ఇస్రోను ముంచుతున్న‘బ్రెయిన్ డ్రెయిన్’
- NVS PRASAD

- 21 hours ago
- 2 min read
భారీ జీతాల ఆకర్షణలో శాస్త్రవేత్తలు
గత కొద్ది నెలల్లోనే వందకు పైగా సైంటిస్టుల రాజీనామాలు, విఆరఎస్
కేంద్రం తీవ్ర అప్రమత్తత.. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ’ ఆమోదం తప్పనిసరి
ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరవడమే కారణమా?
ప్రభుత్వ విద్యావ్యవస్థ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు ఒకే తరహా సంక్షోభం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతం ఒక అసాధారణమైన సవాలును ఎదుర్కొంటోంది. ఏళ్ల తరబడి దేశ అంతరిక్ష రంగ పురోగతికి అహర్నిశలు శ్రమించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు వరుసగా ఇస్రోను వీడుతున్నారు. గత కొన్ని నెలల వ్యవధిలోనే వందమందికి పైగా సైంటిస్టులు రాజీనామాలు చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఇకపై ఏ శాస్త్రవేత్త రాజీనామా చేయాలన్నా నేరుగా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస’ అనుమతి తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది.
లాభాపేక్ష లేని ప్రయాణం నుంచి ప్రైవేట్ పోటీ వరకు...
1960ల కాలంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి తొలి రాకెట్ ప్రయోగంతో భారత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. 1972లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస’ ఏర్పడింది. మొదట్లో మన రోదసి కార్యక్రమాలు పూర్తి ఉచితంగా, దేశాభివృద్ధికి, ప్రజోపయోగార్థం మాత్రమే సాగాయి. ఆ తర్వాత ఇస్రో వాణిజ్య రంగానికీ తలుపులు తీసి, కమర్షియల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో తన లాంచ్ వెహికల్ టెక్నాలజీతో సత్తా చాటింది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇండియన్ స్పేస్ పాలసీ’ ద్వారా ప్రైవేట్ రంగానికి అంతరిక్ష అవకాశాలు కల్పించడంతో నూతన స్పేస్ స్టార్టప్‌లు వెల్లువెత్తాయి. ఇదే ఇప్పుడు ఇస్రోకు ప్రధాన సమస్యగా మారింది.
శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏది?
దేశానికే గర్వకారణమైన ఇస్రో అధిపతి (చీఫ్) వేతనం కూడా నెలకు సుమారు రెండు లక్షల రూపాయలకు మించదు. ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు లభించే జీతం కంటే ఇది చాలా తక్కువ.
వేతన వ్యత్యాసం: ఇస్రోలో ఏడాదికి రూ. 8 లక్షల వేతనం పొందే శాస్త్రవేత్తకు లేదా రూ. 12-15 లక్షలు పొందే సీనియర్ సైంటిస్ట్‌కు ప్రైవేట్ కంపెనీలు నేరుగా రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పైగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.
ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగం: ప్రభుత్వ బడ్జెట్‌పై ఆధారపడే ఇస్రో లాభాలార్జన ధ్యేయంగా పనిచేయదు కాబట్టి సైంటిస్టులకు భారీ పారితోషికాలు ఇవ్వలేదు. కానీ, ప్రైవేట్ రంగం కమర్షియల్ మోడల్‌పై నడుస్తుంది కాబట్టి భారీ జీతాలు ఇస్తోంది. సహజంగానే ఎక్కువ ఆదాయం ఇచ్చే అవకాశాల వైపు మానవ వనరులు మళ్లుతున్నాయి.
నాడు గురుకులాలు... నేడు ఇస్రో!
గతంలో విద్యా రంగంలో జరిగిన పరిణామాలే ఇప్పుడు అంతరిక్ష రంగంలోనూ పునరావృతమవుతున్నాయి.
ఒక చారిత్రక విశ్లేషణ:
1970ల కాలంలో పి.వి. నరసింహారావు హయాంలో ప్రారంభమైన ప్రభుత్వ గురుకులాలు ఎంతోమంది మెరికల లాంటి విద్యార్థులను, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లను తీర్చిదిద్దాయి. అయితే శ్రీచైతన్య, నారాయణ, విజ్ఞాన్ వంటి ప్రైవేట్ సంస్థలు రాగానే... రూ. 50 వేలు పొందే లెక్చరర్లకు రూ. 2 లక్షలు ఆఫర్ చేసి ఆ నైపుణ్యాన్ని తమ వైపు తిప్పుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడగా, ప్రైవేట్ సామ్రాజ్యాలు విస్తరించాయి. సరిగ్గా ఇదే శైలిలో ఇస్రోలో దశాబ్దాలుగా ప్రభుత్వ ఖర్చుతో, ప్రజల పన్నుల డబ్బుతో తయారైన అగ్రశ్రేణి సైంటిస్టులను ప్రైవేట్ స్పేస్ సంస్థలు అధిక జీతాలతో ఆకర్షిస్తున్నాయి.
ముంచుకొస్తున్న ముప్పు: మేధో సంపత్తి భద్రతేది?
ఈ పరిణామం రేపటి రోజున దేశ భద్రతకు, పరిశోధనలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది:
ఖాళీల ముప్పు:
అనుభవజ్ఞులైన సైంటిస్టులు వెళ్లిపోతే అంతరిక్ష పరిశోధనల వేగం మందగిస్తుంది.
ఔట్‌సోర్సింగ్ ప్రమాదం:
ఇస్రోలో ఖాళీలను కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నింపాల్సి వస్తే, దేశ రహస్యాలు, పరిశోధనా డేటా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి మారే అవకాశం ఉంది. కావాల్సింది పాఠశాల స్థాయి నుంచే దేశభక్తి, సరైన ప్రోత్సాహం.
దేశభక్తి అనేది కేవలం ఎన్నికల సమయంలో నినాదాలకే పరిమితం కాకూడదు. పాఠశాల స్థాయి నుంచే విజ్ఞానంతో పాటు ‘ఈ దేశం నాది’ అనే భావనను పెంపొందించాలి. అలాగే, సమాజంలోని అసమానతలు తొలగినప్పుడే ఆ కోరిక బలంగా వ్యక్తమవుతుంది. మన దేశంలో చదువుకున్న మేధావుల జ్ఞానానికి తగిన గుర్తింపు, సరైన అవకాశాలు, తగినంత ప్రోత్సాహం, గౌరవప్రదమైన వేతనాలు కల్పిస్తే ఏ ఒక్కరూ దేశాన్ని లేదా ఇస్రోను వదిలి వెళ్లరు. మేధో వలసను నిరోధించి, ఇస్రో ప్రాధాన్యతను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు, వేతన సవరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






Comments