top of page

అతన్ని పట్టుకోవడం ఇంకా కష్టమా?

  • Guest Writer
  • 3 days ago
  • 2 min read
ree

ఐబొమ్మ రవి అరెస్ట్‌ వార్తతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అందరూ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. నిజమే, ఒక పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను చేధించడం సామాన్య విషయం కాదు. కానీ, టెక్నాలజీ తెలిసిన వాళ్లు, సైబర్‌ క్రైమ్‌ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఐబొమ్మ రవి కేవలం ఒక చిన్న చేప మాత్రమేనని, అసలైన తిమింగలం ‘మూవీ రూల్జ్‌’ ఇంకా సముద్రం లోతుల్లోనే సురక్షితంగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఐబొమ్మను పట్టుకున్నంత ఈజీగా మూవీ రూల్స్‌ ను పట్టుకోవడం సాధ్యం కాదన్నది వారి వాదన. దీని వెనుక బలమైన సాంకేతిక కారణాలు ఉన్నాయి.

ఐబొమ్మ రవి వాడిన టెక్నాలజీ, ఆపరేషన్స్‌ అన్నీ ఒక పరిధిలో ఉన్నాయి కాబట్టే పోలీసులకు ఆధారాలతో దొరికిపోయాడు. రవి ప్రధానంగా ‘డైరెక్ట్‌ సర్వర్‌ స్టోరేజ్‌’ పద్ధతిని ఫాలో అయ్యాడని తెలుస్తోంది. అంటే సినిమా ఫైల్‌ మొత్తాన్ని ఒకే సర్వర్‌ లో లేదా క్లౌడ్‌ లో దాచిపెట్టి, దాన్ని యూజర్స్‌ కి స్ట్రీమ్‌ చేయడం లేదా డౌన్లోడ్‌ లింక్‌ ఇవ్వడం. ఇక్కడ ‘సోర్స్‌’ ఒకే చోట ఉంటుంది కాబట్టి, పోలీసులు ఆ ఐపీ అడ్రస్‌ ను ట్రేస్‌ చేసి, సర్వర్‌ లొకేషన్‌ ను కనిపెట్టగలిగారు. కానీ మూవీ రూల్స్‌ కథ వేరు.

మూవీ రూల్జ్‌ వాడేది ‘టొరెంట్‌’ టెక్నాలజీ. దీన్నే పీర్‌ టు పీర్‌ పీ2పీ నెట్‌వర్క్‌ అంటారు. ఇక్కడ సినిమా ఫైల్‌ అనేది ఒకే సర్వర్‌లో ఉండదు. ఆ ఫైల్‌ వేల, లక్షల చిన్న ముక్కలుగా విడిపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ యూజర్ల కంప్యూటర్లలో ఉంటుంది. మనం మూవీ రూల్స్‌ నుంచి ఒక సినిమా డౌన్లోడ్‌ చేస్తున్నామంటే, అది ఒకే సోర్స్‌ నుంచి రావడం లేదు. మన పక్క ఇంట్లో ఉన్న వాడి దగ్గరో, లేదా వేరే దేశంలో ఉన్న వాడి దగ్గరో ఉన్న ఫైల్‌ ముక్కలు మనకు వచ్చి చేరతాయి.

ఇక్కడ మరో క్లిష్టమైన విషయం ఏంటంటే.. మనం సినిమా డౌన్లోడ్‌ చేసుకుంటున్న అదే సమయంలో, మనకు తెలియకుండానే మన సిస్టమ్‌ నుంచి ఆ ఫైల్‌ ముక్కలు వేరే యూజర్‌ కి అప్లోడ్‌ అవుతుంటాయి. అంటే డౌన్లోడ్‌ చేసే ప్రతి వ్యక్తీ, ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసే ఒక చిన్న సర్వర్‌గా మారిపోతాడు. ఈ గొలుసుకట్టు విధానంలో అసలు ఆ ఫైల్‌ని మొదట ఎవరు పెట్టారు? ప్రధాన సర్వర్‌ ఎక్కడ ఉంది? అని కనిపెట్టడం గడ్డివాములో సూది వెతకడం లాంటిదే. ఐబొమ్మ రవికి ఒక నిర్దిష్టమైన అడ్రస్‌, లొకేషన్‌ దొరికింది. కానీ మూవీ రూల్జ్‌ అనేది ఒక వికేంద్రీకృత వ్యవస్థ. దానికి ఒక తల అంటూ ఉండదు. ఒక వెబ్‌ సైట్‌ డొమైన్‌ ని బ్లాక్‌ చేస్తే, గంటలోపే మరో ఎక్స్టెన్షన్‌ తో కొత్త సైట్‌ పుట్టుకొస్తుంది. వారి సర్వర్లు, ఆపరేషన్స్‌ అన్నీ రష్యా, లేదా చట్టాలు అంత కఠినంగా లేని ఐలాండ్స్‌ లో ఉంటాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. అక్కడి నుంచి డేటాను ట్రేస్‌ చేయడం భారత పోలీసులకు అంతర్జాతీయ చట్టాల రీత్యా సవాలుతో కూడుకున్న పని.

అంతేకాకుండా, మూవీ రూల్జ్‌ వెనుక ఉన్నవారు సాదాసీదా వ్యక్తులు కాదు. వారు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌ వీపీఎన్‌ డార్క్‌ వెబ్‌, క్రిప్టో కరెన్సీ వంటి అడ్వాన్స్డ్‌ టెక్నాలజీలను వాడుతూ తమ ఉనికిని ఎప్పటికప్పుడు మాయం చేసుకుంటారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఐబొమ్మ రవి చేసినట్లుగా డైరెక్ట్‌ బ్యాంక్‌ ట్రాన్సాక్షన్స్‌ లేదా ఫోన్‌ పే నంబర్లు అక్కడ దొరకవు. అంతా రహస్య మార్గాల్లోనే నడుస్తుంది. అందుకే ఇన్నేళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని చట్టాలు వచ్చినా మూవీ రూల్స్‌ ను పూర్తిగా బంద్‌ చేయలేకపోయారు. అయితే మూవీ రూల్జ్‌ ను పట్టుకోవడం అసాధ్యం అని కాదు, కానీ చాలా కష్టం. దానికి కేవలం లోకల్‌ పోలీసులు సరిపోరు. ఇంటర్నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీల సహకారం కావాలి. అలాగే టొరెంట్‌ ప్రోటోకాల్స్‌ ని బ్లాక్‌ చేయగల అడ్వాన్స్డ్‌ ఫైర్‌ వాల్స్‌ ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు %Iూూ% అమలు చేయాలి. కానీ అది వాక్‌ స్వాతంత్య్రం, ఇంటర్నెట్‌ న్యూట్రాలిటీ వంటి ఇతర అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆచరణలో కష్టమవుతోంది. ఏదేమైనా, ఐబొమ్మ రవి అరెస్ట్‌ అనేది ఒక హెచ్చరిక మాత్రమే. కానీ మూవీ రూల్జ్‌ అనేది ఒక వ్యవస్థ. దాన్ని కూల్చాలంటే సాంకేతిక యుద్ధమే చేయాలి. కేవలం ఒకరిని అరెస్ట్‌ చేసి సంబరపడితే లాభం లేదు. మూలాల్లో ఉన్న ఈ టొరెంట్‌ టెక్నాలజీని, దాన్ని ఆపరేట్‌ చేస్తున్న మాస్టర్‌ మైండ్స్‌ ను ట్రేస్‌ చేసేంత వరకు పైరసీ భూతం ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంటుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page