top of page

15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 15 hours ago
  • 2 min read
  • దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు

  • అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం

  • 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం

  • మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగాలు తనకు ఈ వివరాలు అందించారని ఆనాటి ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రచారం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్నారు. కానీ రెండేళ్లు గడిచినా మళ్లీ ఆ ఊసెత్తలేదు. ఒకవేళ నాటి తన ఆరోపణలు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పడం నిజమే అనుకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి తన ఆరోపణల అంతు తేల్చాలిగా! అసలు 30వేల మంది నిజంగా అదశ్యమయ్యారా? అన్నది నిగ్గుతేల్చి ప్రజల ముందు పెట్టాలి. కానీ ఇప్పటికీ అది జరగలేదంటే.. నాటి పవన్ ఆరోపణలను ఎలా భావించాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సరే.. ఆ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఆందోళనలే రేగుతున్నాయి. అయితే ఇవి ఏ రాజకీయ ఆరోపణల కారణంగానో కాకుండా అక్కడి పోలీసులు ప్రకటించిన దిగ్భ్రాంతికర గణాంకాలే ఈ కలవరానికి కారణమవుతున్నాయి. పోలీసు విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఈ ఏడాది తొలి 15 రోజుల్లోనే అంటే జనవరి ఒకటి నుంచి 15వ తేదీ మధ్య ఏకంగా 807 మంది అదశ్యమైనట్లు ఫిర్యాదులు నమోదుకావడంతో అసలు రాజధానిలో ఏం జరుగుతోంది? ఈ అదశ్య ఘటనలకు కిడ్నాపులా, అక్రమ రవాణా వంటి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రోజుకు సగటున 27 మంది

ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం. కొత్త ఏడాది తొలి 15 రోజుల్లో నగరంలో 807 మంది గల్లంతయ్యారు. వీరిలో 137 మంది చిన్నారులు ఉండటం, వారి జాడ ఇంతవరకు తెలియకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అదృశ్యమైన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. కనిపించకుండాపోయిన 807 మందిలో 509 మంది అంటే 63 శాతం మంది మహిళలు, బాలికలే కావడం మహిళల అక్రమ రవాణా జరుగుతున్నదా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసు లెక్కల ప్రకారం సగటున ప్రతిరోజూ 27 మంది అదశ్యమవుతున్నారు. మిస్సింగ్ కేసుల్లో ఇప్పటివరకు 235 మంది ఆచూకీని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన 572 మంది కోసం గాలింపు కొనసాగుతోంది.

యుక్త వయస్కులే లక్ష్యమా?

మిస్సింగ్ కేసుల గణాంకాలు పరిశీలిస్తే యుక్తవయసువారే ఎక్కువగా అదశ్యమవుతున్నట్లు అర్థమవుతోంది. 12 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారు ఎక్కువగా ఈ జాబితాలో ఉన్నారు. జనవరిలో ఈ ఏజ్ గ్రూపువారు 169 మంది అదృశ్యం కాగా వారిలో 121 మంది జాడ ఇంకా తెలియలేదు. వీరిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉండటం గమనార్హం. ఎనిమిదేళ్ల ఏళ్లలోపు వారు తొమ్మిదిమంది అదృశ్యం వారిలో ఆరుగురి జాడ ఇంకా తెలియలేదు. 8 నుంచి 12 ఏళ్లలోపు వారు 13 మంది అదశ్యం కాగా వారిలో పదిమంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. కేవలం 15 రోజుల తక్కువ సమయంలో వందల మంది మాయమవ్వడం సాధారణ విషయం కాదని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలను చూస్తే ఢిల్లీ మహానగరంలో మానవ అక్రమ రవాణా ముఠాలు చురుగ్గా పనిచేస్తున్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని నేరపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పదేళ్లుగా ఇదే పరిస్థితి

ఢిల్లీలో ఈ పరిస్థితి ఏ ఒక్క నెలకో, ఏడాదికో పరిమితం కాదు. గత పదేళ్ల క్రైమ్ రికార్డులు కూడా ఢిల్లీ నగరంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. 2016 నుంచి 2026 మధ్య కాలంలో దేశ రాజధానిలో 18 ఏళ్లలోపు వారు మొత్తం 60,694 మంది అదృశ్యమయ్యారు. వీరిలో 53,763 మందిని కనుగొన్నప్పటికీ 6,931 మంది చిన్నారుల జాడ నేటికీ కనుగొనలేకపోయారు. వారు ఏమయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలో సీసీటీవీలు, భారీగా పోలీసుల పహారా ఉన్నప్పటికీ మిస్సింగ్ ఘటనలు నమోదు కావడం భద్రతా వ్యవస్థపై అనుమానాలు రేకెస్తోంది. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నా పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల మిస్సింగ్ కేసులకు అడ్డుకట్టపడటంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page