top of page

అందనున్న సంకల్ప ‘సంపద’!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 4 hours ago
  • 3 min read
  • మళ్లీ తెరపైకి చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్

  • ఏడాది క్రితమే రూ.75 కోట్ల అంచనాతో శంకుస్థాపన

  • కానీ మామోళ్ల ‘సంపద’ అందక కొందరి మోకాలడ్డు

  • తాజాగా కలెక్టర్, కమిషనర్ చొరవతో ముందడుగు

  • అన్నీ అనుకున్నట్లు జరిగితే నాలుగు నెలల్లో ఉత్పత్తి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న తండ్యాంవలస డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో శంకుస్థాపన చేసిన పవర్ ప్లాంట్‌ను తమకు ‘సంపద’ ఇవ్వలేదన్న కక్షతో సుమారు ఏడాదికాలంగా తొక్కిపెట్టారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి చెత్తను ఎదురు సొమ్ములిచ్చి మరీ తరలిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడే చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తామని ముందుకొచ్చినవారి నుంచి ఎవరు ఎంత మామÖళ్ల సంపద ఆశించి భంగపడ్డారో ఏమో గానీ.. ఇన్నాళ్లూ ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్, హెల్త్ అధికారి అండదండలు ఉంటే తప్ప విద్యుత్ ప్లాంట్ శ్రీకాకుళంలో అడుగు పెట్టలేదు. బహుశా ఈ రెండు పాయింట్ల వద్ద చేతులు తడపలేకే సంబంధిత సంస్థ చేతులెత్తేసినట్టుంది. ఎమ్మెల్యే అయిన కొత్తలో గొండు శంకర్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వచ్చిన ఓ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ స్పీడ్‌లో శంకుస్థాపన కూడా జరిపించారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. కలలోకి వచ్చిందో లేక ఏడాది క్రితంనాటి ఘటన గుర్తుకొచ్చిందో తెలియదు గాని కలెక్టర్ దినకర్ పుండ్కర్ కొద్దిరోజుల క్రితం ఈ పవర్‌ప్లాంట్ పనులు ఎంతవరకు వచ్చాయని కొత్త కమిషనర్ హనుమంతు కూర్మారావును అడిగారు. చెత్త నుంచి విద్యుత్ సృష్టించే ప్రాజెక్టా అంటూ నోరెళ్లబెట్టడం ఆయన వంతైంది. ఆనక ఆఫీసుకు వచ్చి పరిశీలిస్తే పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందాలు, శంకుస్థాపనలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఆగమేఘాల మీద సంబంధిత కంపెనీతో మాట్లాడి దీన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు.

ఏడాదిగా పడని ముందడుగు

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు గత ఏడాది ఏప్రిల్‌లో ఎమ్మెల్యే గొండు శంకర్ శంకుస్థాపన చేశారు. అయితే ఏడాది అవుతున్నా అది కార్యాచరణకు నోచుకోలేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరపాలక సంస్థల పరిధిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యÖనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్న ముంబైకి చెందిన ఎన్‌కవరీ వేస్ట్ సొల్యూషన్స్ సంస్థ ఏడాది క్రితమే జిల్లా కేంద్రంలో రూ.75 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే శంకుస్థాన చేసి ఏడాది గడిచినా లీజు అనుమతులు ఇవ్వకపోవడంతో పరిశ్రమ ఏర్పాటుకు నోచుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తే నాలుగు నెలల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు అప్పట్లో ప్రకటించారు. ఏడాదికిపైగా కదలిక లేని ఈ ప్రాజెక్టుపై కమిషనర్ కూర్మారావు ఇప్పుడు చొరవ తీసుకుని కలెక్టర్‌తో చర్చించి నగరపాలక సంస్థ నుంచి విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో యాజమాన్యానికి పూర్తి సహకారం అందించడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు రెండు రోజుల్లో విద్యుత్ ప్లాంట్ ప్రతినిధులు కలెక్టర్, కమిషనర్‌లతో సమావేశమై తదుపరి కార్యచరణ ఖరారు చేయనున్నారు. తండ్యాంవలస డంపింగ్ యార్డ్‌లోనే ప్లాంట్ ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం 20 ఏళ్ల లీజుకు ఇవ్వాలని కోరుతూ ఎన్‌కవరీ వేస్ట్ సొల్యూషన్స్ సంస్థ గతంలోనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. లీజు అనుమతి మంజూరైతే తర్వాత ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కొనుగోలు చేయడంపై ఏపీఈపీడీసీఎల్‌తో పవర్ పŸర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాంట్ నిర్మాణానికి నగర పాలక సంస్థ ట్రాన్‌ఫార్మర్, నీరు అందించాల్సి ఉంటుంది. పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 25 నుంచి 30 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఇప్పుడు ఎదురు డబ్బులిచ్చి విశాఖకు

నగరంలోని 50 డివిజన్లు నుంచి ప్రతి రోజు 100 టన్నుల తడి, పొడి చెత్త వస్తోంది. వీటిని ప్రాసెస్ చేస్తే రోజుకు మÖడు మెగావాట్ల (మÖడువేల యÖనిట్లు) విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. డంపింగ్ యార్డు కోసం 2005లో తండ్యాంవలసలో 19.50 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది. ఆ భూమిలో ఐదు ఎకరాలను విద్యుత్ ప్లాంట్‌కు లీజు ప్రాతిపదికన కేటాయించాల్సి ఉంది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను పారిశుధ్య సిబ్బంది సేకరించి ప్రత్యేక వాహనాల్లో డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. అక్కడ దాన్ని వర్మీ కంపోస్ట్‌గా మార్చి తద్వారా సంపదను సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు 20 ఏళ్లగా పారబోస్తుండటంతో డంపింగ్ యార్డు పెద్ద చెత్త కొండలా తయారైంది. డంపింగ్ యార్డ్‌లో 80 శాతం వరకు చెత్తతో నిండిపోయింది. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ఆరేళ్ల క్రితం విజయవాడకు చెందిన జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సాంకేతిక సాయంతో బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. చెîత్తను ఇంధనంగా మార్చడం లేదా సిమెంట్ కంపెనీలకు పంపడం వంటి చర్యలు చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చినా అవన్నీ ప్రాథమిక దశలోనే నిలిచిపోయాయి. స్థానికుల నుంచి కాలుష్యంపై వ్యతిరేకత పెరగడంతో ఇక్కడ పేరుకుపోయిన చెత్తను విశాఖలోని పరదేశిపాలెం ప్రాంతంలో ఉన్న జిందాల్ బయో వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమకు టిప్పర్లలో తరలించడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ నగరపాలక సంస్థకు ఆర్ధిక భారంగా మారింది. ఇప్పటికే నగరంలో 50 వార్డుల నుంచి 42 క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో వాహనానికి రూ.68 వేలు చొప్పున ప్రతినెలా రూ.28 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతో విద్యుత్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. ఆ క్రమంలోనే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు కమిషనర్ చొరవతో అది సాకారమైతే చెత్త సమస్య పరిష్కారం కావడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం సమకూరే అవకాశం కూడా ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page