top of page

12 ఏ రైల్వే కాలనీ.. ట్విస్టులు తిరగబడ్డాయ్‌

  • Guest Writer
  • 2 days ago
  • 3 min read
ree

ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఉన్న అల్లరి నరేష్‌ కొన్నేళ్లుగా సీరియస్‌ సినిమాలతో పలకరిస్తున్నాడు. ఐతే నాంది తర్వాత అతడికి సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు నరేష్‌ థ్రిల్లర్‌ మూవీ ‘12 ఏ రైల్వే కాలనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘పొలిమేర’ దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ స్క్రిప్టు అందించిన ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ రూపొందించాడు. మరి ఈ చిత్రం అల్లరి నరేష్‌ కోరుకున్న బ్రేక్‌ అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

కార్తీక్‌ (అల్లరి నరేష్‌) ఒక అనాథ. వరంగల్లో స్నేహితులతో కలిసి.. టిల్లు అనే ఒక రాజకీయ నాయకుడి దగ్గర పని చేస్తూ.. ఇంకేవో పనులు చేసుకుంటూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను కార్తీక్‌ ప్రేమిస్తాడు. కానీ ఆరాధన అతడిని పెద్దగా పట్టించుకోదు. బాడ్మింటన్‌ ప్లేయర్‌ అయిన తనకు ఇంటర్నేషనల్‌ టోర్నీకి వెళ్ళేందుకు డబ్బులు అవసరం పడ్డాయని తెలిసి ఆ మొత్తం సమకూర్చాలని కార్తీక్‌ ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఎన్నికల్లో గెలవడం కోసం ఒక క్షుద్ర మంత్రికుడితో కలిసి ఒక పూజ చేస్తున్న టిల్లు.. ఒక పార్సిల్‌ ను కార్తీక్‌ కు ఇచ్చి కాపాడమంటాడు. దాన్ని ఆరాధన ఇంట్లో దాచిపెట్టడం కోసం తన ఇంటికి వెళ్తే అక్కడ అతడికి సంచలన విషయాలు తెలుస్తాయి. అక్కడ అతనేం చూశాడు.. ఇంతకీ ఆరాధన ఎవరు.. టిల్లు రహస్యంగా చేస్తున్న పూజ ఫలితం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం -విశ్లేషణ:

కథ కోసం.. కథలో భాగంగా ట్విస్టులు ఉంటే అవి ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. సినిమా గ్రాఫ్‌ ను పెంచుతాయి. కానీ ఈ మధ్య ట్విస్టుల కోసం కథలు రాయడం.. ట్విస్టులతో మొదలుపెట్టి వాటి చుట్టూ కథలు అల్లడం.. ప్రేక్షకులు ఊహించని రీతిలో కథను మలుపు తిప్పి వాళ్లను ఆశ్చర్యపరచాలని చూడడం.. ఈ కొత్త ట్రెండు చూస్తున్నాం. ఓటీటీల పుణ్యమా అని వివిధ భాషల్లో ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లు అద్భుతమైన థ్రిల్లర్లు ప్రేక్షకులను చేరుతుండడంతో.. వారి అంచనాలను మించిన ట్విస్టులు ఇవ్వాలనే ప్రయత్నంలో ఫిలిం మేకర్స్‌ తమ క్రియేటివిటీని హద్దులు దాటించేస్తున్నారు. మలయాళంలో థ్రిల్లర్‌ సినిమాలకు పెట్టింది పేరైన జీతు జోసెఫ్‌ సైతం ఇటీవల ‘మిరాజ్‌’ అనే సినిమాలో ఈ ట్విస్టుల మోజులో పడి కథను చిందరవందర చేసేశాడు. ‘మా ఊరి పొలిమేర’.. ‘పొలిమేర-2’ చిత్రాలతో రచయితగా-దర్శకుడిగా పేరు సంపాదించిన అనిల్‌ విశ్వనాథం.. తాను స్క్రిప్టు అందించిన ‘12 ఏ రైల్వే కాలనీ’లో కూడా ఇదే బాట పట్టాడు. ప్రేక్షకుల అంచనాలను మించిపోవాలని.. వాళ్లను ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసేయాలనే ప్రయత్నంలో ఈ కథను కంగాళీ చేసేశాడు. అసలు జీర్ణం కాని కథ.. గజిబిజి కథనంతో ‘12 ఏ రైల్వే కాలనీ’ని గందరగోళంగా మార్చాడు. పేరుకు బోలెడన్ని ట్విస్టులున్నా అవి ప్రేక్షకులను థ్రిల్‌ చేయకపోగా.. ఫ్రస్టేషన్‌ కలిగిస్తే ఇక ఆ సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చెప్పాలా?

‘12 ఏ రైల్వే కాలనీ’లో తల్లీకూతుళ్లయిన ఇద్దరు అనూహ్య రీతిలో హత్యకు గురవుతారు. చనిపోయిన ఇద్దరిలో హీరోయిన్‌ కూడా ఉంటుంది. ఆమె మరణం వెనుక మిస్టరీని హీరో ఎలా ఛేదించాడన్నదే ఈ కథ. అధునాతన టెక్నాలజీని.. అనుభవజ్ఞులైన-నిపుణులైన సిబ్బందిని చేతిలో పెట్టుకుని పోలీసులు ఇందులో చేసేదేమీ ఉండదు. కానీ పెద్దగా చదువుకోని.. రౌడీ బ్యాగ్రౌండ్‌ ఉన్న హీరో మాత్రం తన మాస్టర్‌ మైండ్‌ వాడేసి ఈ కేసును ఛేదించేస్తాడు. పోలీస్‌ ఆఫీసరేమో అనుమాతులను పిలవడం.. వాళ్లు తాము అమాయకులం అని ఏదో ప్రూఫ్‌ చూపించగానే వాళ్లను విడిచిపెట్టేయడం.. ఇదీ వరస. కానీ హీరో మాత్రం పోలీస్‌ స్టేషన్లోనే ఐదు వేలు లంచం ఇచ్చిన అంత ఆషామాషీగా దొరకని సమాచారాన్ని బయటికి తీసి.. దాన్ని పట్టుకుని మొత్తం కూపీ లాగేస్తాడు. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు.. వాటి చుట్టూ కథ అల్లిన తీరు చూశాక.. చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. అసలు హంతకులెవరో తెలిశాక.. ఆ వ్యక్తి వేసిన ప్లాన్‌.. తనెందుకు హత్య చేశారో తెలిశాక ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత అసహజంగా.. విడ్డూరంగా అనిపిస్తాయి ఆ విషయాలు. అప్పుడే అనిపిస్తుంది ఇది కేవలం ట్విస్టుల కోసం రాసిన కథ అని.

ఒక సినిమాలో హీరోయిన్‌ చనిపోతే ప్రేక్షకుడు కదిలిపోవాలి. హీరో హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే.. ఒక ఎమోషన్‌ క్యారీ అవ్వాలి. కానీ అంతకుముందు వరకు చూపించిన లవ్‌ (లెస్‌) స్టోరీ చూశాక హీరోయిన్‌ విషయంలో కానీ.. ఆ తర్వాత హీరో ఆమె హంతకుడిని పట్టుకోవాలనే చేసే ప్రయత్నంలో కానీ.. రవ్వంత కూడా ఎమోషన్‌ కలగదు. ఒక సీన్లో హీరోయిన్‌ వాలీబాల్‌ మ్యాచ్‌ ఆడుతుంటుంది. అక్కడికొచ్చిన హీరో ఫ్రెండు.. ‘‘గ్రౌండ్లో చాలా బాల్స్‌ కనిపిస్తాయి కన్ఫ్యూజ్‌ అవ్వకు పెద్ద బాల్‌ మీద ఫోకస్‌ పెట్టు’’ అంటాడు. తర్వాత హీరో గారేమో హీరోయిన్ని చూస్తూ.. ‘‘దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ.. వాడికి రోజూ వాలీబాల్‌ మ్యాచే’’ అని కామెంట్‌ చేస్తాడు. ఇలాంటి డైలాగ్స్‌ ఉన్న లవ్‌ స్టోరీ పట్ల.. సినిమా పట్ల ప్రేక్షకుడికి ఆరంభంలో ఎలాంటి ఫీలింగ్‌ కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రథమార్ధం అంతా ఇలాంటి వల్గర్‌ డైలాగులు.. సిల్లీ సీన్లతోనే నడిచిపోయింది. ఇంటర్వెల్‌ దగ్గర జంట హత్యలతో కథ మలుపు తిరుగుతుంది. ఇక ద్వితీయార్ధం అంతా ట్విస్టులతో ముంచెత్తుతూ థ్రిల్‌ చేయాలని చూస్తే అది పూర్తిగా బూమరాంగ్‌ అయింది. మొత్తంగా చెప్పాలంటే ‘12 ఏ రైల్వే కాలనీ’ అల్లరి నరేష్‌ కు ఏమాత్రం సూట్‌ కాని.. థ్రిల్లర్‌ ప్రియులు కూడా పెద్దగా కనెక్ట్‌ కాలేని సినిమా.

నటీనటులు - పెర్ఫార్మెన్స్‌ :

అల్లరి నరేష్‌ తన కామెడీ ఇమేజ్‌ నుంచి పూర్తిగా బయటికి వచ్చి కార్తీక్‌ లాంటి పాత్ర చేయడం బాగుంది కానీ.. అతను తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే.. మరీ వల్గర్‌ గా అనిపించే డైలాగులు పలుకుతుంటే వినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ‘బోల్డ్‌’ అటెంప్ట్స్‌ చేయడమంటే వల్గర్‌ డైలాగులు చెప్పడం కాదని అతనర్థం చేసుకుంటే మంచిది. నరేష్‌ పెర్ఫామెన్స్‌ విషయంలో ఏమీ ఢోకా లేదు. నటన బాగానే సాగింది. కామాక్షి భాస్కర్లకు కీలకమైన పాత్రే దక్కింది కానీ.. కథ పరంగా తను జరిగిన దాని పట్ల ప్రేక్షకులు కదిలిపోవ్షాలి. కానీ ఏ ఫీలింగ్‌ రాదంటే తన పాత్రను ప్రెజెంట్‌ చేసిన తీరు అంత బ్యాడ్‌ గా ఉందని అర్థం. హీరో స్నేహితుల పాత్రల్లో హర్ష చెముడు.. గెటప్‌ శీను తమకు అలవాటైన రీతిలో నటించారు. పొలిటీషియన్‌ టిల్లు పాత్రలో జీవన్‌ ఓకే అనిపించాడు. సాయికుమార్‌ చేసిన పోలీస్‌ పాత్ర తేలిపోయింది. అనీష్‌ కురువిల్లా తన క్యారెక్టర్ని బాగానే ప్లే చేశాడు. అభిరామి కాసేపే కనిపించినా ఆకట్టుకుంది.

సాంకేతిక వర్గం - పనితీరు :

భీమ్స్‌ సిసిరోలియో నేపథ్య సంగీతం ‘12 ఏ రైల్వే కాలనీ’కి ప్లస్‌. ద్వితీయార్ధంలో కథకు తగ్గట్లుగా ఉత్కంఠ రేకెత్తించేలా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సాగింది. తన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. అసలు సినిమాలో పాటలే అవసరం లేదు. స్పీడ్‌ బ్రేకర్లలా అనిపిస్తాయి. కుశేందర్‌ రమేష్‌ రెడ్డి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. పూర్తిగా స్క్రిప్టు బాధ్యతలు తీసుకున్న అనిల్‌ విశ్వనాథ్‌.. ‘పొలిమేర’ తరహాలోనే ట్విస్టుల మీద కథను నడిపించాలని చూశాడు. కానీ ఆ ప్రయత్నం ఇక్కడ ఫలించలేదు. తన డైలాగులు పేలవం. దర్శకుడు నాని కాసరగడ్డ ద్వితీయార్ధంలో అక్కడక్కడా కొంచెం పనితనం చూపించాడు. కానీ ఓవరాల్‌ గా తన టేకింగ్‌ ఏమంత గొప్పగా లేదు.


- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page