top of page

8 వసంతాలు.. కవితాత్మక కథ

  • Guest Writer
  • Jun 23
  • 4 min read

షార్ట్‌ ఫిలింతో ఫీచర్‌ ఫిలిం స్థాయి ఫాలోయింగ్‌ సంపాదించడం అరుదు. ‘మధురం’ అనే లఘు చిత్రంతో అలాంటి పేరే సంపాదించాడు ఫణీంద్ర నర్సెట్టి. తర్వాత ‘మను’తో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ అది నిరాశపరిచింది. చాలా గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు ‘8 వసంతాలు’ అంటూ వచ్చాడు ఫణీంద్ర . ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం...

ree

కథ : శుద్ధి అయోధ్య (అనంతిక) ఆత్మభిమానం ఉన్న అమ్మాయి. తండ్రి చనిపోవడంతో ఓవైపు ఊటీలోని తమ టీ ఎస్టేట్లను చూసుకుంటూ.. మరోవైపు తన అభిరుచి మేరకు రచయితగా పుస్తకాలు రాస్తూ ఉంటుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ లోనూ ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఊటీలో కరాటే- మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించే స్కూల్‌ లో వరుణ్‌ (హను రెడ్డి) అందర్నీ ఓడిస్తుంటే.. శుద్ధి అయోధ్య అతణ్ని ఓడిస్తుంది. ఈ క్రమంలో వరుణ్‌.. శుద్ధి ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. కానీ శుద్ధి తన ప్రేమను వరుణ్‌ కు చెప్పేలోపే అతను ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. అదే సమయంలో శుద్ధి ఎంతో అభిమానించే మార్షల్‌ ఆర్ట్స్‌ గురువు చనిపోతాడు. ఆ తర్వాత శుద్ధి ఏం చేసింది? వరుణ్‌ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? శుద్ధి తన ప్రేమని ఎలా మర్చిపోయింది? గురువు కోసం ఏం చేసింది? శుద్ధి జీవితంలోకి ఇంకో ప్రేమ ఎప్పుడు ఎలా వచ్చింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: భావయుక్తమైన కవిత్వం చదివి మైమరిచిపోయి వేరే లోకంలో విహరిస్తారు కొంతమంది. కానీ ఆ రకమైన అభిరుచి లేని వాళ్లకు అదే కవిత్వాన్ని వినిపించే ప్రయత్నం చేస్తే నా వల్ల కాదు బాబోయ్‌ అని దండం పెట్టేస్తారు. కవిత్వం చదివి ఆస్వాదించినవాళ్లు గొప్పోళ్లు అయిపోరు. అది నచ్చని వాళ్లను టేస్ట్‌ లేదని విమర్శించనూజాలం. ఎవరి అభిరుచి వాళ్లది. ఈ స్పీడు యుగంలో పొయెట్రీ చదివి ఆస్వాదించేవాళ్లు తక్కువైపోయినా సరే.. యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’తో విజువల్‌ పొయెట్రీ రాయడానికి ప్రయత్నించాడు. ఇక ప్రేమకథ అనగానే అబ్బాయి దృక్కోణం నుంచి చర్చించే కథలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఫణీంద్ర భిన్నమైన దారిలో నడిచాడు. అమ్మాయి జీవితంలో ప్రేమ దశలను చర్చించాడు. ఇది ఇంకో రకమైన రిస్క్‌. ఐతే ఫణీంద్ర చాలా సిన్సియర్‌ గా ఒక కన్విక్షన్‌ తోన్ఱే ఈ ప్రయత్నం చేశాడు కానీ.. రెండు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టగలిగాడా అంటే మాత్రం ఔనని చెప్పలేం. ఇందులో కొన్ని బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. చాన్నాళ్ల పాటు గుర్తుండే సంభాషణలున్నాయి. లీడ్‌ యాక్టర్‌ పెర్ఫామెన్స్‌ అయితే కట్టిపడేస్తుంది. విజువల్స్‌.. మ్యూజిక్‌ స్టాండౌట్‌ గా నిలుస్తాయి. ఇన్నీ ఉన్నా కథనం మాత్రం అనుకున్నంతగా రక్తి కట్టలేదు. పెద్దగా మలుపుల్లేని కథ.. ఒక దశ దాటాక మరీ నెమ్మదించే కథనం.. ‘8 వసంతాలు’కు ప్రతిబంధకాలుగా మారాయి. ముందే అన్నట్లు ఒక వర్గం ఈ విజువల్‌ పొయెట్రీని ఆస్వాదించే అవకాశముంది. కానీ అందరినీ ఇది మెప్పిస్తుందా అంటే మాత్రం సందేహమే.

‘8 వసంతాలు’ ట్రైలర్‌ చూస్తేనే ఇది ఎలాంటి కథ.. దీని కథనం ఎలా సాగుతుంది అనే విషయంలో ఒక అంచనా వచ్చేస్తుంది. దానికి ప్రిపేరై థియేటర్లో కూర్చుంటే చక్కటి ఆరంభంతో మెప్పిస్తాడు ఫణీంద్ర. ఒక అమ్మాయి జీవితంలో ప్రేమ సహా వివిధ దశలను లోతుగా చర్చించే ప్రయత్నం చేశాడతను. ఒక రకంగా చెప్పాలంటే ‘నా ఆటోగ్రాఫ్‌’ సినిమాను అమ్మాయి కోణంలో చూస్తున్న భావన కలుగుతుంది ఈ సినిమా చూస్తుంటే. కానీ దీని కథన శైలి మాత్రం వేరు. పొయెటిక్‌ స్టైల్‌ నరేషన్‌.. లోతైన సంభాషణలతో ఇది కొంచెం భిన్నమైన దారిలో నడుస్తుంది. ఆసక్తికరంగా సాగే లీడ్‌ క్యారెక్టర్‌.. అవంతిక పెర్ఫామెన్స్‌.. కంటికి ఇంపైన సన్నివేశాలు.. సోల్‌ ఫుల్‌ మ్యూజిక్‌ తో.. ఒక దశ వరకు ‘8 వసంతాలు’ బాగానే ప్రేక్షకులను ఎంగేజ్‌ చేస్తుంది. ట్రైలర్‌ చూసి సినిమా నుంచి ఏం ఆశిస్తామో అది అందిస్తాడు ఫణీంద్ర.

‘’మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు.. భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప’’ అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్‌ తో ఈ సినిమాను సింప్లిఫై చెప్పొచ్చు. అమ్మాయిని మైమరిచిపోయేలా చేసే తొలి ప్రేమ.. తర్వాత అది చేసే గాయం.. తన వ్యక్తిగత జీవితంలో ఇతర ఒడుదొడుకులు.. ఈ గాయాలన్నింటినీ మాన్పించే మరో ప్రేమ.. ఇలా ఒక అమ్మాయి జీవితంలో 8 సంవత్సరాల్లో జరిగే పరిణామాలను దర్శకుడు చర్చించాడు. ఐతే ఒక దశ వరకు ఈ పరిణామాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎప్పుడైనా సరే ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. కానీ బ్రేకప్‌.. ఎడబాటు.. ఈ కోణంలో కథ నడిచినపుడు ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచడం సవాలే. ఫణీంద్ర ఇక్కడే తడబడ్డాడు. తొలి ప్రేమ కథ ఉన్నంత ఆసక్తికరంగా రెండో కథ అనిపించదు. కథానాయిక జీవితంలో జరిగే ఇతర పరిణామాలు కూడా అనాసక్తికరంగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో చెప్పడానికి పెద్దగా కథ లేకపోయింది. కథనం కూడా మరీ నెమ్మదించి విసుగు పుట్టిస్తుంది. సన్నివేశంలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నపుడే.. డైలాగులు కూడా ఎలివేట్‌ అవుతాయి. కానీ ద్వితీయార్ధంలో ప్రేక్షకుల అటెన్షన్‌ ను రాబట్టే సన్నివేశాలే కరవైపోయాయి. కేవలం అందమైన విజువల్స్‌.. డైలాగ్స్‌ ఎంతని సినిమాను డ్రైవ్‌ చేస్తాయి? కథ ముందుకు కదలక స్ట్రక్‌ అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథనం డెడ్‌ స్లో అయిపోవడంతో ఒక దశ దాటాక ‘8 వసంతాలు’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కాకపోతే క్లైమాక్సుతో మళ్లీ సినిమాకు కొంచెం జీవం వస్తుంది. అక్కడొచ్చే మలుపులు ప్రేక్షకులను తట్టి లేపుతాయి. ముగింపు సన్నివేశాలు మంచి ఫీల్‌ ఇస్తాయి. కానీ అప్పటి వరకు కుదురుగా కూర్చోవడం మాత్రం కష్టమే. ముందే అన్నట్లు ‘8 వసంతాలు’ ఎలాంటి సినిమా అన్నది ట్రైలర్‌ చూసినపుడే ఒక అంచనా వచ్చేస్తుంది. ఆ అంచనా మేరకు ఆస్వాదించగల అభిరుచి ఉన్న వాళ్లు ఒకసారి ట్రై చేయొచ్చు.

నటీనటులు: ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అవంతిక సనిల్‌ కుమార్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఒక కొత్తమ్మాయి ఇంత ప్రభావవంతంగా ఒక పాత్రను పోషించడం అరుదు. సినిమా మొత్తాన్ని భుజాల మీద నడిపించాల్సిన పాత్రలో అవంతిక అద్భుతంగా చేసింది. దర్శకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి న్యాయం చేసింది. ఇటు అందంతో ఆకట్టుకుంటూ.. అటు అభినయంతో కట్టిపడేసింది. ఎక్కువగా క్లోజప్స్‌ ఉన్న సన్నివేశాల్లో ఆమె భావోద్వేగాలను పలిచించిన తీరు మెప్పిస్తుంది. హను రెడ్డి ప్రేమికుడి పాత్రలో.. తన తల్లిదండ్రుల కల కోసం బాధపడే పాత్రలో ఆకట్టుకున్నాడు. తన లుక్‌.. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగున్నాయి. పాత్రకు తగ్గట్లుగా నటించాడు. రవితేజ నెమ్మదస్తుడైన తెలుగు రచయితగా జస్ట్‌ ఓకే అనిపించాడు. హీరోయిన్‌ స్నేహితుడి పాత్రలో కన్నా మెప్పించాడు. అవంతిక తల్లి పాత్రలో నటించిన ఆర్టిస్ట్‌ ఓకే. కానీ గురువు పాత్రలో నటించిన వ్యక్తి మాత్రం ఆ క్యారెక్టర్‌ కు కుదరలేదనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులు మామూలే.

సాంకేతిక వర్గం: ‘8 వసంతాలు’ సాంకేతికంగా ఉన్నతంగా అనిపిస్తుంది. అన్ని టెక్నికల్‌ డిపార్ట్మెంట్స్‌ తమ ప్రతిభను చాటాయి. ముఖ్యంగా విశ్వనాథ్‌ రెడ్డి ఛాయాగ్రహణం విజువల్‌ పొయెట్రీలా అనిపిస్తుంది. దర్శకుడి అభిరుచికి తగ్గట్లు.. అతను ప్రతి సన్నివేశాన్ని అందంగా తీర్చిదిద్దాడు. విజువల్స్‌ ప్రతి సీన్లో ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ కూడా సినిమాకు తన వైపు నుంచి ఇవ్వాల్సిందంతా ఇచ్చాడు. నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. పాటలు కూడా ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఫణీంద్ర నర్సెట్టి.. తన కలం బలాన్ని మాటల్లో బాగానే చూపించాడు. ‘’పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్లం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?’’.. ‘’మనం ఇక్కడికి ఉండటానికి వచ్చాం ఉండిపోవడానికి కాదు’’.. ‘’పిలల్లు తల్లితండ్రుల సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి’’.. ‘’అనాథ అంటే అమ్మానాన్న లేనోడు కాదు ఆశయం లేనోడు’’.. ‘’ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే అదే దిశ కాదు’’.. ఇలా స్ట్రైకింగ్‌ గా అనిపించే లోతైన డైలాగులు చాలానే సినిమాలో ఉన్నాయి. ఒక అమ్మాయి జీవితంలోని ప్రేమ దశల మీద ఓ కథ రాసి డైరెక్ట్‌ చేయాలనుకోవడం సాహసమే. అందుకే ఇది ఎప్పుడూ చూసే సినిమాల్లా అనిపించదు. ఐతే డైలాగుల్లో ఉన్నంత లోతు.. ఈ కథలో కొరవడినట్లు కనిపిస్తుంది. ఈ కథలను నెమ్మదిగానే చెప్పాలి కానీ.. కథలో పెద్దగా మలుపులు లేకపోవడం.. డైలాగుల మీదే ఎక్కువ ఆధారపడడంతో స్క్రీన్‌ ప్లే అంత ఎంగేజింగ్‌ గా అనిపించదు. రచయితగా.. దర్శకుడిగా తన ముద్రను చూపించినా.. మొత్తంగా ఇంకా మెరుగైన పనితనాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page