top of page

సింగిల్‌.. నవ్వులతో మింగిల్‌

  • Guest Writer
  • 5 days ago
  • 4 min read

నటీనటులు: శ్రీ విష్ణు-కేతిక శర్మ-ఇవానా-వెన్నెల కిషోర్‌ రాజేంద్ర ప్రసాద్‌ - వీటీవీ గణేష్‌ తదితరులు

సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌

ఛాయాగ్రహణం: వేల్‌ రాజ్‌

మాటలు: భాను-నందు

నిర్మాతలు: విద్య కొప్పినీడి-భాను ప్రతాప-రియాజ్‌ చౌదరి

కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: కార్తీక్‌ రాజు

యువతకు మెచ్చే కామెడీ ఎంటర్టైనర్లతో ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించిన యువ నటుడు.. శ్రీ విష్ణు. అతను హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్‌ కార్తీక్‌ రాజు రూపొందించిన సినిమా.. సింగిల్‌. గీతా ఆర్ట్స్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను ‘సింగిల్‌’ ఏమేర అందుకుందో తెలుసుకుందాం...

కథ: విజయ్‌ (శ్రీ విష్ణు) ఒక బ్యాంకు ఉద్యోగి. వయసు మీద పడుతున్నా తన జీవితంలోకి అమ్మాయి రావట్లేదని.. ఎన్నాళ్లిలా సింగిల్‌ గా ఉండాలని ఫీలవుతుంటాడు. ఆ సమయంలోనే అతడి జీవితంలోకి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒకరు విజయ్‌ ప్రేమించిన పూర్వ (కేతిక శర్మ).. మరొకరు విజయ్‌ ని ప్రేమించిన హరిణి (ఇవానా). ఓవైపు పూర్వను మెప్పించడానికి గట్టిగా ప్రయత్నిస్తూ.. ఇంకోవైపు హరిణిని వదిలించుకోవడానికి కూడా అంతే కష్టపడుతుంటడు విజయ్‌. మరి పూర్వ తనను ప్రేమించేలా విజయ్‌ చేసుకోగలిగాడా.. లేక హరిణికే అతను లొంగిపోయాడా.. ఈ ఇద్దరమ్మాయిలతో తన ప్రేమాయణం చివరికి ఎలాంటి మలుపు తిరిగింది.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: జాతిరత్నాలు.. మ్యాడ్‌.. ప్రేమలు.. ఆయ్‌.. గత కొన్నేళ్లలో తెలుగు యువతను బాగా ఆకట్టుకున్న కామెడీ ఎంటర్టైనర్లు. వీటన్నింట్లో కామన్‌ గా కొన్ని విషయాలు కొన్ని కనిపిస్తాయి. వీటిలో చెప్పుకోవడానికి బలమైన కథంటూ ఏమీ ఉండదు. పెద్దగా సీరియస్‌ క్యారెక్టర్లు కూడా కనిపించవు. ఎమోషన్లని.. యాక్షన్‌ అని వేరే రసాలేమీ వాటిలో పులిమే ప్రయత్నం చేయలేదు. పాత్రలన్నీ నాన్‌ సీరియస్‌ గా కనిపిస్తాయి. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్‌ చేయడం.. క్యారెక్టర్ల మధ్య జాలీగా అనిపించే కాన్వర్జేషన్లతో సన్నివేశాలను నడిపించడం.. ఎక్కువగా డైలాగుల మీదే ఫన్‌ జనరేట్‌ చేయడానికి ప్రయత్నించడం.. ఏ దశలోనూ కథను సీరియస్‌ గా మార్చకపోవడం ద్వారా ప్రేక్షకుల ముఖాల్లో చిరు నవ్వు చెదరనీయకపోవడం.. ఇదే టెంప్లేట్లో ఉంటాయి ఈ సినిమాలు. ‘సింగిల్‌’ సైతం ఈ ట్రెండును అనుసరించిన సినిమానే. రెండు గంటల పైగా నిడివి ఉన్న సినిమాలో కొన్ని నిమిషాలకు మించి సీరియస్‌ గా అనిపించని సినిమా ఇది. తొలి సన్నివేశం నుంచి చివరి సీన్‌ వరకు నవ్వించడమే ధ్యేయంగా సాగిన ఈ చిత్రంలో.. కామెడీ పంచులు బ్రహ్మాండంగా పేలాయి. ఓవైపు శ్రీ విష్ణు.. ఇంకోవైపు వెన్నెల కిషోర్‌ కలిసి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. కథాకథనాలు సాధారణంగా అనిపించినా.. ఈ ఇద్దరి కామెడీ టైమింగ్‌ వల్ల.. ట్రెండీ డైలాగుల వల్ల ‘సింగిల్‌’ యువత మెచ్చే మాంచి టైంపాస్‌ ఎంటర్టైనర్‌ గా తయారైంది.

సోషల్‌ మీడియాతో బాగా మింగిల్‌ అయిపోయిన ఈ తరం యువతను ఆకట్టుకోవాలంటే కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మీమ్‌ లాంగ్వేజ్‌ తో కామెడీ పంచులు రాసుకుని.. టైమింగ్‌ బాగున్న ఆర్టిస్టులతో ఆ డైలాగులను సరిగ్గా డెలివర్‌ చేయిస్తే చాలు.. యూత్‌ బాగా కనెక్ట్‌ అయిపోతారు. ‘సింగిల్‌’ టీం అదే చేసింది. ఇంతకుముందు తెలుగులో ‘నిను వీడని నీడను నేనే’ లాంటి సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ తీసిన తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజు.. ఈసారి తెలుగులో నడుస్తున్న ట్రెండును బాగా పట్టుకున్నాడు. యూత్‌ రిలేట్‌ అయ్యే క్యారెక్టర్లను రాసుకుని.. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్‌ చేసుకున్నాడు. వాటికి సరైన ఆర్టిస్టును ఎంచుకున్నాడు. ఇక ‘సామజవరగమన’తో ఈ ట్రెండుకు తగ్గ కామెడీ రైటర్లుగా పేరు తెచ్చుకున్న భాను-నందు మరోసారి తమ పెన్‌ పవర్‌ చూపించారు. సోషల్‌ మీడియా మీమ్స్‌ ను కాచి వడబోసేసినట్లుగా వాళ్లు రాసిన డైలాగులే సినిమాకు మేజర్‌ హైలైట్‌. కామెడీ పండిరచడంలో.. డైలాగులు పలకడంలో తనకంటూ ఒక సెపరేట్‌ స్టైల్‌ క్రియేట్‌ చేసుకున్న భాను-నందు డైలాగులను పట్టుకుని చెలరేగిపోయాడు. ఇక కామెడీలో చిన్న హింట్‌ ఇస్తే చాలు అల్లుకుపోయే వెన్నెల కిషోర్‌ కు హీరోతో సమానమైన స్క్రీన్‌ టైం ఉన్న పాత్ర.. ఫన్నీ సిచువేషన్లు కుదరడంతో నవ్వులకు లోటే లేకపోయింది. సోషల్‌ మీడియాలో మీమ్స్‌-జోక్స్‌ ను ఇష్టపడేవాళ్లయితే.. ఇందులో పంచులను భలేగా ఎంజాయ్‌ చేస్తారు. ఒకటి పట్టుకునేలోపే ఇంకోటి వచ్చి పడే పంచుల వర్షంలో తడిసి ముద్దయిపోతారు.

‘సింగిల్‌’ ట్రైలర్‌ చూస్తేనే.. చాలామంది హీరోలను.. పాపులర్‌ సినిమాల్లోని డైలాగులను అనుకరించడం.. అలాగే రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్లను పేరడీ చేయడంపై ఒక అంచనా వస్తుంది. ఆ అంచనాలను మించి పంచులుంటాయి సినిమాలో. మహేష్‌ బాబు ‘బ్యాంక్‌ అంటే టెంపుల్‌’ సినిమా డైలాగ్‌ నుంచి మంచు మనోజ్‌ రియల్‌ ‘పంది పిర్రలోడా’ డైలాగ్‌ వరకు.. ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’లో జాలీ జోసెఫ్‌ వండిన శనగల కూర నుంచి కుమారి ఆంటీ కస్టమర్లకు పెట్టే లివర్ల వరకు.. ‘మీమ్‌’ డైలాగులు ఇందులో కోకొల్లలు. చివరికి తన కల్ట్‌ ఫ్యాన్స్‌ తన సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలో మాత్రమే చూస్తారంటూ స్వయంగా తన మీద తనే పంచ్‌ కూడా వేసుకున్నాడు శ్రీ విష్ణు. వెన్నెల కిషోర్‌ తో కలిసి అతను చేసిన అల్లరే సినిమాను జాలీగా ముందుకు నడిపిస్తుంది. ముఖ్యంగా ఒక సీన్లో లుంగీతో వెన్నెల కిషోర్‌ చేసిన కామెడీకి కడుపు చెక్కలవ్వాల్సిందే. ఇలా ప్రేక్షకులను గట్టిగా నవ్వించే ఎపిసోడ్లు సినిమాలు ఇంకో మూణ్నాలుగున్నాయి. హీరోయిన్లు ఇద్దరితో హీరో రొమాంటిక్‌ ట్రాక్స్‌ సాధారణంగా.. కొంచెం సిల్లీగా కూడా అనిపించినా.. కామెడీ వల్ల దాని మీదికి ఎక్కువ దృష్టి పోదు. ఇవానా పాత్రను చాలా వరకు నార్మల్‌ గా చూపించి.. ఉన్నట్లుండి దాన్ని సీరియస్‌ గా మార్చి సినిమాకు కొంచెం ఎమోషనల్‌ టచ్‌ ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ ట్రాక్‌ అంతా సినిమాలో నాన్‌ సింక్‌ అనిపిస్తుంది. ఈ ఒక్క ఎపిసోడ్లో ప్రేక్షకులు ‘సింగిల్‌’తో డిస్కనెక్ట్‌ అయిపోతారు. మళ్లీ క్లైమాక్సుని పాత స్టయిల్లో ఫన్నీగా నడిపించేశాడు దర్శకుడు. ముగింపులో ఏదైనా బలమైన సన్నివేశం ఉంటుందని అనుకుంటే.. అలాంటిదేమీ లేకుండా సాధారణంగానే ముగించాడు దర్శకుడు. దీని వల్ల క్లైమాక్స్‌ మరీ తేలికైపోయిన భావన కలుగుతుంది. చివర్లో సింగిల్‌-2కు లీడ్‌ ఇచ్చింది టీం. ఐతే ‘సింగిల్‌’ బాగానే టైంపాస్‌ చేయించినప్పటికీ.. ఇంతకుమించి ఈ కథ నుంచి పిండడానికి ఏముంది అనే ఫీలింగ్‌ కలుగుతుంది. కథాకథనాల సంగతి వదిలేసి.. సోషల్‌ మీడియా ట్రెండుకు తగ్గ కామెడీ పంచులతో నవ్వుకోవాలనుకుంటే.. రెండు గంటలు టైంపాస్‌ చేయాలనుకుంటే ‘సింగిల్‌’ మంచి ఛాయిసే.

నటీనటులు: కెరీర్లో ఒక దశ వరకు మూడీ క్యారెక్టర్లకు పేరు పడ్డాడు కానీ.. ఇప్పుడు మాత్రం శ్రీ విష్ణును చూసే కోణమే మారిపోయింది. తెరపై శ్రీ విష్ణును చూడగానే యువ ప్రేక్షకుల ముఖాల్లోకి చిరు నవ్వు వస్తోంది. ఒక టిపికల్‌ డైలాగ్‌ డెలివరీతో.. కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను భలేగా నవ్విస్తున్నాడు విష్ణు. సామజవరగమన.. స్వాగ్‌ తర్వాత ఈ సినిమాలో శ్రీ విష్ణు బాగా నచ్చేస్తాడు. నాన్‌ స్టాప్‌ కామెడీతో అతను ఆకట్టుకున్నాడు. తన లుక్స్‌ కంటే కామెడీకి ఫ్యాన్స్‌ ఉన్నారంటూ అతను సినిమాలో చెప్పిన డైలాగ్‌ వాస్తవమే. శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్‌ కు సరిపోయే పాత్రనే ఇచ్చాడు దర్శకుడు. ఇక వెన్నెల కిషోర్‌ గురించి చెప్పేదేముంది? మళ్లీ తన టాలెంటుకు తగ్గ పాత్రలు ఇస్తున్నారు దర్శకులు. ఎప్పుడూ చేసే ‘హీరో వల్ల నానా అవస్థలు పడే ఫ్రెండు’ క్యారెక్టరే అయినా.. కామెడీ సిచువేషన్లు బాగా కుదరడంతో అతను చెలరేగిపోయాడు. తన కోసమే చూడాల్సిన సీన్లున్నాయి ‘సింగిల్‌’లో. హీరోయిన్లు కేతిక శర్మ-ఇవానా ఇద్దరూ పాత్రలకు సరిపోయారు. వాళ్ల పెర్ఫామెన్స్‌ ఓకే. రాజేంద్ర ప్రసాద్‌ కొన్ని నిమిషాలు కనిపించే సీరియస్‌ పాత్ర చేశాడు. దాని ఇంపాక్ట్‌ పెద్దగా లేకపోయింది. వీటీవీ గణేష్‌ తన మార్కు కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులు మామూలే.

సాంకేతిక వర్గం: విశాల్‌ చంద్రశేఖర్‌ పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ‘సింగిల్‌’ పాటలకు ప్రాధాన్యమున్న సినిమా కాదు కానీ.. ఉన్న వాటిలో మళ్లీ వినాలనిపించేవేవీ లేవు. విశాల్‌ నేపథ్య సంగీతం సినిమా నడతకు తగ్గట్లుగా హుషారుగా సాగింది. వేల్‌ రాజ్‌ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. భాను-నందు డైలాగులు సినిమాకు పెద్ద అసెట్‌. ఇక దర్శకుడు కార్తీక్‌ రాజుకు.. ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న కామెడీ సినిమాల ట్రెండును బాగానే అర్థం చేసుకుని సింపుల్‌ కథ రాసుకున్నాడు. శ్రీ విష్ణు-వెన్నెల కిషోర్‌ లకు తగ్గ క్యారెక్టర్లు రాసి.. కామెడీ ప్రధానంగా సినిమాను బాగానే నడిపించాడు. కథ సాధారణంగా అనిపించినా.. బోర్‌ కొట్టని అతడి కథనంతో మార్కులు కొట్టేశాడు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page