top of page

నగదు బండెడు.. సరుకు తట్టెడు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read
  • సరుకుల కంటే కరెన్సీ మోతే భారం

  • అందుకే అన్నింటికీ UPI చెల్లింపులే

  • సోమాలీలాండ్‌లో విచిత్రమైన పరిస్థితి

  • గుర్తింపులేని ఆ దేశానికి దిగుమతులే ఆధారం

  • ఫలితంగా డాలర్ల ప్రభావంతో చితికిపోతున్న ఆర్థికం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రపంచంలో నగదురహిత(డిజిటల్) లావాదేవీలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. భారత్‌లాంటి పెద్ద ఆర్థికవ్యవస్థలు ఉన్న దేశాల్లో ఇవి మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వాలే వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించింది. దీనివల్ల బ్లాక్‌మనీ, అవనీతిని అరికట్టవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. యÖపీఐ చెల్లింపుల వల్ల అన్ని రకాల లావాదేవీల్లో పారదర్శకత పెరిగి.. పన్ను వసూలు పరిధిలోకి వస్తాయన్నది ప్రభుత్వాల ఉద్దేశం. దాంతో ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నగదు చెలామణీ తగ్గిపోయింది. కానీ దీనికి భిన్నంగా ఒక పేద దేశంలో.. అదీ డబ్బులకు మొహం వాచిన పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ప్రతిచిన్న ఆర్థిక లావాదేవీకీ యÖపీఐ చెల్లింపులపైనే ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితికి ఆ దేశ ప్రజలు చెబుతున్న కారణం కూడా ఆసక్తికరంగా, మరికొంత ఆందోళన కలిగించేదిగానూ ఉంది. మన సమాజంలో ఒక నానుడి ఉంది. ధరల పెరుగుదలను ప్రస్తావించడానికి, దాని ప్రభావాన్ని చెప్పడానికి ‘ఇంతకు ముందు పర్సులో డబ్బులు తీసుకెళ్లి పెద్దసంచుల్లో సరుకులు తెచ్చుకునేవాళ్లం.. ఇప్పుడు సంచుల్లో డబ్బులు తీసుకెళ్లినా గుప్పెడు సరుకులు కూడా రావడంలేదు’ అని అంటుంటారు. సరిగ్గా ఇదే పరిస్థితి ఆ దేశంలో నెలకొంది. అయితే దానికి కారణం మాత్రం ధరల పెరుగుదల కాదు. ఆ దేశ కరెన్సీ విలువ చాల తక్కువగా ఉండటం, ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల అక్కడి ప్రజల పరిస్థితి బండెడు కరెన్సీ నోట్లు తీసుకెళ్లి సంచెడు సరుకులు తెచ్చుకునేట్లు తయారైంది. దాంతో ఆ మోత భారం నుంచి, దొంగల బెడద నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు, వ్యాపారులు కూడా UPI లావాదేవీలపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఈ వింత పరిస్థితి ఎదుర్కొంటున్న దేశమే సోమాలిలాండ్.

గుర్తింపు లేని దేశం

ఉత్తర ఆఫ్రికాలోని అడెన్ గల్ఫ్ సమీపంలో ఉన్న ప్రాంతమే సోమాలిలాండ్. అంతకుముందు సోమాలియాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1991లో దాన్నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే ఇప్పటికీ ఐక్యరాజ్యసమితితో పాటు చాలా ప్రపంచ దేశాలు సోమాలిలాండ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. సుమారు 40 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతం తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతోపాటు సొంత ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ, సొంత కరెన్సీ ఏర్పాటు చేసుకుంది. ఈ దేశ అధికారిక కరెన్సీ సోమాలిలాండ్ షిల్లింగ్. అయితే దీని విలువ చాలా తక్కువగా ఉండటం అక్కడి ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఒక అమెరికన్ డాలర్‌కు సుమారు తొమ్మిదివేల సోమాలిలాండ్ షిల్లింగ్‌లు చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా 500, 1000 షిల్లింగ్ నోట్లు ఎక్కువగా చెలామణీలో ఉంటాయి. అలాగే కరువుకు ఆలవాలమైన ఈ దేశంలో దాదాపు ప్రతి వస్తువులు. నిత్యావసరాలను డాలర్లలో చెల్లింపులు జరిపి దిగుమతి చేసుకోవలసి వస్తున్నది. ఆ వస్తువులను సోమాలిలాండ్‌లో కొనాలంటే ఆ స్థాయిలోనే ధరలు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా చిన్న వస్తువులకు సైతం భారీ మొత్తంలో నగదు వెంట తీసుకెళ్లక తప్పడం లేదు. అందువల్ల అక్కడి మార్కెట్లలో పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువుల కంటే కరెన్సీ నోట్ల కట్టలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక సిగరెట్ కొనాలన్నా 500 లేదా వెయ్యి షిల్లింగ్ నోట్లు ఇవ్వాల్సి వస్తున్నది. కూరగాయలు కొన్నాలన్నా సంచి నిండా నోట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక విలువైన నగలు లేదా పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో నోట్ల కట్టలను వాహనాల్లో తీసుకెళ్లాల్సి వస్తుందని చెబుతారు.

ప్రతిదానికీ మొబైల్ చెల్లింపులే

ఈ కారణంగా నగదు లావాదేవీలు ప్రజలకు భారంగా మారాయి. అందుకే సోమాలిలాండ్‌లో మొబైల్ పేమెంట్లు, ఇతర డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు ఎక్కువ మంది మొబైల్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అక్కడి పరిస్థితి ఎంతగా దిగజారిందంటే చాలామంది బిచ్చగాళ్లు కూడా నగదు కంటే మొబైల్ ద్వారా నగదు భిక్ష స్వీకరించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సోమాలిలాండ్‌లో పెద్దఎత్తున క్యాష్‌లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. UPI లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్నా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా బలహీనంగా ఉంది. సగం భూభాగం ఎడారిగా ఉండగా, మిగిలిన ప్రాంతాలు తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంటాయి. వ్యవసాయానికి అంతగా అనుకూలత లేకపోవడంతో ఉపాధి అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఇక్కడి ప్రధాన ఎగుమతి ఉత్పత్తి ఒంటెలు. అలాగే మత్స్య పరిశ్రమ, చిన్న వ్యాపారాలే స్థానికుల జీవనాధారం. పర్యాటక రంగం కూడా ఆర్థిక వ్యవస్థకు కొంతమేర తోడ్పడుతోంది. సముద్ర తీరాలు, సహజసిద్ధమైన ప్రాంతాలు, పురాతన గుహలు, చారిత్రక ప్రదేశాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చరిత్ర, భూగోళశాస్త్రం, పురావస్తు రంగాలకు చెందిన నిపుణులు కూడా పరిశోధనల కోసం ఇక్కడికి తరచూ వస్తుంటారు. ఈ పరిస్థితులన్నీ సోమాలిలాండ్‌ను డిజిటల్ చెల్లింపుల వైపునకు వేగంగా మళ్లించాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page