సస్పెన్షన్లలో పక్షపాతం.. స్టేట్‌మెంట్‌లలో గందరగోళం
- NVS PRASAD

- 2 hours ago
- 2 min read
విచారణాధికారికి అగ్నిపరీక్షే
మాట మారుస్తున్న అధికారులు
డీడీ లాజిక్కా? ఏటీవో మ్యాజిక్కా?
శుక్రవారం వస్తున్న వనజారాణి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు, అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మధ్య గత నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణపై విచారణ శుక్రవారం ప్రారంభం కానుంది. అయితే ఇది సవ్యంగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసిన డీడీ రవికుమార్‌కు ట్రెజరీ సంఘ నాయకుల మద్దతు కూడా ఉండటమే ఇందుకు కారణం. డీడీ రవికుమార్ ఈ వ్యవహారాన్ని పోలీస్‌స్టేషన్ వరకు తీసుకువెళ్లినప్పటికి ఉన్న పరిణామాలు క్రమంగా మారుతుండటం వల్ల ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

తన ఛాంబర్‌లోకి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని అక్కడే ఉన్న ఒక పెన్షనర్ అక్కలనాయుడు, డఫేదార్ సుబ్రహ్మణ్యంలను బయటకు పంపేసి తన మీద దాడికి పంపించారంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన డీడీ రవికుమార్ ఇప్ప్పుడు దాడి జరిగినప్ప్పుడు ప్రత్యక్ష సాక్షులుగా అక్కలనాయుడు, సుబ్రహ్మణ్యం ఉన్నారని, వారిని ప్రశ్నించాలంటూ విచారణాధికారిని కోరడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే తనపై దాడి చేయడానికి వచ్చారని ఒకసారి, లేదు యÖనియన్ వ్యవహారాలు మాట్లాడుకొని కరచాలనం చేసుకున్నామని మరోసారి చెప్ప్పుకొచ్చిన ఏటీవో రమణారెడ్డి వ్యవహార శైలి కూడా ఈ ఎంక్వైరీ ఎటువైపు తూగుతుందో చెప్పలేకపోతున్నారు. మార్చిలో ఓ సెలవురోజున డ్యూటీకి రావాలని ఏటీవో రమణారెడ్డి ఉద్యోగులను కోరారు. అయితే విధులకు హాజరైనట్లు సంతకాలు మాత్రం రెగ్యులర్ రిజిస్టర్‌లో కాకుండా వేరేదానిలో పెట్టాలని కోరారు. దీనికి సంఘ నాయకుల్లో ఒకరు అభ్యంతరం తెలిపారు. స్వయంగా డీడీనే ఈ విషయం చెప్పలేదని, ఏటీవో వేరే రిజిస్టర్ అని చెప్పడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన జీవో మేరకే తాను చెబుతున్నానని రమణారెడ్డి తెలపడంతో సంఘ నాయకులు బొత్స శ్రీనివాస్, వరప్రసాద్, శ్రీరామ్‌లు ఏటీవో రమణారెడ్డి బల్ల మీద గట్టిగా గుద్ది వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఏటీవో ఒకసారి డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరోసారి కేవలం యÖనియన్ విషయాలే మాట్లాడుకొని షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటున్నామంటూ రిప్లై ఇచ్చారు. ఇప్ప్పుడు ఈ రెండు స్టేట్‌మెంట్లలో విచారణాధికారి వనజారాణి ముందు ఏటీవో ఏం చెబుతారో చూడాలి. కొద్ది నెలల్లో రిటైరవుతున్నారు కాబట్టి తనకెందుకు ఈ తలనొప్పనుకుంటారో? లేదూ అంటే రిటైరైపోయిన తర్వాత తననెవరూ ఏమీ పీకలేరని నిలబడతారో వేచిచూడాలి. మొత్తం 15 మంది విచారణకు హాజరు కావాలని ఎంక్వైరీ ఆఫీసర్ వనజారాణి మెసేజ్ చేశారు. ఇందులో సస్పెండైన ఏడుగురు కూడా ఉన్నారు. వాస్తవానికి డీడీ మీద దాడి చేయడానికి వచ్చారని ఏడుగుర్ని సస్పెండ్ చేసినట్లే ఏటీవో మీద దాడికి వచ్చారని వెళ్లిన ఫిర్యాదులో ఉన్నవారిని కూడా డీడీ సస్పెండ్ చేసివుండాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అలాగే బెండి మోహనరావుకు, డీడీకి మధ్య చెలరేగిన ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారి సస్పెన్షన్ వరకు వెళ్లింది. అయితే తప్పంతా బెండి మోహనరావుదేనని డీడీ ఒప్ప్పుకుంటే, మిగిలినవారిని వదిలేస్తానంటూ ఒక ఎస్‌టీవో, ఒక ఏటీవో, ఒక అకౌంటెంట్‌తో రాయభారం కూడా నడిపారు. అయితే మిగిలిన ఆరుగురు ఇందుకు అంగీకరించకపోవడంతో ఏడుగురి మీదా వేటేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఏమీ జరగలేదని చెప్పి రాజీకి వచ్చిన డీడీ ఆ తర్వాత సస్పెండ్ చేయడం, అందులో ఏటీవో మీద తిరగబడినవారు లేకపోవడం వంటివి ఎంక్వైరీ అధికారిణి ఏమేరకు పరిశీలిస్తారో చూడాలి.






Comments