top of page

రాజే సేవకుడయ్యాడు.. జగన్నాథుడు అలక వీడాడు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • 1972 పూరీ రథయాత్రలో చోటుచేసుకున్న విశేష ఘట్టం

  • రథంలోకి ఎక్కేందుకు నిరాకరించిన దేవదేవుడు

  • అర్చకులు ఎంత ప్రయత్నించినా కనిపించని ఫలితం

  • చివరికి 19 ఏళ్ల యువకుడి ప్రార్థనలను మన్నించిన వైనం

  • అతడే పూరీ మహారాజు గజపతి దివ్యసింహ దేవ్

  • లక్షలాది భక్తులు, అప్పటి ఒడిశా సీఎం దీనికి ప్రత్యక్ష సాక్షులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రపంచ ప్రసిద్ధమైన జగన్నాథస్వామి రథయాత్ర మీహాత్సవం చార్‌ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని పూరీ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి లక్షలాది భక్తులు రథయాత్రను స్వయంగా తిలకించేందుకు చేరుకోవడంతో పూరీ తీరంలో భక్తజనకెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సమీపంలోని సాగర కెరటాల ఘోషను మించి జైజగన్నాథ్ అన్న నామస్మరణతో నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్నది. ప్రతి ఏటా ఆషాఢమాసం శుక్లపక్ష ద్వితీయ తిథి రోజు జగన్నాథ, సుభద్ర, బలభద్రుల రథయాత్ర నిర్వహించడం సుమారు 12వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ఏడాది పొడవునా శ్రీమందిరంలోని గర్భగుడి నుంచి భక్తులకు దర్శనం ఇచ్చే జగన్నాథ, సుభద్ర, బలభద్రులు రథయాత్ర నాడు మందిరం నుంచి నేరుగా జనంలోకే వస్తారు. తమకోసం సిద్ధం చేసిన మÖడో రథాల్లో పయనిస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ గుండిచా మందిరానికి చేరుకుంటారు. అక్కడ తొమ్మిదిరోజులు పూజలు అందుకున్న తర్వాత తిరిగి శ్రీమందిరానికి రథాల్లో చేరుకుంటారు. దీన్నే మారు రథయాత్ర అంటారు. ఈ యాత్రలోనే కాకుండా.. జగన్నాథుడు కొలువైన శ్రీమందిరం, అక్కడి పూజావిధానాలు, ప్రసాద కైంకర్యాలు, పాటించే సంప్రదాయాలు.. ఇలా అడుగడుగునా అనేక రహస్యాలు, నేటి సైన్సుకు కూడా అందని విశిష్టతలు భక్తకోటిని ఎప్పటికప్పుడు విస్మయపరుస్తూనే ఉంటాయి. జగన్నాథునిపై భక్తిప్రవత్తులను పెంచుతూనే ఉంటాయి. వీటిలో చాలావరకు పురాణాల్లో చెప్పినవే కాకుండా.. ఇప్పటికి కళ్లెదురుగా కనిపిస్తూ స్వామి మహత్యాన్ని చాటిచెబుతున్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అటువంటి ఒక విశేష ఘటనే సుమారు ఐదున్నర దశాబ్దాల క్రితం రథయాత్ర రోజే జరిగింది. ఆనాడు అక్కడున్న లక్షలాది భక్తులు, అప్పటి ఒడిశా ముఖ్యమంత్రే దీనికి ప్రత్యక్ష సాక్షులు. ఆనాడు ఏం జరిగిందో ఈ రథయాత్ర రోజు పునరావలోకనం చేసుకుందాం.

కదలనని మొరాయించిన దేవుడు

అది 1972.. ఆషాఢమాసం శుక్లపక్ష విదియ.. ప్రతియేడు మాదిరిగానే రథయాత్రకు పూరీ క్షేత్రం సిద్ధమైంది. జనంలోకి రావడానికి ముందు జగన్నాథ, సుభద్ర, బలభద్రులు ఆలయంలోనే భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అనంతరం స్వామివార్ల విగ్రహాలను అర్చకులు స్వయంగా మోసుకుంటూ బయట సిద్ధంగా ఉన్న రథాల్లోకి తీసుకెళ్లి అధివశింపజేయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. లక్షలాది భక్తులు ఆ అపురూప ఘట్టాలను కనులారా వీక్షించి తరించేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి నందినీ శత్పతి కూడా దేవదేవుడి ఉత్సవంలో పాల్గొనేందుకు పూరీ ఆలయానికి చేరుకున్నారు. జగన్నాథుడు తన నందిఘోష్ రథాన్ని అధిరోహించేందుకు ముందు నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. చివరికి విగ్రహాలను రథాలపైకి అధిరోహింపజేసేందుకు దైతపతులు, అర్చకులు సిద్ధమయ్యారు. పహండి ఆచారం ప్రకారం జగన్నాథ స్వామి విగ్రహాన్ని రథం వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆలయవర్గాలను, అధికారులను నివ్వెరపర్చి.. తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దైతపతులు, అర్చకులు స్వామి విగ్రహాన్ని అణుమాత్రం కూడా కదల్చలేకపోయారు. విగ్రహం చాలా బరువుగా మారి.. ఏమాత్రం కదలకుండా నిశ్చలంగా ఉండిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో స్వామి సేవలు, సంప్రదాయాల్లో ఏదో లోపం జరిగిందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. లోపం ఎక్కడ జరిగిందో.. స్వామి ఎందుకు ఆగ్రహించారో అర్థంకాక అర్చకులు, సేవాయత్‌లు, ఒడిశా రాష్ట్ర అధికారులు పాత సంప్రదాయాలు పొందుపర్చిన గ్రంథాలను మరోమారు తిరగేసి లోపం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి నందినీ శత్పతి కూడా ఆలయవర్గాలతో మాట్లాడి, స్వామిని ప్రత్యేకంగా ప్రార్థించారు. యాత్ర నిరాఘాటంగా జరిగేలా కరుణించమని వేడుకున్నారు. అయినా జగన్నాథస్వామి రథం ఎక్కడానికి నిరాకరించారు.

మహారాజు భావోద్వేగ విజ్ఞప్తి

ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమయ్యాయి. జగన్నాథస్వామి రథంపై ఆసీనులు కావడానికి ఇష్టపడలేదు. దాంతో చివరి ప్రయత్నంగా ఆలయ ప్రధాన నిర్వాహకులు సహాయం కోసం పూరీ గజపతి మహారాజును ఆశ్రయించారు. అప్పటికి కేవలం 19 ఏళ్ల యువకుడిగా ఉన్న మహారాజు గజపతి దివ్యసింహ దేవ్ అర్చకుల వినతిని మన్నించి తమ ఇలవేల్పు అయిన జగన్నాథుని మనసు మార్చేందుకు రంగంలోకి దిగారు. కాళ్లకు చెప్పులు లేకుండా శ్రీమందిరంలో ఉన్న స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఒక పాలకుడిగా కాకుండా.. కేవలం ఒక సాధారణ భక్తుడిలా భగవంతుడిని శరణు వేడారు. జగన్నాథ స్వామి పాదాలను తాకి, విగ్రహానికి తన శరీరాన్ని ఆనించి, భావోద్వేగంతో క్షమించమని వేడుకుని, భక్తులకు దర్శనం ఇవ్వడానికి రథంపై ఆసీనులు కావాలని భక్తిప్రపత్తులతో ప్రార్థించారు. ఆయన నిష్కపటమైన భక్తి, అంకితభావం, వినయపూర్వకమైన ప్రార్థనలు ఫలించాయి. అంతవరకు అత్యంత బరువుగా అనిపించి కదలని స్వామి విగ్రహం.. రాజు ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా తేలికపడటంతో దైతపతి పరిచారకులు జయజయ ధ్వనాలు చేస్తూ జగన్నాథస్వామి విగ్రహాన్ని కొన్ని నిమిషాల్లోనే నందిఘోష రథంపైకి తీసుకెళ్లి ప్రతిష్ఠించగలిగారు. స్వామి రథంపై ఆసీనులు కావడంతో భక్తులంతా ఆనందంతో మురిసిపోయి జై జగన్నాథ్ అన్న నినాదాలతో పూరీ క్షేత్రాన్ని హారెత్తించారు. భక్తులు ఇప్పటికీ ఈ సంఘటనను స్వామివారి దివ్యలీలకు నిజమైన ప్రతీకగా భావిస్తారు. తన దరికి చేరుకోలేని భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు ఏడాదికోసారి జనంలోకి వచ్చే జగన్నాథుడు.. తనను కొలిచే క్రమంలో జరిగే పొరపాట్లను కేవలం ఒక్క ప్రార్థనతో క్షమించి, కరుణించే భక్తసులభుడని ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతుంది. ఇలాంటి అనేక ఉదంతాలు భక్తులను జగన్నాథుడిని మరింత చేరువ చేస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page