అన్నీ కలగలిసిన ఆణిముత్యం ..స్వాతిముత్యం
- Guest Writer
- 2 days ago
- 2 min read

నెత్తురు వస్తేనే విప్లవం కాదు నెత్తురు, అరుపులు లేకుండా కూడా నిశ్శబ్ద విప్లవాలను తీసుకుని రావచ్చు. అలాంటి నిశ్శబ్ద విప్లవ వీరుడు విశ్వనాథ్. మొగోడికో నీతి ఆడదానికో నీతా అని నిర్మలమ్మ పాత్ర చేత నిలేయిస్తాడు విశ్వనాథ్. భార్య చనిపోయాక మూడు నెలలకే రెండో పెళ్లి చేసుకున్న నువ్వటరా ప్రశ్నించేదని అల్లుడు సుత్తి వీరభద్రరావుని వాయిస్తుంది.
సినిమా ఫోకస్ ఈ విధవా వివాహం మీద కాకపోయినా అంతర్లీనంగా ఈ విప్లవ భావాన్ని జొప్పించారు విశ్వనాథ్. సినిమా ఫోకస్ వయసు పెరిగినా బుధ్ధి పెరగని ఒక అమాయకుడిని, స్వాతిముత్యాన్ని ఓ నిస్సహాయ విధవ అనూహ్య పరిస్థితుల్లో భార్య అయి ఎలా ప్రయోజకుడిని చేసుకుంటుంది అనే అంశం మీదనే. మా తరం వాళ్ళకు అక్కినేని, సావిత్రిలు నటించిన అర్ధాంగి సినిమా గుర్తుకొస్తుంది. కధానాయికలు అర్ధాంగులు కావటంలో చాలా వ్యత్యాసం ఉంది.
1986 మార్చి 13న విడుదలయిన ఈ స్వాతిముత్యం సినిమా అనగానే ఎక్కువ మందికి కమల్ హాసన్, విశ్వనాధులే గుర్తుకొస్తారు. వారిద్దరికీ అవార్డులు కూడా వచ్చాయి. అంతే ధీటుగా, బహుశా ఇంకా గొప్పగా రాధిక నటించింది. ఆమెకు అవార్డు ఎందుకు రాలేదో నాకెప్పుడూ ఆశ్చర్యమే. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర దీపది. ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో గ్లామరస్ రబ్బర్ బొమ్మగా చూపబడే దీపకు చాకలి పాత్రను ఇచ్చి, ఆ పాత్రలో దీప చేత గొప్ప నటనని రాబట్టారు విశ్వనాథ్.
నిర్మలమ్మ. మనకున్న మహానటీమణుల్లో ఒకరు ఆమె. ఆర్ద్రత, కరుణ, ప్రశ్నించే పాత్రల్లో ఆమెకు ఆమే సాటి. ఈ సినిమాలో కూడా గొప్ప నటనని అందించారు. ఇతర ప్రధాన పాత్రల్లో శరత్ బాబు, మేజర్ సుందరరాజన్, సుత్తి వీరభద్రరావు, డబ్బింగ్ జానకి, వరలక్ష్మి, అనిత, వై విజయ, గొల్లపూడి మారుతీరావు, ఆలీ, సోమయాజులు, పొట్టి ప్రసాద్ నటించారు.
ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర రాధిక సినిమాలో కనిపించని మొదటి భర్త కొడుకు. పేరు కార్తీక్. ప్రముఖ నటుడు కాంతారావు మనమడు. అల్లు అర్జున్ కూడా మనమళ్ళలో ఒకడిగా తళుక్కుమంటాడు. కార్తీక్ కమల్‌హాసన్ దోస్తుగా చాలా బాగా నటించాడు.
ఈ సినిమా ఘనవిజయానికి, ఓ శ్రవణకావ్యంగా మిగిలిపోవటానికి కారణం ఇళయరాజా సంగీతం, సి నారాయణరెడ్డి ఆత్రేయ సిరివెన్నెల సీతారామశాస్త్రుల పాటల సృష్టి, బాలసుబ్రమణ్యం సుశీలమ్మ జానకమ్మ శైలజల తీయటి గాత్రం. రామా కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా హరికధను ఆత్రేయ ఎంత గొప్పగా వ్రాసారు!! సినిమాకు ఆయువుపట్టు కూడా ఈ పాట. సీతారాముల కళ్యాణం, ధనాల్న మంగళసూత్రాన్ని లాగేసుకుని కమల్ హాసన్ రాధిక మెడలో కట్టేసే సన్నివేశాలే సినిమాను మలుపు తిప్పుతాయి.
ప్రతీ పాట మధురమే. అయినా ఇళయరాజాకు అవార్డు ఎందుకు రాలేదో ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలుగుతుంది. లాలీ లాలీ లాలీ లాలీ వటపత్ర సాయికి వరహాల లాలీ రాజీవ నేత్రునికి రతనాల లాలీ పాటను నారాయణరెడ్డి గారు ఎంత బాగా వ్రాసారో!! ఆయన వ్రాసిందే మరో సుందర మధుర గీతం మనసు పలికె మౌనగీతం. విశ్వనాథ్ అద్భుతంగా చిత్రీకరించారు.
నాకు బాగా ఇష్టమైన మరో పాట దీప, కమల్ హాసన్ల మీద సాగే పాట. ఆత్రేయ వ్రాసిన తాళి బొట్టు తెస్తానని తాళ్ళరేవుకెళ్ళిండు మామ. కమల్ హాసన్ని ఆ ఉరి జనమంతా పసిపిల్లవాడిగా ఎలా చూస్తారో దీప అతని చేత వీపు రుద్దించుకునే సీన్ తెలియచేస్తుంది. ఇంతటి శృంగార రస భరిత, సున్నితమైన సీన్లను సినిమాలో దూర్చటం విశ్వనాధుకి బాగా తెలుసు. ఈ సీన్ చూడగానే సాగర సంగమం సినిమాలో జయప్రద స్నాన సన్నివేశం గుర్తుకొస్తుంది రస హృదయులకు.
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నారి పొన్నారి కిట్టయ్యా పాట చిత్రీకరించబడిన దేవాలయం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడిదో ఈ దేవాలయం తెలియదు. ఈ సినిమాలో ఉన్న మరో పాట ధర్మం శరణం గఛ్ఛామి దానం శరణం గఛ్ఛామి అని దానాన్ని కూడా తగిలించారు ఆత్రేయ. తోటపల్లి సాయినాధ్, ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ చక్కటి సంభాషణలను అందించారు.
సినిమాకు కనకంతో పాటు, ప్రశంసలు, పురస్కారాలు కూడా వర్షించాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ చిత్రంగా ఏడిద నాగేశ్వరరావుకు, ఉత్తమ నటుడిగా కమల్ హాసనుకి, ఉత్తమ దర్శకునిగా విశ్వనాధుడికి నంది అవార్డులు వచ్చాయి. విశ్వనాధుడికి ఉత్తమ దర్శకునిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ అవార్డుకి పంపబడిరది కానీ ఎంట్రీ రాలేదు. ఇదీ ఘనమే. ఎన్నో ఫిలిం ఫెస్టివల్సులో ప్రదర్శించబడిరది.
ఈశ్వర్ అనే టైటిలుతో విశ్వనాధే హిందీలోకి రీమేక్ చేసారు. కన్నడంలోకి రీమేక్ చేయబడిన సినిమాలో సుదీప్ , మీనా నటించారు. తమిళంలోకి డబ్ చేయబడిరది. శంకరాభరణం తీయబడిన పట్టిసీమ ప్రాంతంలో, తొర్రేడు, రాజమండ్రి ప్రాంతాలలో షూటింగ్ చేయబడిరది.
ఇంత అందమైన నిశ్శబ్ద విప్లవ సంగీత భరిత చిత్రాన్ని చూడని తెలుగు ప్రేక్షకుడు మా తరంలో ఉండరేమో ! ఈతరంలో ఎవరయినా ఒకరూ అరా ఉంటే అర్జెంటుగా చూసేయండి. బిపి ఉంటే తగ్గుతుంది. మనసు తెలియని అందాల సంగీత లోకాల్లో విహరిస్తుంది.
- సుబ్రమణ్యం దోగిపర్తి
Comments