top of page

స్పీకర్ పదవి చేస్తే.. అంతే సంగతులు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 3 min read

  • ఆంధ్ర నేతలకు అచ్చిరాని రాజ్యాంగ పదవి

  • ఆ పదవి చేస్తే.. రాజకీయ జీవితం ముగిసినట్లే

  • నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇద్దరు స్పీకర్లను చుట్టుముట్టిన కేసులు

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరికి తప్పని ఓటములు

  • కోడెల ఆత్మహత్యకు పాల్పడితే.. తమ్మినేని పరార్


(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

రాజకీయాల్లో సెంటిమెంట్లకు, నమ్మకాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేయాలన్నా.. పదవులు చేపట్టాలన్నా.. అంతెందుకు రాజకీయంగా ఒక కొత్త అడుగు వేయాలంటే తిథులు, ముహూర్తాలు చూసిగాని కదలరు. అదేవిధంగా ఫలానా చోటుకు వెళ్తే పదవులు పోతాయని, దేవదాయశాఖ, స్పీకర్ పదవులు చేపట్టినవారికి ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉండదన్న నమ్మకాలు బలంగానే ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సెంటిమెంట్లు, నమ్మకాలు బ్రేక్ అయినా.. ఎక్కువ సందర్భాల్లో మాత్రం జరిగాయన్నది వాస్తవం. దీనికి తాజా నిదర్శనంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అరెస్టు, పరారీ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన 2019-24 మధ్య నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి రెండో స్పీకర్‌గా ఐదేళ్లు పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన కుటుంబంతోసహా భూకబ్జా కేసులో ఇరుక్కుని పరారు కావడం, అజ్ఞాతంలో ఉంటూనే తమపై కేసు ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం వంటి పరిణామాలతో ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే అంశం రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ కేసు విచారణ సందర్భంగా తప్పుడు డాక్యుమెంట్లతో భూమి అమ్మినట్లు చూపిస్తున్న దస్తావేజులు తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో ఉంటే ఆయన తండ్రి అయిన మాజీ స్పీకర్ సీతారాం, తల్లి వాణిలను ఎందుకు కేసులో నిందితులుగా చేర్చారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో స్పీకర్ల భవిష్యత్తుపై ప్రచారంలో ఉన్న సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది.

తొలి స్పీకర్ అలా.. రెండో స్పీకర్ ఇలా..

తెలంగాణ విడిపోయిన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2014లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కొత్త రాష్ట్రానికి తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాతే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2019 ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన నరసారావుపేటలో కోడెల ఓడిపోగా.. రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమిపాలైంది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకాపా హయాంతో మాజీ స్పీకర్ కోడెలపై పలు అవినీతి ఆరోపణలు మిన్నంటాయి. స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ నిధులను దుర్వినియోగం చేశారని, కోట్ల విలువైన ఆసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కుమారుడి షోరూముకు తరలించి అమ్ముకోవడంతోపాటు సొంత ఇంటికి కూడా తరలించుకపోయారన్న ఆరోపణలతో కోడెలపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అసెంబ్లీకి చెందిన కొంత ఫర్నిచర్‌ను తరలించిన మాట వాస్తవమేనని కోడెల సైతం అంగీకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశానని, వాటికి తగిన సొమ్ము చెల్లించేందుకు సిద్ధమని కూడా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఈ అంశం పెను దుమారం రేపడంతో, ఇతర కారణాలతో 2019 సెప్టెంబర్ 16న కోడెల ఆత్మహత్యకు పాల్పడటంతో రాష్ట్ర మొదటి స్పీకర్ చరిత్ర విషాదంతమైంది. కాగా 2019లో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీమంత్రి తమ్మినేని సీతారాం నవ్యాంధ్రప్రదేశ్‌లో రెండో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై.. 2024 ఎన్నికల వరకు పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగారు. కానీ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి మళ్లీ పోటీ చేసిన ఆయన కూడా ఓటమి పాలయ్యారు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు సుమారు రూ.4 కోట్ల విలువైన భూకబ్జా ఆరోపణలు తమ్మినేనితోపాటు ఆయన కుటుంబాన్ని చుట్టుముట్టాయి. ఈ కేసులో పోలీసులు ఆ కుటుంబం మొత్తాన్ని నిందితులుగా చేర్చడంతో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే కేసును ఎత్తివేయాలని కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ కేసులో ముందుముందు ఏం జరుగుతుందో.. తమ్మినేని కుటుంబం బయటపడుతుందో లేదో గానీ.. ఇప్పటికైతే రాజకీయంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోయినట్లే.

వారి విషయంలో మరోలా..

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచీ శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్లను అందించింది. యాదృచ్ఛికమే అయినా వీరిలో ముగ్గురు ఆ తర్వాత రాజకీయ జీవితాన్ని కోల్పోవడం జిల్లావాసులకు స్పీకర్ పదవి అచ్చిరాదన్న భావన కల్పిస్తోంది. ఆంధ్రరాష్ట్రం ఉన్నప్పుడు అంటే 1956కు ముందు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రొక్కం లక్ష్మీనర్సింహం దొర స్పీకర్ పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికైన తంగి సత్యనారాయణ తెలుగుదేశం తరఫున తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరి అప్రతిష్ట మÖటగట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులు నాదెండ్ల మంత్రివర్గంలో పని చేసినా.. అనంతరం ఎమ్మెల్యే అవకాశం గానీ, ఇతరత్రా రాజకీయ అవకాశాలు గానీ లభించలేదు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎచ్చెర్ల నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన మాజీమంత్రి కావలి ప్రతిభాభారతి 1999లో స్పీకర్ పదవి చేపట్టి 2004 వరకు కొనసాగారు. ఆ ఏడాది ఎన్నికల్లో మళ్లీ ఎచ్చెర్ల నుంచి, 2009, 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా రెండుసార్లు ఓటమి భారం తప్పలేదు. అప్పటినుంచి రాజకీయాల నుంచి విశ్రమించాల్సి వచ్చింది. ఈ ఉదంతాలను బట్టి రాష్ట్రంలో రాజకీయ నేతలకు స్పీకర్ పదవులు అచ్చిరావన్న నమ్మకం ఎప్పటికప్పుడు మరింత బలపడుతున్నది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page