాంకులను క్లీన్ చేయించారు. ఓపెన్ డయాస్(వేదిక) కూడా సమకూర్చారు. ఆడియో సిస్టమ్, సీసీటీవీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.

బోధన సంస్కరణలు

మరోవైపు అడ్మిషన్లు తగ్గిపోయి, ఫలితాలు పడిపోయి పతనావాస్థకు చేరుకున్న బోధనా వ్యవస్థను సంస్కరించేందుకు అదే పట్టుదలతో పనిచేస్తున్నారు. మొదట పాఠశాల టీచర్లతో మాట్లాడి ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించేలా, జవాబుదారీతనం అలవర్చారు. అందరితోనూ చర్చిస్తూ, కలుపుకొనిపోతూ తన కృషికి అందరూ సహకరించేలా మలచుకున్నారు. గతంలో హైస్కూల్‌గా ఆరు నుంచి పదో తరగతి వరకే ఉండేది. భరద్వాజ్ వచ్చిన తర్వాత గత విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఐదు తరగతులను కూడా ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య కూడా ఈయన వచ్చేనాటికి 200 మాత్రమే ఉండగా.. ఏడాదిలోనే 400కు పెరిగింది. ఈ ఏడాది అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. 150 మంది విద్యార్థులు కొత్తగా చేరితే వారిలో సగానికిపైగా విద్యార్థులను వారి తల్లిదండ్రలే స్వచ్ఛందంగా తీసుకొచ్చి జాయిన్ చేయడం విశేషం. ఈ ఏడాది టెన్త్‌లో ఉత్తీర్ణత సుమారు 80 శాతం పెరగడమే దీనికి కారణమని భరద్వాజ్ చెప్పారు. విద్యాబోధన మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత పెంచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మిషన్`2027లో భాగంగా రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ ట్యూషన్ పేరుతో పాఠశాల ముగిసిన తర్వాత ప్రత్యేక తరగతులు చెప్పిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ముగ్గురు ట్యూటర్లను నియమించారు. వీరి వేతనాలను లాసా ఫౌండేషన్ నిధులతోనే చెల్లిస్తుండటం విశేషం. ఇక ఐదు నుంచి ఏడు తరగతుల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక జాతీయస్థాయిలో నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎనఎంఎంఎస్) పథకానికి ఎంపికయ్యేలా ఎనిమిదో తరగతి విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు.

కొసమెరుపు

ఒక చరిత్రాత్మక పాఠశాలకు తన ఆలోచనలు, నిర్ణయాలతో కొత్త చరిత్రను లిఖిస్తున్న భరద్వాజ్‌కు వందశాతం దృష్టిలోపం ఉంది. ఇది పుట్టుకతో సంక్రమించింది కాదు. మÖడో తరగతి చదువుతుండగా ఎనిమిదేళ్ల వయసులో దురదృష్టవశాత్తు వైకల్యం వచ్చింది. అయినా ఆయన ఏమాత్రం కుంగిపోలేదు. కష్టపడి చదువుకుని స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసి 2000లో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు. 2012లో అరసవల్లి పాఠశాల ఎచఎంగా పదోన్నతి పొందారు. 2025లో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూలు బాధ్యతలు చేపట్టారు. చదువుకున్న, పనిచేస్తున్న పాఠశాలకు ఉద్యోగిగానే కాకుండా వ్యక్తిగతంగానూ చేతనైన సాయం చేయాలన్న దృక్పథంతో లాసా ఫౌండేషన్ నిధులు మంజూరు చేయిస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ పాఠశాలను దత్తత తీసుకోగా.. దానికి అదనంగా లాసా డైమండ్ పాలిష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రాజెక్టు కింద ఐదేళ్లు లాసా ఫౌండేషన్ నిధులు అందుతాయని భరద్వాజ్ ‘సత్యం’ ప్రతినిధికి చెప్పారు. దృష్టిలోపం ఉన్నా.. మనోనేత్రంతో ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల చరిత్రను తిరగరాసే ప్రయత్నం ముదావహం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page