top of page

జిల్లాను వణికిస్తున్న డయేరియా

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 days ago
  • 2 min read
  • సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం

(సంతబొమ్మాళి మండలంలోని తాళ్లవలస గ్రామంలో మంత్రి అచ్చెన్న పరామర్శ (ఫైల్ ఫోటో))

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుసగా సంభవిస్తున్న డయేరియా (అతిసారం) ఘటనలు, తీవ్ర ఫుడ్ పాయిజనింగ్ కేసులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. గతేడాది నవంబర్ చివరి వారం నుంచి జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రధాన ఘటనలు నమోదు కాగా, సుమారు 250 మందికి పైగా అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ఇటీవల విద్యా సంస్థల్లో వరుసగా అతిసారం ప్ర u లి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పాఠశాలలు, వసతి గృహాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో లబోదిబోమంటున్న సంబంధిత శాఖల అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన ఆహారం అందించేలా, తాగునీటి వ్యవస్థలను పునరుద్ధరించడానికి యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టారు.

విద్యా సంస్థల్లో అలసత్వం.. కలెక్టర్ నివేదికలో ఏం తేలనుంది?

గత వారం రోజుల వ్యవధిలోనే జిల్లాలోని రెండు ప్రముఖ విద్యా సంస్థల్లో సుమారు 45 మంది విద్యార్థులు అతిసారం బా రిన పడటం సంచలనం సృష్టించింది.

గార కేజీబీవీ ఘటన:

గార మండలం శాలిహుండాం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) ఈ నెల 6 నుంచి 10 తేదీల మధ్య ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన పల్లీ చెక్కీలు, పురుగులు పట్టిన రాగి జావ, నాణ్యత లేని బయటి ఆహారం తిని 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

సోంపేట ప్రభుత్వ పాఠశాల:

ఈ నెల 13 నుంచి 15 తేదీల మధ్య వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కావడం, ఆహార తయారీలో కనీస శుభ్రత పాటించకపోవడంతో 15 మంది విద్యార్థులు డయేరియా లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారు. దీనికి బాధ్యురాలిగా చేస్తూ పాఠశాల హెచఎంను సస్పెండ్ చేశారు.

ఈ రెండు ఘటనలపై విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయ లోపంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ నివేదిక కీలకం కానుంది.

జిల్లాను కుదిపేసిన ప్రధాన డయేరియా విపత్తులు

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. తాగునీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, డ్రైనేజీ లీకేజీలు, జాతరల్లో కలుషిత పానీయాలు, పాఠశాలల్లో ఆహార నాణ్యత లోపాలే ఈ విపత్తులకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

తాళ్లవలసలో తొలి మరణం (29 నవంబర్, 2025):

సంతబొమ్మాళి మండలంలోని తాళ్లవలస గ్రామంలో కలుషితమైన నీటిని తాగడం వల్ల ఒక్కసారిగా 9 మంది డయేరియా బారిన పడ్డారు. ఈ ఘటనలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారావు (70) అనే వృద్ధుడు తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై, మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్‌తో మరణించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తాగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

శ్రీకాకుళం నగరాన్ని వణికించిన విపత్తు (24 ఫిబ్రవరి, 2026):

నగరంలోని కాకివీధి, దమ్మలవీధి, గుడివీధి, హాస్టల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏకంగా 158 మంది తీవ్ర అస్వస్థతకు గురవగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాగునీటి పైప్‌లైన్ల లీకేజీ వల్ల మురుగునీరు కలవడమే దీనికి కారణమని తేలింది. బాధితుల నీటి నమూనాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా బయటపడింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం అప్పటి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

సింగుపురంలో రెండు నెలల్లో రెండు విపత్తులు:

మొదటి ఘటన (23-26 ఫిబ్రవరి, 2026): రోడ్డు విస్తరణ పనుల సమయంలో తాగునీటి పైప్‌లైన్లు పగిలి మురుగునీరు చేరడంతో 15 నుండి 20 మంది గ్రామస్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

రెండో ఘటన (1-2 ఏప్రిల్, 2026): కొండమ్మతల్లి జాతరలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు విక్రయించిన కలుషిత బాదం పాలు, ఫలూదా తాగడం వల్ల 50 నుంచి 80 మంది వరకు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. బాధ్యులైన ముగ్గురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేవలం సస్పెన్షన్లతోనే సరిపెడతారా?

వరుస ఘటనలు పరిశీలిస్తే లీకవుతున్న తాగునీటి పైప్‌లైన్లు, అస్తవ్యస్తంగా మారిన భూగర్భ డ్రైనేజీల వ్యవస్థ, హాస్టళ్లలో పర్యవేక్షణా లోపమే ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయని స్పష్టమవుతోంది. అధికారులు, సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. విపత్తు జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కోరిన కలెక్టర్ సమగ్ర నివేదిక ఆధారంగానైనా జిల్లాలో తాగునీటి, పారిశుద్ధ్య వ్యవస్థలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందో లేదో వేచి చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page